మే నెల వచ్చింది.. కరెంట్ కష్టాలు తప్పుతాయా?

ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ నెల మొత్తం కరెంట్ కష్టాలు నడిచాయి. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, అధికార పక్షం ఎన్ని సమర్థింపులు చేసుకున్నా.. కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడారనేది మాత్రం పచ్చి నిజం. దీనికి…

ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ నెల మొత్తం కరెంట్ కష్టాలు నడిచాయి. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, అధికార పక్షం ఎన్ని సమర్థింపులు చేసుకున్నా.. కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడారనేది మాత్రం పచ్చి నిజం. దీనికి సంబంధించి గతంలో వివరణలు ఇచ్చుకున్న ప్రభుత్వ పెద్దలు.. మే మొదటి వారం నుంచి రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండవని ఘనంగా ప్రకటించుకున్నారు. అధికారులతో ప్రెస్ మీట్లు కూడా పెట్టించారు.

ఇప్పుడు మే మొదటి వారంలోకి వచ్చేశాం. కరెంట్ కోతల వెతల నుంచి ప్రజల్ని బయటపడేసేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వివరించాల్సిన అవసరం ఉంది. కరెంట్ కొనుగోళ్లకు సంబంధించి ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారా? ఉన్న ప్లాంట్స్ లో విద్యుత్ ఉత్పత్తి పెంచారా? బొగ్గు నిల్వల సామర్థ్యాన్ని పెంచుకున్నారా? పవర్ హాలిడేను ఎప్పుడు ఎత్తేస్తారు? లాంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వంపై ఇన్ స్టెంట్ గా వ్యతిరేకత వచ్చేది కరెంట్ కోతలతోనే. ఈ విషయంలో ప్రభుత్వం ఎంత తొందరగా నష్టనివారణ చర్యలు తీసుకుంటే అంతమంచిది. లేదంటే నవరత్నాలు కూడా ఆదుకోలేవు.

కరెంటు చార్జీలు పెంచినా ప్రజలు తొందరగానే మరచిపోతారు, కానీ నిమిషంపాటు కరెంటు లేకపోతే మాత్రం దాన్ని బాగా గుర్తు పెట్టుకుంటారు. అందులోనూ పరీక్షల సీజన్ ఇది. రాత్రిపూట విద్యార్థులు గుడ్డిదీపాల వెలుగులో చదువుకోడానికి పడుతున్న ఇబ్బందుల్ని ప్రతిపక్షాలు బాగా హైలెట్ చేస్తున్నాయి. అక్కడక్కడ ఉన్న ఇలాంటి ఇబ్బందుల్ని రాష్ట్రం మొత్తం ఉన్నాయంటూ టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేస్తోంది. ఇలాంటి సమయంలో విద్యుత్ ఉత్పత్తి పెంచాలి. లేదా ఎక్కువ రేటుకి విద్యుత్ ని కొనుగోలు చేయాలి. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది.

దేశవ్యాప్తంగా కరెంటు సమస్యలున్నాయి. ఢిల్లీలో కరెంటు కోతతో మెట్రో రైళ్లు కూడా ఆగే పరిస్థితి ఉంది. ఆస్పత్రులకు కూడా కరెంటు సప్లై చేయలేమంటూ రాష్ర్ట ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో ప్యాసింజర్ రైళ్లను సైతం రద్దు చేసి కేంద్రం గూడ్సు రైళ్ల సంఖ్య పెంచి బొగ్గు సరఫరా చేస్తోంది. వేసవిలో కరెంటు అవసరాలు పెరుగుతాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని కరెంటు నిల్వ చేయడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి.. అప్పటికప్పుడు కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా చూడడం ఒక్కటే ప్రత్యామ్నాయం.

వినియోగం ఎక్కువగా ఉన్న సమయంలో ఉత్పత్తి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీనికి అధికారుల ముందుచూపే మందు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం చివరకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరి ఏపీలో అధికారులు ఏం చేస్తున్నారు..? వారికి మంత్రులు ఏమేరకు సూచనలిస్తున్నారు? ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు?

దిశానిర్దేశం చేసిన జగన్

ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ అధికారులు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. విద్యుత్ ప్రాజెక్టుల్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రేటు ఎక్కువైనప్పటికీ బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాలన్నారు. పరిశ్రమలకు సరిపడేంత విద్యుత్ అందించాలని ఆదేశించారు. డిమాండ్, సప్లయ్ కు అనుగుణంగా బొగ్గు కొనుగోలు చేయాలని అన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో విద్యుత్ కోతల్ని అధిగమించగలం. ఏమాత్రం ఆలస్యం చేసినా, ఈనెలలో కూడా విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడక తప్పదు. ప్రభుత్వంపై అసంతృప్తి పెరగక తప్పదు.