ఎమ్బీయస్: ఎంపీ ఉపయెన్నికలు – సింధియాకే పరీక్ష

నవంబరు 3న మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఉపయెన్నికలు జరుగుతున్నాయి. వీటి ఫలితాల వలన ప్రభుత్వం మనుగడ ముప్పులో పడుతుందని అనుకోవడానికి లేదు కానీ మార్చి నెలలో కాంగ్రెసులోంచి తన అనుచరులతో సహా బిజెపిలోకి…

నవంబరు 3న మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఉపయెన్నికలు జరుగుతున్నాయి. వీటి ఫలితాల వలన ప్రభుత్వం మనుగడ ముప్పులో పడుతుందని అనుకోవడానికి లేదు కానీ మార్చి నెలలో కాంగ్రెసులోంచి తన అనుచరులతో సహా బిజెపిలోకి గెంతిన జ్యోతిరాదిత్య సింధియా పరువు నిలుస్తుందా లేదా అనేది మాత్రం తేలుతుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సీట్లు 230. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసుకు 114, బిజెపికి 109, ఇతరులకు 7 (బిఎస్‌పికి 2, ఎస్‌పికి 1, స్వతంత్రులకు 4) వచ్చాయి. ఇతరులతో కలిసి కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. 15 నెలల తర్వాత సింధియా 22 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలతో కలిసి బిజెపిలో చేరాడు. ముగ్గురు శాసనసభ్యులు మరణించడంతో ప్రస్తుతం బిజెపికి 107 మంది, కాంగ్రెసుకు 88 మంది ఉన్నారు.

పార్టీ ఫిరాయించిన 25 మంది ప్లస్ చనిపోయిన 3గ్గురి స్థానాల్లో మొత్తం 28 స్థానాల్లో ఉపయెన్నికలు జరుగుతున్నాయి. ఫిరాయించిన 25 మందికీ బిజెపి టిక్కెట్లిచ్చింది. 230 స్థానాల అసెంబ్లీలో అధికారం దక్కాలంటే 116 సీట్లు రావాలి. అంటే బిజెపికి 9 వస్తే చాలు, కాంగ్రెసుకు మాత్రం ఇరవై ఎనిమిదీ రావాలి. పోనీ 21 వచ్చి ఆగితే, గతంలో కాంగ్రెసుకు, ప్రస్తుతం బిజెపికి మద్దతిస్తున్న యితరులు 7గురిని తనవైపు తిప్పుకుని ప్రభుత్వం ఏర్పరుస్తుందని అనుకున్నా, 28 లో 21 సీట్లు గెలవడం మాటలేమీ కాదు. 28లో 7 గెలవడం బిజెపికి కష్టమేమీ కాదు కాబట్టి, ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్‌కు వచ్చే ముప్పేమీ లేదు. అయితే వచ్చిన కష్టమంతా సింధియాకే. ఎందుకంటే అతను 22 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చి బిజెపితో చచ్చేట్లా బేరాలాడాడు. కాబినెట్ కూర్చడానికి 100 రోజుల పైనే పట్టింది. చివరకు కాబినెట్‌లో 40 శాతం పదవులు అంటే 14 మంత్రి పదవులు పుచ్చుకున్నాడు.

సింధియా తండ్రి కాలం నుంచి కాంగ్రెసుకు విధేయుడు. కొత్తగా బిజెపి నామం పెట్టుకుని యిన్ని పదవులు తీసేసుకోవడంతో ఎప్పణ్నుంచో పార్టీకి విధేయులుగా వున్న బిజెపి వాళ్లకు కడుపు మండుతోంది. సింధియాకు అంత ప్రాముఖ్యత యివ్వాలా అని వాళ్లు మండిపడుతున్నారు. తాము కష్టపడి యీ 25 మందినీ నెగ్గించినా, వాళ్లు సింధియాకే విధేయులుగా వుంటారు తప్ప, బిజెపి పార్టీకి కాదని వారికి తెలుసు. ఈ విముఖతను అధిగమించి సింధియా అర్జంటుగా తన సత్తా చాటుకోకపోతే బిజెపిలో తన పరువు నిలవదు. కాబినెట్‌లో తన తరఫు మంత్రుల సంఖ్య తగ్గిపోవచ్చు కూడా. ఈ పరిస్థితుల్లో తనతో పాటు గోడ దూకిన 22 మందినీ నెగ్గించుకుని తీరాలి. అందులో 16 మంది సీట్లు తన కంచుకోట లాటి గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోనే ఉన్నాయి. అది సాధించగలడా లేదా అనే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఆ ప్రాంతంలో 34 సీట్లున్నాయి. సింధియా అక్కడే నాయకుడిగా వున్నా కాంగ్రెసుకు ఎన్నడూ 18 దాటి రాలేదు. 2018లో మాత్రం వివిధ కారణాల వలన 26 వచ్చాయి. ఆ కారణాలలో బిజెపిలో అంతఃకలహాలు ఒకటి. వాటి కారణంగా రాష్ట్రం మొత్తం మీద 50 సీట్లు పోయాయని ఒక అంచనా, మరొక కారణం, దళిత ఓట్లు గుండుగుత్తగా కాంగ్రెసుకు పడడం. సాధారణంగా బిఎస్‌పికి అక్కడ బలం వుంది. అది కొన్ని ఓట్లు పట్టుకుని పోతూ వుంటుంది. కానీ బిజెపి దళితవ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఎన్నికలకు ముందు అక్కడ ఆందోళనలు జరిగాయి. అందుకని బిజెపిని కట్టడి చేయడానికి దళితులందరూ కాంగ్రెసుకే ఓటేశారు. ఆ ఓట్లన్నీ సింధియాను చూసే పడ్డాయని అనుకోవడానికి లేదు. సాధారణంగా ఉపయెన్నికలలో పోటీ చేయని బిఎస్‌పి ఈసారి తన పంథా మార్చుకుని పోటీ చేస్తోంది. అది బిజెపి, కాంగ్రెసులలో ఎవరి ఓట్లు చీలుస్తుందో తెలియదు.

గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో దిగ్విజయ్ సింగ్‌కు కూడా బలం వుంది. దిగ్విజయ్-సింధియా యిద్దరూ కలిసి ప్రచారం చేయడంతో అప్పుడు అన్ని సీట్లు వచ్చాయి. ఇది మూడో కారణం. ఇప్పుడు దిగ్విజయ్, సింధియా వేర్వేరు పార్టీల్లో వున్నారు. సింధియాను అవమానించడంలో దిగ్విజయ్, కమల్‌తో చేతులు కలిపినా దరిమిలా యిద్దరూ వేరుపడ్డారు. అందుకని యీ సారి ప్రచారంలో దిగ్విజయ్ పాల్గొనటం లేదు. కమల్ నాథ్‌కు ఆ ప్రాంతంలో పలుకుబడి లేదు. ఇది సింధియాకు కలసివచ్చే అంశం. ఈ ఉపయెన్నికలలో గెలుపనేది సింధియాకు జీవన్మరణ సమస్య అయిపోయింది. బిజెపికి అతనికి చాలా విలువ నిచ్చి పార్టీ ఫిరాయించిన కొద్ది గంటల్లోనే రాజ్యసభ సభ్యత్వం యిచ్చింది. అతని అనుయాయులకు పెద్దపీట వేసింది. ఇప్పుడు నెగ్గకపోతే మొత్తం ఆవిరై పోతుంది.

అతని అసలు సమస్యంతా బిజెపిలో తనంటే పడని స్థానిక నాయకులతోనే వుంది. వాళ్లకు జీవితమంతా సింధియా కుటుంబాన్ని వ్యతిరేకించడంలోనే గడిచిపోయింది. ఇప్పుడు యీ ఫిరాయింపుదారుణ్ని చంక కెక్కించుకుని, తమను అతని ముందు సాగిలబడమని పార్టీ అడగడంతో మండిపడుతున్నారు. రెండేళ్ల క్రితం వాళ్లు ఏ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ చేసి, కొద్ది మార్జిన్‌తో ఓడిపోయారో వాళ్ల కోసం యిప్పుడు తమ శక్తియుక్తులు ధారపోసి పోరాడాలంటే బాధగా వుంది. పైగా సింధియా అభ్యర్థులలో చాలామంది అంతకు ముందు తమ చేతిలో ఓడిపోయినవారే. 2018లో అదృష్టం బాగుండి గెలిచారంతే!

ఈ 16 స్థానాల్లోనే కాదు, యింకో 9 స్థానాల్లో కూడా యిదే పరిస్థితి. ఆర్నెల్ల క్రితం దాకా వాళ్లను తిట్టిన నోళ్లతోనే వాళ్లను పొగడాలంటే బిజెపి నాయకులకు యిబ్బందిగా వుంది. ఈ కడుపుమంట కారణంగా బిజెపిలో తిరుగుబాటు అభ్యర్థులు ఎక్కువయ్యారు. వారిలో 6 గుర్ని కాంగ్రెసు తన పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టింది. ఆ విషయం మర్చిపోయినట్లు ‘ఈ 25 మంది ఫిరాయింపుదార్లను ఓడించండి’ అని ఓటర్లకు పిలుపు నిస్తోంది. అయితే యిక్కడో తేడా వుంది. బిజెపి నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించినవారు అధికారంలో లేనప్పుడు మారారు. కాంగ్రెసు నుంచి ఫిరాయించినవారు ఒక పార్టీ టిక్కెట్టు మీద గెలిచి వేరే పార్టీలోకి గెంతారు.

కమల నాథ్ ఎప్పుడూ కేంద్రమంత్రిగా దిల్లీలోనే వుండేవాడు. మధ్యప్రదేశ్‌లో కష్టపడి ఊరూరూ తిరిగినవాడు కాదు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసుకు చాలా తక్కువ మెజారిటీ రావడంతో రాజకీయ చాకచక్యం ప్రదర్శిస్తాడని ఆశించి, యువకుడైన సింధియాను పక్కనబెట్టి ముఖ్యమంత్రిని చేస్తే 15 నెలల్లోనే అధికారం పోగొట్టుకున్నాడు. పోవడానికి కారణమైన సింధియాపై కసితో వున్నాడు. అందుకని 74 ఏళ్ల వయసులో కష్టపడి ఒంటి చేత్తో ప్రచారం నిర్వహిస్తున్నాడు. గతంలో ప్రణాళికలు రచించినవాడే తప్ప సభల్లో పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడంతో అపభ్రంశపు కూతలు వస్తున్నాయి. తన పార్టీ నుంచి సింధియాతో పాటు బిజెపికి ఫిరాయించి, మంత్రిణి అయిపోయిన ఇమార్తీ దేవిని ‘ఐటమ్’ అన్నాడు.

దాంతో అల్లరల్లరి అయింది. మాట వెనక్కి తీసుకున్నాడు. అయినా ఇమార్తీ దేవి ‘లుచ్ఛే లఫంగే లందరూ భవిష్యత్తులో కమల్ నాథ్‌లు అవుతారు’ అంది. ఈ లోగా బిజెపి కమల్‌పై ఎన్నికల కమిషనర్‌పై ఫిర్యాదు చేయడం, వాళ్లు కాంగ్రెసు స్టార్ కాంపెయినర్ లిస్టు నుంచి యితన్ని తప్పించడం జరిగాయి. ‘నన్ను కప్ప అనలేదా? రావణుడని అనలేదా? అయినా ప్రచారకుల లిస్టు తయారుచేసేది పార్టీ, మీకేం అధికారం వుంది?’ అంటూ ఇసిపై సుప్రీం కోర్టుకి వెళ్లాడు. కోర్టు స్టే యిచ్చింది.

ఈ 28 సీట్లలో 18 గెలిచినా, తిమ్మిని బెమ్మి చేసి, మళ్లీ అధికారంలోకి వచ్చేయవచ్చని కమల్ నాథ్ ఆశ. 7, 8 కంటె ఎక్కువ రానీయకూడదని శివరాజ్ చౌహాన్ పంతం. అందుకే అధికారంలోకి వస్తూనే సంక్షేమ పథకాల జోరు పెంచాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.75 లక్షల మందికి కొత్త యిళ్ల తాళం చెవులు యిస్తానంటున్నాడు. ఇప్పటివరకు రేషన్ దక్కని 37 లక్షల మందికి రేషన్లు యిస్తానంటున్నాడు. 20 లక్షల మంది రైతుల క్రాప్ ఇన్సూరెన్సు బకాయిలు చెల్లించడానికి రూ.4600 కోట్లు పక్కన పెడుతున్నానన్నాడు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌కై రూ. 150 కోట్లు, క్రాప్ యిన్సూరెన్స్, హార్టికల్చర్ క్రాప్స్‌కై రూ. 100 కోట్లు, లాప్‌టాప్‌లు కొనుక్కోవడానికి విద్యార్థులకు డబ్బు పంపిణీ, ఆదివాసీలకు అటవీ భూపంపిణీ కూడా చేస్తానంటున్నాడు. మార్చి 31 నాటికే రాష్ట్రం రూ. 2 లక్షల కోట్ల అప్పులో వుంది. ఇతర పార్టీలే తప్ప బిజెపి ప్రజాకర్షక పథకాల జోలికి వెళ్లదని కొందరు యిప్పటికీ నమ్ముతూంటారు, మనల్ని నమ్మమంటారు.

కాంగ్రెసు యిచ్చిన ఎన్నికల హామీలలో ముఖ్యమైనది రైతు ఋణమాఫీ. అది కమల్ నెరవేర్చలేదంటూ సింధియా ఆరోపించి పార్టీలోంచి వెళ్లపోయాడు. అయితే కమల్ ప్రభుత్వం 26.95 లక్షల మంది రైతులకు రూ. 11,600 కోట్ల ఋణమాఫీ చేసిందంటూ బిజెపి ప్రభుత్వమే సెప్టెంబరులో అసెంబ్లీలో ప్రకటించవలసి వచ్చింది. అది పట్టుకుని యిప్పుడు కమల్ ‘చూశారా, సింధియా ఎంత అబద్ధాల కోరో’ అంటూ ప్రచారం చేస్తున్నాడు. మాఫీ సౌకర్యం పొందిన రైతుల పేర్లు విడుదల చేసి, తక్కినవాళ్లకు కూడా యివ్వబోతూండగానే సింధియా తనను పడగొట్టేశాడని చెప్పుకుంటున్నాడు. ఇలాటి పరిస్థితుల్లో సింధియాకు ఎంత ప్రాముఖ్యత యివ్వాలో బిజెపి తేల్చుకోలేక పోతోంది. వాళ్ల వాల్‌పోస్టర్లలో సింధియా బొమ్మ వేయటం లేదు.

బిజెపి స్టార్ కాంపెయినర్స్ 30 మంది వుంటే వారిలో సింధియాది పదో స్థానం. కాంగ్రెసులో వుండగా అతన్ని మహారాజా అని పిలిచేవారు. అతనూ పిలిపించుకునేవాడు. ఇప్పుడు బిజెపివారు అతనూ మనలో ఒకడే అంటున్నారు. అది సింధియా అనుచరులకు మింగుడు పడటం లేదు. పైగా కాంగ్రెసువారు యిప్పుడు అతన్ని విశ్వాసఘాతకుడైన భూస్వామి అంటున్నారు. సింధియా మాత్రం తన ఉపన్యాసాల్లో ఓటర్లను ఉద్దేశించి ‘కాంగ్రెసు మీ మహారాజాను అవమానపరిచింది. మీ మహారాజాకు జరిగిన అవమానానికి మీరు ప్రతీకారం తీర్చుకోవాలి.’ అంటున్నాడు. ప్రజలు ఏ మేరకు వింటారో ఫలితాలు చెప్తాయి.

ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2020)
[email protected]