తమిళనాడు ఎన్నికల ఫలితాలు ముందే తెలిసిపోయాయి అని అందరూ అనుకున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికలలో 39 స్థానాల్లో ఎడిఎంకె 38 స్థానాల్లో (215 అసెంబ్లీ సిగ్మెంట్లు) ఓడిపోయింది కాబట్టి, యీసారి డిఎంకెకు నల్లేరు మీద బండి నడక అనుకున్నారు. కానీ ఎడిఎంకె ముఖ్యమంత్రి పళనిస్వామి గట్టిపోటీ నిచ్చి, 75 సీట్లు గెలిచి, డిఎంకెకు వస్తాయనుకున్న సీట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించాడు. అయితే స్టాలిన్ ముఖ్యమంత్రి కాకుండా ఆపలేకపోయాడు. ఎందువలన అనేది విశ్లేషించడానికే యీ వ్యాసం.
డిఎంకె, ఎడిఎంకె ప్రధాన పార్టీలు. సాధారణంగా ప్రతీ ఐదేళ్లకూ పాలకపక్షం మారిపోతూ వుంటుంది. ఇప్పుడున్న పార్టీ పదేళ్లగా పాలిస్తోంది. ఇంకో ఐదేళ్లు కొనసాగితే రికార్డు అయ్యేది. (1967 ముందు నాటి విషయాలు వదిలేయండి) కానీ బలాబలాలు తారుమారయ్యాయి. అవడంలో కూడా ఎడిఎంకె ఓటమి తీవ్రమైంది. 2016 ఎన్నికలలో ఎడిఎంకెకు 135 వస్తే, యిప్పుడు డిఎంకెకు 2 తక్కువగా 133 వచ్చాయి. (దీనిలో వైకో పార్టీ ఎండిఎంకెవి 4 ఉన్నాయి. డిఎంకె గుర్తుపై పోటీ చేశారు కాబట్టి, వారి ఖాతాలో పడ్డాయి) 2016లో డిఎంకెకు 88 వస్తే ఇప్పుడు ఎడిఎంకెకు 22 తక్కువగా 66 వచ్చాయి. కానీ వీటిలో 12 సీట్లు అతి తక్కువ తేడాతో ఓడిపోయినవి! డిఎంకె 2016లో గెలుచుకున్న 88టిలో 78టిలో మళ్లీ గెలిచింది. కానీ ఎడిఎంకె గతంలో గెలిచిన స్థానాల్లో 55 మాత్రమే నిలుపుకోగలిగింది.
13 పార్టీల డిఎంకె కూటమి (డిఎంకె+) పేరు సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఎలయన్స్ (ఎస్పీఏ). 234 సీట్లలో 159 సీట్లు, 44.9% (2016లో 40.3) ఓట్లు తెచ్చుకుంది. డిఎంకె 173టిలో పోటీ చేసి 61 సీట్లను మిత్రపక్షాలకు వదిలేస్తే అవి వాటిలో 22 తెచ్చుకున్నాయి. కూటమిలో ముఖ్యమైనవి కాంగ్రెసు, ఎండిఎంకె, సిపిఐ, సిపిఎం, విసికె. వాటిలో కాంగ్రెసుకు 4.3% ఓట్లతో స్ట్రయిక్ రేట్ 72% వుంది. కాంగ్రెసు రాష్ట్ర అధ్యక్షుడు ఏడ్చి రాగాలు పెట్టినా స్టాలిన్ 25 కంటె ఎక్కువ యివ్వననడం మంచిదైంది. దానిలో 18 సీట్లు గెలిచింది. వాటిలో బిజెపితో డైరక్టుగా తలపడిన 5టిలో గెల్చిన 4 సీట్లున్నాయి. ఓడిపోయిన స్థానం కోయంబత్తూరు (సౌత్) అక్కడ బిజెపి అభ్యర్థి కమల్ హాసన్‌ను 1700 ఓట్ల తేడాతో ఓడించగా, కాంగ్రెసు మూడో స్థానంలో నిలిచింది. కన్యాకుమారి పార్లమెంటు స్థానంలో కాంగ్రెసు బిజిపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌ను లక్షకుపైగా ఓట్ల తేడాతో ఓడించింది. అతని తరఫున మోదీ, అమిత్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, రాజనాథ్ సింగ్ వచ్చి కాన్వాస్ చేసినా లాభం లేకపోయింది.
39.7% (2016లో 48.9)ఓట్లు తెచ్చుకున్న ఎడిఎంకె కూటమి (ఎడిఎంకె+)కి 75 సీట్లు వచ్చాయి. దాని కూటమి సభ్యుల్లో ముఖ్యమైనవైన బిజెపి, పిఎంకె, రెండూ కూటమిని దెబ్బ తీశాయి. 20 సీట్లు పోటీ చేసిన బిజెపికి 4 సీట్లు (స్ట్రయిక్ రేట్ 20%) మాత్రం వచ్చాయి. 2001లో 4 వుండేవి. తర్వాత అసెంబ్లీలో దానికి స్థానమే లేదు. ఇన్నాళ్లకి 4 సీట్లు, 2.4% ఓట్లు వచ్చాయి. ఎడిఎంకె+లో తక్కిన భాగస్వాములు పోటీ చేసిన స్థానాలలో కంటె బిజెపి పోటీ చేసిన స్థానాల్లో కూటమికి తక్కువ ఓట్లు పడ్డాయి. బిజెపితో పొత్తు పెట్టుకోవడం వలన, దానికి తోకగా మారిందంటూ ఎడిఎంకెకు ఎప్పుడూ ఓటేసేవారు కూడా వేయడం మానేశారు. మోదీ, అమిత్ షాలు ఎన్ని రౌండ్లు కొట్టినా నష్టమే తప్ప లాభం కలగలేదు. ఇక పిఎంకె ఏదో పొడిచేస్తుందనుకుని దాని హిరణ్యాక్ష వరమైన వణ్నియార్లకు 10.5% రిజర్వేషన్ యిచ్చినా, కేటాయించిన 23 సీట్లలో 5 సీట్లు మాత్రమే (స్ట్రయిక్ రేట్ 22%) గెలవగలిగింది. 3.8% ఓట్లు వచ్చాయి. పైగా వణ్నియార్లకు రిజర్వేషన్ యివ్వడంతో తక్కిన కులాలు కత్తి కట్టి, దూరమై పోవడంతో కూటమి నష్టపోయింది.
పళనిస్వామి కరోనా కట్టడికై చేసిన కృషి, చూపిన పరిపాలనా సామర్థ్యం వలననే ఎడిఎంకె యింతమాత్రం గెలిచిందని అంటున్నారు. అతన్ని జయలలితకు వారసుడిగా 47% మంది ఎడిఎంకె ఓటర్లు గుర్తించారని లోకనీతి సర్వే చెపుతోంది. అయినా 10 మంది మంత్రులు ఓడిపోయారు. ఎన్నికలకు వెళ్లబోతూ వుండగా తీసుకున్న మూడు ముఖ్యమైన విధానాల ప్రభావం ఎలా వుందో కూడా ఆ సర్వే చెప్పింది. ప్రభుత్వోద్యోగుల రిటైర్‌మెంట్ వయసు 60కి పెంచడం పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ ఉద్యోగులున్న కుటుంబాలలో కూడా డిఎంకె కూటమికి 46% మంది ఓటేయగా, ఎడిఎంకె కూటమికి 33% మంది ఓటేశారు. ఆ ఉద్యోగులు లేని కుటుంబాలలోనే ఎడిఎంకెకు 41% మద్దతుంది. డిఎంకెకు 46% వుంది. రూ. 12 వేల కోట్ల వ్యవసాయ ఋణాల మాఫీ రైతులకు సంతోషాన్ని కలిగించినా, అది చాలా ఆలస్యంగా రావడం వలన ప్రభావం చూపలేదు. వ్యవసాయాదాయంపై ఆధారపడిన ప్రజలు ఎక్కువగా వున్న నియోజకవర్గాల్లో 47% మంది ఎడిఎంకె కూటమికి ఓటేయగా, 39% మంది మాత్రమే డిఎంకెకు ఓటేశారు. డెల్టా జిల్లాలలో డిఎంకెకు 31, దాని భాగస్వాములకు 6 రాగా ఎడిఎంకెకు 4 మాత్రమే వచ్చాయి.
ఇక వణ్నియార్ల రిజర్వేషన్ వలన సంతోషించిన ఆ కులస్తులు 79% మందే. వారిలో కూడా 35% మంది డిఎంకె+కి, 56% మంది ఎడిఎంకె+కి ఓటేశారు. కానీ దీని కారణంగా వణ్నియార్లంటే పడని ఇతర కులస్తులు ఏకమయ్యారు. ముఖ్యంగా వాళ్లతో అనునిత్యం పేచీపడే దళితులు విసికె (విడుదలై చిరుతైగళ్ కచ్చి) పార్టీ 4 సీట్లు గెలవడానికి దోహదపడ్డారు. వాటిలో 2 నాన్ రిజర్వ్‌డ్ స్థానాల్లో గెలిచినవి. అది డిఎంకె+లో వుంది కాబట్టి ఆ కూటమి ఆ మేరకు లాభపడింది. అగ్రవర్ణాలలో 47% మంది డిఎంకె+కి, 30% మంది ఎడిఎంకె+కి వేశారు.
వణ్నియార్లు అధిక సంఖ్యలో వున్న చెన్నయ్, తిరువళ్లూరు జిల్లాల్లోని మొత్తం 26 సీట్లూ డిఎంకె+ గెలిచింది. ఉత్తరాది జిల్లాలలో డిఎంకె+కి 34 రాగా, ఎడిఎంకె+కి 11 మాత్రమే వచ్చాయి. పళనిసామి కులస్తులైన గౌండర్లు అధిక సంఖ్యలో వున్న పశ్చిమ తమిళనాడులో మాత్రమే ఎడిఎంకె డిఎంకెను దెబ్బ తీయగలిగింది. ఆ కూటమికి అక్కడ 41 సీట్లు వచ్చాయి. డిఎంకెకు 13, కాంగ్రెసుకు 2, సిపిఐకు 1 మాత్రమే వచ్చాయి. ధర్మపురి, కోయంబత్తూరులలో డిఎంకె+కి ఒక్క సీటూ రాలేదు. ఎడిఎంకెకు బలమైన స్థావరంగా వుంటూ వచ్చిన దక్షిణ తమిళనాడులో 55% మంది దేవర్లు, 52% మంది ముదలియార్లు ఎడిఎంకె+కి ఓటేసినా నాడార్లు, యితరులు డిఎంకె+కి హెచ్చు సంఖ్యలో ఓటేయడంతో డిఎంకెకు 31, కాంగ్రెసుకు 9 వచ్చాయి. ఎడిఎంకెకు 15, బిజెపికి 2 వచ్చాయి.
నగర, గ్రామీణ ప్రాంతాలుగా వర్గీకరించి చూస్తే అర్బన్, సెమీఅర్బన్ అనదగిన 80 నియోజకవర్గాల్లో డిఎంకె+కి 63, ఎడిఎంకె+కి 17 (79:21 నిష్పత్తి) వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలనదగిన 154 నియోజకవర్గాల్లో 96, 58 (62:38 నిష్పత్తి) వచ్చాయి. ఓటింగు శాతాలు చూస్తే డిఎంకె+కి గ్రామీణ, టౌను, సిటీలలో 45,46,47 శాతం ఓట్లు రాగా ఎడిఎంకె+కి 44,33,43 వచ్చాయి. అంటే పట్టణాలలో ఎడిఎంకె బలహీనంగా వుందన్నమాట. వర్గాల వారీగా చూస్తే డిఎంకె+కి పేద, దిగువతరగతి, మధ్యతరగతి, ధనిక వర్గాలలో 53,47,44,36 శాతం ఓట్లు రాగా ఎడిఎంకె+కి 36,39,40,44 వచ్చాయి. అంటే లేనివారిలో ఎడిఎంకె పరపతి తగ్గిపోతోందన్నమాట. జయలలిత లేకపోయినా మహిళా ఓటర్లలో 41% మంది ఎడిఎంకె కూటమికి ఓటేశారు. ఏ పార్టీకి విధేయులుగా వుండకుండా పరిస్థితుల బట్టి ఓటేసే స్వింగ్ ఓటర్లలో (వీళ్లు మొత్తం ఓటర్లలో 51% వున్నారు) 42% మంది డిఎంకెకు 36% మంది ఎడిఎంకెకు వేశారు.
బిజెపి పట్ల తమిళ ప్రజల అభిప్రాయం ఎలా వుంది అనేది లోకనీతి సర్వే విశ్లేషించింది. బిజెపి ఎదుగుదల తమిళనాడు ప్రయోజనాలకు విఘాతమా అని అడిగితే డిఎంకెకు ఓటేసినవారిలో 45% మంది ఔనన్నారు, 13% కాదన్నారు, తక్కినవాళ్లు తేడా ఏమీ లేదన్నారు. ఎడిఎంకెకు ఓటేసినవారిలో 32% ఔనంటే, 25% కాదన్నారు. బిజెపి వ్యతిరేకత కావేరీ డెల్టా (వ్యవసాయం ఎక్కువగా ఉండే ప్రాంతం) 50% ఉంది. ఉత్తర, దక్షిణ తమిళనాడులలో 41-45 వరకు వుంది. పశ్చిమ ప్రాంతంలో మాత్రం 23యే వుంది. అక్కడే ఎడిఎంకె+ బాగా గెలిచింది. తమిళం మాట్లాడేవారిలో బిజెపి వ్యతిరేకత, అనుకూలత శాతాలు 42-18 వుంటే తమిళేతరుల విషయంలో అది 32-17 ఉంది. కులాల వారీగా చూస్తే ఎస్సీలలో 48-14, ఎస్టీలలో 29-17 ముస్లిములలో 35-6, క్రైస్తవుల్లో 47-9, అగ్రవర్ణాల్లో 41-18 బిసిలలో 37-22 ఉంది.
తమిళనాడులో అనేక చిల్లర పార్టీలున్నాయి. ఎన్నికలనగానే అవి ఏవో ఒక ద్రవిడ కూటమిలో చేరదామని చూస్తాయి. చచ్చేటన్ని బేరాలాడతాయి. ఒక కూటమిలోంచి మరో కూటమిలోకి గెంతుతూ వుంటాయి. వీళ్లని కాదని విడిగా కూటములు ఏర్పడుతూంటాయి కూడా. కానీ ద్రవిడ కూటములకే తప్ప తక్కినవారికి స్థానం లేదని యీ ఎన్నికలు మళ్లీ నిరూపించాయి. రెండు కూటములకు కలిపి 85% ఓట్లు వచ్చాయి. తక్కినవాటిలో కమలహాసన్ పార్టీకి 2.62%, దినకరన్ పార్టీకి 2.35% వచ్చాయి. ఎవరితో కలవని సీమాన్ యొక్క నామ్ తమిళర్ కచ్చి 234 సీట్లలో పోటీ చేసి 6.6% ఓట్లు తెచ్చుకున్నా ఒక్క సీటూ గెలవలేక పోయింది.
ఎల్‌టిటిఇ ప్రభాకరన్‌కి వీరాభిమాని, తమిళ యువకులను ఉత్తేజపరచగల సీమాన్ తిరువొత్తియూరులో ఎడిఎంకె, డిఎంకెల తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. గతంలో సరాసరిన నియోజకవర్గాల్లో 500 ఓట్లు తెచ్చుకునే యీ పార్టీ యీసారి పశ్చిమ, ఉత్తర తమిళనాడు లోని నియోజకవర్గల్లో సగటున 8 వేల ఓట్లు దాకా తెచ్చుకుంది. మొత్తం మీద చూస్తే కమలహాసన్ పార్టీ అర్బన్ ప్రాంతాల్లో ఎడిఎంకె విజయావకాశాలను దెబ్బ తీస్తే, సీమాన్ సెమి-అర్బన్ ప్రాంతాల్లో డిఎంకె అవకాశాలను దెబ్బ తీసింది. దినకరన్ ఎఎమ్ఎమ్‌కె 21 నియోజకవర్గాల్లో ఎడిఎంకెను దెబ్బ తీసింది. 2006లో 8.5% ఓట్లు తెచ్చుకున్న విజయకాంత్ డిఎండికె పార్టీ క్రమేపీ క్షీణిస్తూ యిప్పుడు సోదిలోకి లేకుండా పోయింది. విజయకాంత్ అనారోగ్యం, అతని భార్య, బావమరిది పార్టీ నడిపిన విధానం కారణాలంటున్నారు.
చివరగా చెప్పాలంటే – స్టాలిన్ ఎప్పణ్నుంచో లైమ్‌లైట్‌లో వుంటూ వచ్చాడు. చెన్నయ్ మేయరుగా, ఉపముఖ్యమంత్రిగా అనుభవం సంపాదించాడు. కరుణానిధి వారసుడిగా అతనికి పార్టీ వ్యవస్థ, అనుభవజ్ఞులైన సీనియర్ల మద్దతు అన్నీ వున్నాయి. జయలలిత మరణించాక అతన్ని ఢీకొనడం సాధారణమైన విషయం కాదు. కానీ పళనిసామి గట్టిపోటీ యివ్వగలిగాడు. రాజీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఐన అతనిపై పెద్దగా ఆశలు లేవు. అయినా అతను యీ మేరకు లాక్కుని వచ్చాడంటే గొప్పే! బిజెపితో పొత్తు లేకుండా వుంటే ఆ కూటమి పనితీరు యింకా బాగుండేదని చెప్పవచ్చు. ఇక పార్టీ సారథ్యానికి వస్తే, శశికళతో జట్టు కట్టి పన్నీరుశెల్వం సమస్యలు సృష్టించవచ్చు కానీ, అంతిమంగా పళనిసామి వర్గమే నెగ్గవచ్చు. జయలలితానంతర ఎడిఎంకె మనగలదు అని ఋజువైంది. ఓటమి తీవ్రంగా వుండే పక్షంలో శశికళ నేనే ఉంటేనా.. అని వుండేది. ఇప్పుడా ఛాన్సు లేదు. ఇక బిజెపికి తమిళనాడులో గిరాకీ లేదని ఋజువైంది కాబట్టి, ఎడిఎంకె దానికి దూరంగా జరిగి, ధాటీగా ద్రవిడగీతం ఆలపించవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2021)