4 సినిమాలు.. వినూత్న ప్రచారాలు

ఈ వారం పెద్ద సినిమాలేం లేవు. అన్నీ చిన్న సినిమాలే. కానీ అవన్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. దానికి కారణం ఆ సినిమా జనాలు చేస్తున్న ప్రచారం. కొన్ని సినిమాలు కొత్త పోకడలతో ప్రచారం చేస్తుంటే,…

ఈ వారం పెద్ద సినిమాలేం లేవు. అన్నీ చిన్న సినిమాలే. కానీ అవన్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. దానికి కారణం ఆ సినిమా జనాలు చేస్తున్న ప్రచారం. కొన్ని సినిమాలు కొత్త పోకడలతో ప్రచారం చేస్తుంటే, మరికొన్ని సినిమాలు సంప్రదాయ ప్రచారాన్నే నమ్ముకున్నాయి. మొత్తానికి 4 సినిమాలూ ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.

అశోకవనంలో అర్జునకల్యాణం సినిమానే తీసుకుంటే, ఈ సినిమాకు ప్రమోషన్ కల్పించేందుకు ప్రాంక్ ప్లాన్ చేశాడు హీరో విశ్వక్ సేన్. అది కాస్తా రివర్స్ అయి వివాదాస్పదమైంది. విశ్వక్ కు కొత్త చిక్కులు, తలనొప్పులు తెచ్చిపెట్టింది. అయితేనేం సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ వివాదమే బాగా పనికొచ్చింది. ఇప్పుడీ సినిమా గురించి జనాలు అంతోఇంతో మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం ఆ 'ప్రాంక్ వివాదమే'.

ఇక జయమ్మ పంచాయితీ గురించి అందరికీ తెలిసిందే. చాన్నాళ్ల తర్వాత మరోసారి వెండితెరపైకొచ్చిన సుమ, తన సినిమా ప్రచారం కోసం టీవీ రంగాన్ని ఓ రేంజ్ లో వాడేసింది. దాదాపు హిట్టయిన ప్రతి కార్యక్రమాన్ని ఆమె తన సినిమా ప్రచారానికి వాడేసింది. ఇది చాలదన్నట్టు క్షేత్రస్థాయి పర్యటనలతో కూడా హడావుడి చేస్తోంది. అలా జయమ్మను ప్రేక్షకులకు దగ్గర చేసింది సుమ.

ఇక ఆర్జీవీ గురించి చెప్పేదేముంది. తన సినిమా ప్రచారం కోసం ఆయన అవసరమైతే వివాదాలు కూడా రేపుతారు. ఎంతమందినైనా విమర్శిస్తారు. మా ఇష్టం (డేంజరస్) అనే సినిమా కోసం కూడా వర్మ తనదైన శైలిలో ప్రచారం చేస్తూనే ఉన్నాడు. హీరోయిన్లతో ముద్దులు పెట్టించుకుంటూ, బోల్డ్ ఇంటర్వ్యూలు, చర్చలు చేస్తూ..  అందులో ఆయన సక్సెస్ అయ్యాడు కూడా.

ఈ మొత్తం వ్యవహారంలో కాస్త వెనక్కుతగ్గిన సినిమా ఏదైనా ఉందంటే అది భళా తందనాన మాత్రమే. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు కూడా ప్రచారం బాగానే చేశారు. కాకపోతే అది సంప్రదాయ పద్ధతిలో మాత్రమే జరిగింది. దీంతో రాజమౌళి లాంటి స్టార్ ను అతిథిగా పిలిచి మాట్లాడించినప్పటికీ ఆడియన్స్ కు పూర్తిస్థాయిలో ఈ సినిమా చేరలేదనే చెప్పాలి.

మొత్తమ్మీద రేపు రిలీజ్ అవుతున్న 4 సినిమాలూ ప్రచారంతో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి. ఆచార్య వైపు కన్నెత్తి కూడా చూడని ప్రేక్షకుడు.. వీటిలో ఏ సినిమాను ఆదరిస్తాడో చూడాలి.