తనకు సరైన రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదని, మోడీ అంటే గౌరవం వున్నా, తన దారి తాను చూసుకుంటానని, భాజపాకు నచ్చని వామపక్షాలతో, భాజపాను గత ఎన్నికల్లో ఢీ కొన్న తెలుగుదేశంతో కలిసి పోరు సాగిస్తానని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కుండ బద్దలు కొట్టారు. దాంతో ఇక తెలుగుదేశం వర్గాలు, దాని మూలాల్లో వున్న సామాజిక వర్గం సంబరాలు చేసేసుకున్నాయి. పవన్ మనవాడు అయిపోయాడు అని వాళ్లు, ఇక అతగాడు పగవాడే అని వీళ్లు డిసైడ్ అయిపోయారు.
ఇంక అధికారం చేతిలోకి వచ్చేసినట్లే అని తెలుగుదేశం పార్టీ, దాని అభిమానులు, దాని మూలాల్లోని సామాజిక వర్గం చంకలు గుద్దుకుంటుంటే, భాజపా కుండెడు నీళ్లు జల్లేసింది. తాము తెలుగుదేశం పార్టీని దగ్గరకు చేరనీయమని చెప్పేసింది. అక్కడితో ఆగకుండా తెలుగుదేశంతో తమ చేదు అనుభవాన్ని నెమరు వేసుకుంది. ఆ పార్టీ మీద అవినీతి మరక కూడా వేసింది.
ఇక ఇప్పుడు పవన్ ఏం చేయాలి? పవన్ చేయి వదలము అని భాజపా అంటోంది. పవన్ చేయి పట్టుకునే ప్రయత్నం తెలుగుదేశం చేస్తోంది. పవన్ కేమో రెండు చేతులు పట్టుకుని నడవాలని వుంది. కానీ అది ఎలా సాధ్యం అన్నదే పాయింట్. మల్టీ స్టారర్లు సినిమాల్లో సాధ్యం కావచ్చు కానీ రాజకీయాల్లో కష్టం. ఈ సంగతి తెలియకుండా పవన్ ఏదేదో కలలు కంటూ ఊహల్లో విహరిస్తూ మాట్లాడేస్తుంటారు.
అలాంటపుడు ఇదిగో ఇలా కౌంటర్లు వచ్చి పడి, పరువు తీస్తుంటాయి. ఇప్పుడు బంతి మళ్లీ వెనక్కు వచ్చి పవన్ కోర్టులో పడింది. భాజపాతో వుంటే తేదేపాతో వెళ్లలేరు. అలాంటపుడు తెగతెంపులు చేసుకోవడమే అనివార్యం. అలా చేసుకోవడం పవన్ కు బాగానే వుండొచ్చు. కానీ తమ చేయి వదిలేసి వెళ్లడానికి కారణం తెలుగుదేశమే అనే పగను మోడీ పెంచుకుంటే చంద్రబాబుకు చెమటలు పట్టేస్తాయి.
అప్పుడు ఆయనే త్యాగరాజుగా మారి, పవన్ ను తన దగ్గరకు రావద్దని చెప్పినా చెబుతారు. మొత్తానికి ఇదో ముక్కోణపు ప్రేమకథలా మారుతోంది.