ఈ లాభార్థులకు లాభం చేకూర్చడంతో బిజెపి వదలిపెట్టలేదు. 2022 జనవరి 11 నుంచి ‘లాభార్థి సంపర్క్ అభియాన్’ పేరిట రాష్ట్రంలోని 1.25 లక్షల బూతులలో నమోదైన ఓటర్లలో పథకాలు పొందుతున్న వారి వద్దకు వెళ్లి వాళ్ల నుదుటన చందనపు తిలకం అద్ది, వాళ్ల యింటి మీద ‘మేరా పరివార్ భాజపా పరివార్’ అనే స్టిక్కర్ అంటించి వచ్చారు. జగన్ వాలంటీరు వ్యవస్థ 2024 ఎన్నికలలో యిదే చేయవచ్చు. అసాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ‘‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’’లో రాసిన వ్యాసం ప్రకారం యుపిలో పిఎం కిసాన్ యోజన కింద 2.5 కోట్ల మంది రైతులు లాభపడ్డారు, పిఎం ఉజ్జ్వల కింద 1.5 కోట్ల గ్యాస్ సిలండర్లను యిచ్చారు. దేశం మొత్తంలో యిచ్చిన దానిలో యిది 17%. పిఎం ఆవాస్ యోజన కింద 10 లక్షల యిళ్లు యిచ్చారు. 33 లక్షల మంది లాభపడ్డారు. 1.3 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీ చేశారు. మరో 15 కోట్ల మంది (యుపి జనాభా 24 కోట్లు) పిఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ పొందారు. పథకాలే గెలిపించాయని ఆయన వ్యాసం చివర్లో రాశారు కూడా.
ఈ రేషన్‌లో 5 కిలోల బియ్యం లేదా గోధుమ, ఒక కిలో అపరాలు, ఒక లీటరు నూనె, ఒక్కో కిలో ఉప్పు, పంచదార నెలకు రెండు సార్ల చొప్పున 2022 మార్చి వరకు యిచ్చారు. వీటిపై మోదీ బొమ్మ ఉంటుంది. నిజానికి ఉప్పు ఖరీదేమీ కాదు, వాళ్లే కొనుక్కోగలరు. కానీ మోదీగారి ఉప్పు తిన్నామన్న భావం ఓటర్లకు కలగాలని చేర్చి ఉంటారు. మార్చి ఎన్నికల తర్వాత కూడా స్కీము కొనసాగించాలని ఉందని యోగి అన్నాడు. కొనసాగిస్తున్నారో లేదో తెలియదు. ఆంధ్రలో అమ్మ ఒడిలాగ యోగి ప్రభుత్వం పిల్లలకు స్కూలు యూనిఫాంలు కొనడానికి రూ.1000 తలిదండ్రులకు యిచ్చింది. 1.50 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు జనవరిలో తలా వెయ్యి రూపాయలు పంపిణీ చేశారు. ఇంటింటికీ టాయిలెట్స్ కట్టించడమొకటి మహిళలను మెప్పించింది.
ఇండియా టుడే-మై యాక్సిస్ సర్వే ప్రకారం శాంతిభద్రతలు మెరుగుపడడం, గ్యాస్ సిలండర్లు యివ్వడం, రేషన్ యివ్వడం.. వీటి కారణంగా గతంలో 44% మంది మహిళలు బిజెపికి ఓటేయగా యీసారి 48% వేశారు. ఓటు వేయడానికి వచ్చిన మహిళలు ఆరవ దశ పోలింగులో 5% పెరిగారు. ఏడవ దశ పోలింగులో 10% పెరిగారు. మహిళల్లో 32% ఎస్పీకి, 14% బియస్పీకి వేశారు. పురుషుల్లో 44% బిజెపికి, 40% ఎస్పీకి, 10% బియస్పీకి వేశారు.
2009లో చంద్రబాబు యీ నగదు బదిలీ పథకం ప్రవేశపెడతానంటే యిదెక్కడి విడ్డూరం, ఆ డబ్బు యితరత్రా ఖఱ్చయిపోతే కష్టం కదా అని వాదించినవారిలో నేనూ ఉన్నాను. ఇప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలన్నీ అదే పనిలో పడ్డాయి. ఇళ్లు, టాయిలెట్స్ కట్టుకోవడానికంటూ యుపి ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తోంది. టాయిలెట్ కట్టుకుంటావో లేదో మాకనవసరం, డబ్బు యిస్తున్నాం తీసుకో అంటూంటే, ఓటర్లు అదే మహాప్రసాదం అనుకుంటున్నారు. పాలకులను మళ్లీమళ్లీ గెలిపిస్తున్నారు. దక్షిణ అమెరికాలో యీ స్కీము సఫలమైందంటూ, చంద్రబాబు తన మానిఫెస్టోలో డిబిటిని పెట్టినపుడు, అక్కడ తాత్కాలికంగా మాత్రమే దీన్ని అమలు చేశారని విశ్లేషకులు ఎత్తి చూపారు. ఇప్పుడు యీ స్కీము మన దేశంలో ఎల్లెడలా ఓట్లు రాల్చే సాధనంగా మారడంతో పర్మనెంటు అయ్యేట్లే ఉంది.
ఇక్కడ మరో అంశం ఉంది. లబ్ధిదారులను ఎంపిక చేయడానికి మధ్యలో పార్టీ కార్యకర్తలతో ఏర్పరచిన జన్మభూమి కమిటీల్లాటివో, ఎమ్మెల్యేలనో పెడితే వాళ్లకు పలుకుబడి ఉంటుంది. కానీ పంపిణీలో వివక్షత, అవినీతి జరిగాయనే ఆరోపణలు వచ్చే ప్రమాదం ఉంది. బాబు దెబ్బతిన్నది అక్కడే! అదే కనుక డిజిటలైజ్ చేసి అటువంటి దళారీలను తీసివేస్తే ఆ బెడద ఉండదు. కానీ అదే సమయంలో పార్టీ కార్యకర్తల, నాయకుల ప్రమేయం తగ్గిపోయి, అధినాయకుడి పేరే ప్రజల నాలుకల మీద నానుతుంది. యుపిలో ఉన్నది బిజెపి ప్రభుత్వం కాబట్టి, మోదీ కొన్ని యిస్తున్నాడు, యోగి కొన్ని యిస్తున్నాడు అంటున్నారు. అదే ఆంధ్ర, తెలంగాణలలో అయితే సర్వం జగన్, కెసియార్ యిస్తున్నారని పేదలు అనుకుంటున్నారు. కేంద్ర పథకాలకు సైతం వీళ్లు తమ పేర్లే పెట్టుకుంటున్నారు. అధికారగణాన్ని, కంప్యూటర్లను నమ్ముకుని, ఎమ్మెల్యేలను యిలా నిర్వీర్యం చేసేశాక, రేపు ఏ ఎమ్మెల్యే అయినా తిరుగుబాటు చేసినా ప్రజలు అతన్ని పట్టించుకోరు. అధినాయకుడికి కావలసినది అదే!
ఈ సంక్షేమ పథకాలకే డబ్బంతా వెచ్చించడంతో విద్య, వైద్యం, ఇన్‌ఫ్రా లాటి వాటికి డబ్బు చాలటం లేదు. వాటికి కేటాయింపులు తగ్గిపోయాయి. తలసరి ఆదాయంలో విద్యకు అతి తక్కువగా ఖఱ్చు పెట్టే రాష్ట్రం యుపియే. విద్యార్థులకు తగినంత నిష్పత్తిలో ఉపాధ్యాయులు లేరు. ఉన్నవాళ్ల క్వాలిటీ కూడా బాగా లేదు. పాఠశాలలో చదివే పిల్లల్లో 38.7% మంది ట్యూషన్లు పెట్టించుకుంటున్నారు. 12% మంది 8వ క్లాసుకి వచ్చేసరికి స్కూలు మానేస్తున్నారు. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో హయ్యర్ సెకండరీ లెవెల్లో 46.9% కాగా, కాలేజీ లెవెల్లో 25.3%. ఇక వైద్యం విషయానికి వస్తే శిశుమరణాల రేటు జాతీయ సగటు కంటె ఎక్కువగా 59.8%. ప్రతి లక్ష మందికి ఉన్న బెడ్స్ సంఖ్య 13 మాత్రమే. నీతి ఆయోగ్ సూచిలో యుపి స్థానం అట్టడుగున ఉంది. కరోనా టైములో యుపి హాస్పటల్ వ్యవస్థ డొల్లతనం బయటపడింది. ‘ఆరోగ్యం విషయంలో మీ డబుల్ ఇంజన్ యుపి ఎక్కడుంది?’ అని కెటియార్ వెక్కిరించాడంటే వెక్కిరించడా?
నీతి ఆయోగ్, యితర ప్రభుత్వ సంస్థలు కలిసి యిచ్చిన డేటాను ‘‘హిందూ’’ 250122న ప్రచురించింది. దాని ప్రకారం రాష్ట్రాలు, యుటిలు మొత్తం 36టిలో హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో యుపి స్థానం 35. శిశుమరణాలలో 35వ స్థానం. 6-59 నెలల వయసు పిల్లల్లో రక్తహీనత ఉన్నవారు 20%, హయ్యర్ సెకండరీ విద్యలో చేరేవారు 24%, తర్ఫీదు పొందిన ఉపాధ్యాయులు 30% మాత్రమే. ఇవన్నీ అభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతాయి. యోగి పాలనలో జిఎస్‌డిపి రేటు ఎలా తగ్గిందో పి. చిదంబరం లెక్కలిచ్చారు. ‘2016-17లో 11.4%, 2017-18లో 4.6%, 2018-19లో 6.3%, 2019-20లో 3.8%, 2020-21లో 6.4%గా ఉంది. యుపి పౌరుల తలసరి ఆదాయం దేశపౌరుల సగటు ఆదాయం కంటె సగం కంటె తక్కువగా ఉంది. 2017-18, 2020-21ల మధ్య యుపి పౌరుల తలసరి ఆదాయం 1.9% మేరకు తగ్గిపోయింది. ఈ నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వ ఋణభారం 40 % పెరిగింది. 2021 మార్చి 31 నాటికి అది 6.63 లక్షల కోట్లు. ఇది జిఎస్‌డిపిలో 34.2%.’
చిదంబరం రాసిన దాని ప్రకారం ‘నీతి ఆయోగ్ బహుళ పార్శ్వ పేదరికం సూచీ నివేదిక-2021 ప్రకారం యుపి జనాభాలో 37.9% మంది పేదలు. 12 జిల్లాల్లో పేదల నిష్పత్తి 50% కు మించి ఉంది. మూడు జిల్లాల్లో 70% ఉంది. పట్టణ ప్రాంతాలలో ప్రతి నలుగురు యువజనుల్లో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారు. ‘జర్నల్ ఆఫ్ మైగ్రేషన్ ఎఫైర్స్ (2020 మార్చి సంచిక) ప్రకారం అంతర్ రాష్ట్ర వలసల్లో యుపి ప్రజలే అత్యధికంగా ఉన్నారు. జనాభాలో ప్రతి 16మందిలో ఒకరు వలస వెళుతున్నారు.’ లాక్‌డౌన్ సమయంలో తిరిగి వెళ్లిన వలసకార్మికుల్లో అత్యధికులు యుపివారేగా! రాష్ట్రం అమోఘంగా ఉంటే వలస వెళ్లే అవసరం ఎందుకు పడుతుంది? పాలన యిలా ఉన్నా యోగి మళ్లీ గెలిచాడంటే అర్థమేమిటి? పరిపాలనలో అవకతవకలు ఎలా ఉన్నా, సంక్షేమ పథకాలు కనుక అవినీతి, వివక్షత లేకుండా అమలు చేస్తూంటే దిగువ, మధ్యతరగతి ప్రజలు తక్కినవాటిని క్షమించేస్తున్నారు. సంక్షేమ పథకాలకు డబ్బు పోతోండంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరగటం లేదనే విషయం వారికి పట్టటం లేదు. యుపిలో అలాటి ప్రాజెక్టులన్నింటికీ ఎన్నికల ముందే పునాదిరాళ్లు పడ్డాయి.
జగన్ కూడా యిదే ఫార్ములాను నమ్ముకున్నాడు. అతను ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేసేసి, రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తానని ప్రగల్భాలు పలకవచ్చు. అతని ఆర్థిక అరాచకత్వం చూసి పరిశీలకులు, తటస్థులు నెత్తినోరూ బాదుకోవచ్చు. కానీ 40-45% మంది ఓటర్లు సాలిడ్‌గా అతని వెంట నిలబడుతున్నారు కాబట్టే స్థానిక ఎన్నికలలో కూడా గెలుస్తున్నాడు. యోగికి కలిసివచ్చిన మరొక అంశం, స్ట్రాంగ్‌మ్యాన్ యిమేజి. ప్రపంచచరిత్రలో నియంతలు ప్రభవించేముందు ప్రజాస్వామ్య పార్టీల వైఫల్యం కనబడుతుంది. 2004-14 మధ్య యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం అస్తవ్యస్తంగా నడిచింది. డ్రైవింగు సీట్లో ఉన్న కాంగ్రెసు ఒకటే కాదు, దాని భాగస్వామ్య పక్షాలు కూడా అవినీతికి పాల్పడి, ప్రజలకు విసుగు తెప్పించాయి. అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా కాళ్లీడ్చడంతో ఎవడైనా గట్టి పిండం వచ్చి, ఐరన్ హ్యేండ్‌తో పాలిస్తే బాగుండును అనే భావన ప్రజల్లో ప్రబలింది. మోదీ అలాటి ఘటం అని తోచిన తర్వాత మేధావులు సైతం అతని రాకను స్వాగతించారు. పాలనలోకి వచ్చాక కూడా రాష్ట్రాల నుంచి అధికారాలన్నీ గుంజుకుని, తన చేతిలో పెట్టుకుని మోదీ తన మాటే వేదంగా చెల్లిస్తున్నాడు. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, పత్రికా స్వేచ్ఛ యివన్నీ అడుగంటిపోతున్నాయి. అయినా ప్రజలు యిలాటివాడే కావాలనుకుని అతన్ని ఆదరిస్తున్నారు.
కేంద్రంలో మోదీ యిమేజి ఎలాటిదో, రాష్ట్రంలో యోగి యిమేజి కూడా అలాగే తయారైంది. యోగి తనకు చిత్తమొచ్చినట్లు చేస్తాడు. తన పార్టీ వాళ్లు ఎన్ని నేరాలు, ఘోరాలు చేసినా వెనకేసుకుని వస్తాడు. ప్రతికక్షులపై మాత్రం కక్ష సాధిస్తాడు. గూండాలను పట్టుకుని విచారణ జరిపించే పద్ధతి లేదు, మేం చెప్పినట్లు విను, లేకపోతే కాల్చేస్తాం అనే పద్ధతే. వీటి మాట ఎలా ఉన్నా శాంతిభద్రతలు బాగా కాపాడుతున్నాడనే పేరు వచ్చింది. నిజానికి యుపిలో నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. చాలా నేరాలను రికార్డు చేసుకోవటం లేదన్న ఫిర్యాదూ ఉంది. కానీ అరాచకాన్ని సహించడు అనే యిమేజి ప్రజల మెదళ్లలో ముద్రించుకుపోయింది. వాళ్లకు అంకెలతో పని లేదు. 2021 ఆగస్టులో అమిత్ షా యుపి వచ్చి, శాంతిభద్రతల విషయంలో యుపి దేశంలోనే టాప్‌లో ఉందనీ, యోగి వచ్చాక కేసులు తగ్గాయనీ ప్రశంసించి వెళ్లాడు. ఒక నెల తర్వాత నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిబి) వారి ‘‘క్రైమ్ ఇన్ ఇండియా 2020’’ నివేదిక వెలువడింది. దాని ప్రకారం ఐపిసి (ఇండియన్ పీనల్ కోడ్) ప్రకారం యుపిలో 2018లో నమోదైన కేసులు 3.42 లక్షలైతే, 2019కి అది 3.53కి పెరిగి, 2020 నాటికి 3.55 అయింది. ఎస్‌ఎల్ఎల్ (స్పెషల్ అండ్ లోకల్ లాస్) ప్రకారం నమోదైనవి 2018లో 2.42లక్షలు, 2019లో 2.75, 2020లో 3.03!
దేశం మొత్తం మీద కూడా కేసుల సంఖ్య పెరిగింది. 2019లో లక్ష జనాభాకు 385.5 కేసులుంటే, 2020లో 487.8కు పెరిగింది. 2020 మార్చి 25 నుండి మే 31 వరకు లాక్‌డౌన్ ఉన్నా, ఆ తర్వాత కూడా చాలా రాష్ట్రాలలో పాక్షికంగా లాక్‌డౌనో, కర్ఫ్యూయో, రాకపోకలపై ఆంక్షలున్నా కేసులు పెరిగాయని, కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలోనూ బిజెపియే అధికారంలో ఉందని గమనించాలి. యుపి విషయానికి వస్తే, 3779 హత్యలతో 12,913 కిడ్నాపులతో జాతీయ సగటు కంటె ఎక్కువగా ఉంది. బాలలపై జరిగే నేరాలు తగ్గినా, రాష్ట్రంలో బాలనేరస్తుల సంఖ్య 23% పెరిగింది. నిరక్షరాస్యత, ఉపాధి లేమి దీనికి కారణాలని చెప్తున్నారు. ఆందోళన సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన సందర్భాల్లో వాటిని జాతివ్యతిరేక కేసులుగా నమోదు చేస్తున్నారు. యుపి జాతి వ్యతిరేక కేసుల్లో 95% యిలాటి కేసులే. సిఏఏకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆందోళనకారులపై యీ సెక్షన్ల కింద కేసులు బనాయించారు. కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో గిరిజన తిరుగుబాట్లు (ఇన్‌సర్జన్సీ) జరుగుతూంటాయి కాబట్టి అక్కడ ఎక్కువగా యుఎపిఎ (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) కింద కేసులు పెడుతూంటారు. యుపిలో అలాటి తిరుగుబాట్లు ఏమీ లేకపోయినా 72 కేసులు నమోదయ్యాయి. కశ్మీరు మొత్తం మీద 287 జరిగాయంటే యీ 72 ఎంత ఎక్కువో మనం అర్థం చేసుకోవచ్చు. నచ్చనివాళ్లపై యీ కేసులు బనాయిస్తున్నారన్నమాట. విద్యార్థి నాయకులు, కార్మికనాయకులు, పౌరహక్కుల నాయకులు యిలా అనేకమంది యీ కేసులు ఎదుర్కుంటున్నారు.
శాంతిభద్రతలు కాపాడతాడని యోగి పేరు తెచ్చుకోవడం అఖిలేశ్‌ను బాగా దెబ్బ కొట్టింది. బియస్పీ, ఎస్పీల పాలనలో గూండాగిరీ బాగా ఎక్కువగా నడిచింది. అఖిలేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా పాలనలో తొలి సగకాలంలో అతని మాట చెల్లుబాటు అయ్యేది కాదు. ములాయం అండ చూసుకుని ఎస్పీ నాయకులు, కార్యకర్తలు తమ చిత్తం వచ్చినట్లు ప్రజలను భయభ్రాంతులను చేశారు. ఇప్పుడు అఖిలేశ్ అలాటివి సహించను, పార్టీని సంస్కరించాను అని చెప్పుకున్నా, ప్రజలు ఛట్టున నమ్మలేరు కదా. గతంలో కంటె ఎక్కువ సీట్లు యిచ్చి ప్రొబేషన్‌లో పెట్టారు. ఆ పార్టీ నెగ్గిన చోట్ల ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తిస్తారో చూసిన తర్వాత వచ్చేసారికి అతనిపై గురి కుదిరితే కుదరవచ్చు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)