అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా తన సైన్యాలను, నాటో సైన్యాలను ఉపసంహరించుకుంటోంది. ట్విన్ టవర్స్ కూల్చివేతకు 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2021 సెప్టెంబరు 11 నాటికి అఫ్గనిస్తాన్‌ను అమెరికన్ సైనికరహితంగా చేయాలని జో బైడెన్ పట్టుదలగా వున్నాడు. ఆ ప్రకారమే అమెరికా విరమణ జోరుగా సాగుతోంది. ఆగస్టు నెలాఖరుకే అందరూ వెళ్లిపోయేట్లున్నారు. అయితే యీ క్రమంలో అఫ్గనిస్తాన్‌ను దాని కర్మానికి దాన్ని వదిలేసి వెళ్లడం చాలామంది హర్షించటం లేదు. ఆ దేశం కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందని, చైనా పాకిస్తాన్‌లు తమ స్వప్రయోజనాల కోసం ఆ దేశాన్ని వాడుకుంటాయని, ఇన్నాళ్లూ అఫ్గన్ ప్రభుత్వంతో స్నేహంగా వున్న మన దేశం చిక్కుల్లో పడుతుందని భయపడుతున్నారు. ఎందుకంటే యిప్పటికే తాలిబాన్లు అఫ్గన్ ప్రభుత్వంపై పైచేయి సాధిస్తున్నారు. చాలా నగరాలు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా అండ పోయిన తర్వాత ప్రభుత్వసేనలు వీరిని నిలవరించలేక ప్రభుత్వం కుప్పకూలుతుందని తోస్తోంది. జరుగుతున్నదేమిటి? జరగబోయేదాని గురించి ఆందోళన ఎందుకు?
అమెరికా యీ ఊబిలో ఎందుకు దిగబడిందో, ఎందుకు బయటపడా లనుకుంటోందో అర్థం కావాలంటే గతం గురించి తెలియాలి. తెలిసినవారు మొదటి పార్ట్‌లో చాలా భాగం వదిలేయవచ్చు. తెలుసుకోదలిచినవారు మాత్రం చదవాల్సి వుంటుంది. గత శతాబ్దాలలో సామ్రాజ్యవాద దేశాలు వలసవిధానాన్ని అవలంబించాయి. ప్రపంచంలో ఎక్కడ ఖనిజసంపద ఉన్నా, ప్రకృతి సంపద వున్నా అక్కడకు వాలిపోయి, స్థానిక పాలకులలో విభేదాలు కల్పించి, ఆధిపత్యం సంపాదించి, లొంగనివాళ్లను సైనికబలంతో ఓడించి, అక్కడి ప్రభుత్వాలను ప్రత్యక్షంగానో, కీలుబొమ్మ పాలకుల ద్వారా పరోక్షంగానో పాలిస్తూ అక్కడి ఖనిజాలను తమ దేశానికి తరలించుకుని పోయారు. ప్రపంచ యుద్ధాల తర్వాత అవి నీరసించాయి.
ఆ యుద్ధాలలో అమెరికా ప్రధాన భూమిక వహించినా, యుద్ధం యూరోప్‌లో, ఆసియా, ఆఫ్రికాలలోనే జరగడం చేత ఆ దేశపు వనరులు నాశనం కాలేదు. (పెరల్ హార్బర్ ఒక్కటే దాడికి గురైంది). నష్టాలు తక్కువ కావడంతో యుద్ధానంతరం అది అగ్రదేశంగా ఆవిర్భవించింది. ప్రాకృతిక వనరులు ఎక్కువ, జనాభా తక్కువ. ప్రపంచంలోని మేధావులందరినీ ఆకర్షించి, తెచ్చుకుని ప్రపంచానికే పెద్దన్నగా మారింది. ఆ పై కొత్తరకం సామ్రాజ్యవాదం మొదలుపెట్టింది. ప్రపంచంలో ఎక్కడ పెట్రోలు వున్నా, ఖనిజాలు వున్నా కన్ను వేయడం, స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. ఇటు రష్యా కూడా యితర దేశాలపై ఆధిపత్యానికి ప్రయత్నించడంతో యిద్దరి మధ్య కొంతకాలం కోల్డ్ వార్ నడిచింది. తర్వాత రష్యా బలహీనపడి, తన యిల్లు తనే చక్కబెట్టుకోలేక విచ్ఛిన్నమైనా, అమెరికా ఆగలేదు. కమ్యూనిజం వ్యాప్తిని అరికడుతున్నాం అనే పేర, యితర ఖండాలలో సైన్యం ద్వారా, తన గూఢచారి సంస్థ సిఐఏ ద్వారా అనేక దురాగతాలకు ఒడిగడుతూ వచ్చింది.
తనకు సంబంధం లేని వియత్నాం యుద్ధంలో అమెరికా తలదూర్చి భారీ మూల్యమే చెల్లించింది. అయినా పాఠాలు నేర్చుకోలేదు. దక్షిణ అమెరికా దేశాలన్నిటిలో అస్థిరతకు కారణమై, మాదక ద్రవ్యాల వ్యాప్తికి కారణమైంది. పెట్రోలు కోసం మధ్యప్రాచ్యపు రాజకీయాల్లో వేలు పెట్టి, ఇజ్రాయేలుకు అండగా నిలుస్తూ అక్కడ నిరంతర ఘర్షణకు కారణభూతురాలైంది. ఆ కారణంగా అక్కడ టెర్రరిజం ఉద్భవించడానికి కారకురాలైంది. అమెరికా న్యాయాన్యాయాలను పట్టించుకోదు. పెద్దమనిషిగా వ్యవహరించదు. తన మాట వినని వాళ్లను సైనిక శక్తితో అణచివేయడమే పనిగా పెట్టుకుంది. ఆ శక్తిని ఎదుర్కోలేనివారు ఉగ్రవాదాన్ని ఆశ్రయించి, దురాగతాలకు పాల్పడుతున్నారు. క్రమేపీ అది బలపడి ప్రపంచప్రజలందరూ బాధపడుతున్నారు.
అమెరికా మార్కు రాజకీయాలకు అఫ్గనిస్తాన్ మరో ఉదాహరణ. అక్కడ విలువైన ఖనిజాలున్నాయి. భౌగోళికంగా అది కీలకమైన ప్రాంతంలో వుంది. దానికి పశ్చిమాన ఇరాన్, తూర్పున, దక్షిణాన పాకిస్తాన్, ఉత్తరాన టర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, ఈశాన్యాన చైనా ఉన్నాయి. అక్కడి నుంచి అనేక దేశాలపై గూఢచర్యం నెరపవచ్చు. మనం చరిత్ర పుస్తకాల్లో ఖైబర్ కనుమ గురించి చదివాం. మన దేశంపై దండెత్తిన విదేశీయులందరూ ఆ కనుమ ద్వారానే ప్రవేశించేవారు. అది పాకిస్తాన్‌లోనే వున్నా, అఫ్గన్ సరిహద్దుల్లో వుంది.
1919లో అఫ్గనిస్తాన్‌కు బ్రిటిషు స్వాతంత్ర్యం యిచ్చేశాక దాని రాజు సరిహద్దు దేశమైన రష్యా చక్రవర్తితో సన్నిహితంగా వుండేవాడు. బ్రిటిషు అధీనంలో వున్న ఇండియాపై దాడి చేయడానికి ఎప్పటికైనా పనికివస్తుందనే ఊహతో రష్యా చక్రవర్తి అఫ్గనిస్తాన్‌కు సహాయసహకారాలు అందిస్తూ వచ్చాడు. పాకిస్తాన్ ఏర్పడ్డాక, అమెరికా దాన్ని తన సైనికకేంద్రంగా మలచుకుంది. పాక్ ప్రజలకు, అఫ్గన్‌లకు తరతరాలుగా పడదు కాబట్టి, అఫ్గనిస్తాన్‌ను అమెరికా దూరం పెట్టింది. దానితో అఫ్గనిస్తాన్ రష్యాకు మరింత చేరువై వారి దగ్గర్నుంచి ఆర్థికసాయంతో పాటు ఆయుధాలు కూడా పొందింది. 1973లో దావూద్ ఖాన్ అనే అతను రష్యా సమర్థకులైన అఫ్గన్ సైన్యం సహాయంతో రాజుని తప్పించి, తనే పాలకుడై పోయాడు. పాక్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాడు. పాక్ పాలకుడైన భుట్టో దావూద్‌కు వ్యతిరేకంగా అఫ్గన్లను సమీకరించి, కుట్ర చేయించాడు. ఆ కుట్ర విఫలమైనా, భయపడిన దావూద్ 1978లో పాక్‌తో రాజీ పడ్డాడు. అది నచ్చని అఫ్గన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు తరాకీ సైన్యం సహాయంతో దావూద్‌ను తప్పించివేసి, ప్రధానిగా అధికారంలోకి వచ్చాడు. వచ్చాక సోవియట్ తరహా భూసంస్కరణలు, స్త్రీవిద్య వగైరా అనేక సంస్కరణలు అమలు చేశాడు. అఫ్గన్‌లో అనాదిగా వున్న భూస్వామ్య వర్గాలకు అవి నచ్చలేదు. పాకిస్తాన్‌ను పాలిస్తున్న సైనిక నియంత జియా ఉల్ హక్ యీ పరిస్థితిని వాడుకుందామనుకున్నాడు. జిమ్మీ కార్టర్ నేతృత్వంలోని అమెరికా సాయపడతానంది.
సంస్కరణలు ఇస్లాంకు వ్యతిరేకం అనే పేరు చెప్పి పాకిస్తాన్ భూస్వాములను కూడదీసుకుని, సిఐఏ నిధులతో ముజాహిదీన్ పేర ప్రభుత్వ వ్యతిరేక దళాలకు తర్ఫీదు యిచ్చి, ఆయుధాలిచ్చి అఫ్గన్ ప్రభుత్వంపై ఉసిగొల్పింది. దాంతో 1978 మధ్య నాటికి దేశం అంతర్యుద్ధంలో మునిగింది. 1979 సెప్టెంబరులో ఉపప్రధాని హఫీజుల్లా అమీన్ అధికారాన్ని చేజిక్కించుకుని, తరాకీతో సహా తన పోటీదారులందరినీ హతమార్చి, ‘అమెరికాను, పాకిస్తాన్‌ను నిలవరించడానికి మీరు వచ్చి ఆదుకోండి’ అని రష్యాను అర్థించాడు. అఫ్గనిస్తాన్‌లో నిర్మాణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న రష్యన్లపై, వారి ఆస్తులపై యీ అంతర్యుద్ధం సందర్భంగా దాడులు జరగడంతో ఆందోళన పడుతున్న రష్యా అఫ్గన్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుని దానికి సహాయంగా తన సైన్యాన్ని దింపింది.
పోనుపోను అమీన్ అసమర్థుడని, దేశప్రజలను ఆకట్టుకోలేక పోయాడని, అమెరికా వైపు మళ్లేందుకు ఆలోచిస్తున్నాడని గ్రహించింది. ఇరాన్‌లో ఇస్లామిక్ తిరుగుబాటు వచ్చినట్లే, యిక్కడే వచ్చి తన సామ్రాజ్యంలోని ముస్లిములకు స్ఫూర్తి నిచ్చేట్లు వుందని భయపడింది. 1979 డిసెంబరులో రష్యా అధినేత బ్రెజ్నేవ్ ఆదేశాల మేరకు రష్యా సైన్యం వచ్చి అఫ్గనిస్తాన్‌ను చేజిక్కించుకుంది. అమీన్‌ను చంపేసి, బాబ్రక్ కర్మాల్ అనే మాజీ ఉపప్రధానికి అధికారం అప్పగించింది. అతను 1986 వరకు అధినేతగా వున్నాడు. ఎన్నో సంస్కరణలు అమలు చేసినా, ప్రజలు అతన్ని రష్యా చేతిలో కీలుబొమ్మగానే చూశారు. 1985 మార్చిలో రష్యన్ కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా గోర్బచేవ్ వచ్చాక ఆఫ్గనిస్తాన్ నుంచి రష్యా తప్పుకోవాలని నిర్ణయించాడు. ఒక్కసారిగా తప్పుకుంటే ప్రమాదమని 1985 ఏప్రిల్‌తో మొదలుపెట్టి 1987 జనవరి కల్లా ఆఫ్గన్ నుంచి రష్యా సైన్యంలో చాలాభాగాన్ని వెనక్కి రప్పించేశాడు. 1987 సెప్టెంబరులో కర్మాల్‌ను తీసేసి నజీబుల్లా అనే అతనికి అధికారం అప్పగించాడు. ఆఫ్గన్ల భవితవ్యాన్ని వారే నిర్ణయించుకుంటారన్నాడు.
అది అమెరికాకు అది నచ్చలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే కమ్యూనిస్టు భావనలు వున్నవారు ఎన్నికవుతారన్న భయం దానికి వుంది. అందుకని దానిలోకి జొరబడింది. ప్రభుత్వంపై దండెత్తడానికి, హింసాత్మకంగా అధికారం చేజిక్కించుకోవడానికి ప్లాన్లు వేసింది. పైకి ప్రజాస్వామ్యం పేరు వల్లించినా, ఏ దేశంలోనైనా సరే అది ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి సైనికాధికారులను, మతఛాందసులను వాడుకుంటుంది. రష్యా ప్రోద్బలంతో ఆఫ్గన్ ప్రభుత్వం తమ దేశంలోని కల్లోలిత ప్రాంతమైన బెలూచిస్తాన్‌పై దాడి చేయవచ్చని జియా ఉల్ హక్ అనుకున్నాడు. సౌదీ అరేబియాతో బేరాలాడాడు. చివరకు అమెరికా, సౌదీ, పాకిస్తాన్ కలిసి అఫ్గనిస్తాన్‌లోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని పష్టూన్ విద్యార్థులను 90 వేల మందిని తాలిబన్లను చేరదీసి మొహమ్మద్ ఒమార్ అనే అతని నేతృత్వంలో ఒక సేనగా తయారు చేశారు. వీళ్లు ఛాందస ముస్లింలు. షరియాను కచ్చితంగా అమలు చేస్తారు. పాకిస్తాన్‌లోని సైనిక నియంత ప్రభుత్వం ద్వారా వారికి ఆయుధాలలో తర్ఫీదు యిప్పించింది.
ఇవన్నీ చూసి గోర్బచెవ్ కాస్త తయాయించాడు. కొద్దిపాటి సైన్యాన్ని నజీబుల్లాకు రక్షణగా వుంచాడు. దేశాధ్యక్షుడిగా ఉన్న నజీబుల్లా సోవియట్ ప్రత్యక్ష సహకారం లేకుండా ప్రభుత్వాన్ని నడపవలసి వచ్చింది. పరోక్షంగా సోవియట్‌ల సాయం పొందుతూ తన పాలనలోంచి సోషలిజాన్ని తీసేసి, ఆఫ్గన్ జాతీయవాదాన్ని చొప్పించాడు. ఇస్లాంను అధికార మతంగా గుర్తించాడు. కమ్యూనిస్టేతర పార్టీలకు కూడా ప్రభుత్వంలో చోటిచ్చాడు. ‘ఏదో ఒకటి చేసి, నీ అవస్థ నువ్వు పడు’ అంటూ గోర్బచెవ్ 1988 మే నుంచి మొదలుపెట్టి 1989 ఫిబ్రవరి నాటికి మొత్తం రష్యన్ సైన్యాన్ని వెనక్కి రప్పించేశాడు. కానీ నజీబుల్లాకు ఆర్థికసాయం చేయడం కొనసాగించాడు. 1991 డిసెంబరులో రష్యా విచ్ఛిన్నం కావడంతో అతనికి వారి సాయం అందడం మానేసింది. ఓ మిలటరీ జనరల్ యితన్ని వదిలి ముజాహిదీన్‌లతో చేతులు కలిపి, యితన్ని పదవీభ్రష్టుణ్ని చేశాడు. ఇతను ఇండియా పారిపోదామనుకుని, కుదరక, యుఎన్‌ఓ ఆఫీసులో తలదాచుకున్నాడు. కానీ రాజధాని ముజాహిదీన్ల వశం కావడంతో వాళ్లు అతన్ని పట్టుకుని చంపివేశారు.
ఇక 1992 నుంచి 1996 వరకు అఫ్గనిస్తాన్‌లో భయంకరమైన అంతర్యుద్ధం చెలరేగింది. నజీబుల్లాను దింపడానికి చేతులు కలిపిన ముజాహిదీన్‌లు తమలో తాము కలహించుకున్నారు. అంతర్యుద్ధంలో తాలిబాన్లు ముజాహిదీన్‌లపై పైచేయి సాధించారు. 1996 నాటికి దేశంలోని నాల్గింట మూడువంతుల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. రాజధానిని కాబూల్ నుంచి దక్షిణంలో తమ అధీనంలో వున్న కాందహార్‌కు మార్చారు. ఒకసారి అధికారంలోకి వచ్చాక అమెరికన్ల వద్ద పొందిన తర్ఫీదుతోనే, వారిచ్చిన ఆయుధాలతోనే అమెరికాను ఎదిరించ సాగారు. పాకిస్తాన్ ద్వారా వారిని కట్టడి చేయబోయింది అమెరికా. వాళ్ల ఉగ్రవాదాన్ని అదుపు చేయడానికి మీరు సాయం చేయాలంటూ పాక్ ప్రభుత్వం అమెరికా నుంచి నిధులు దండుకుంటూ, మరో పక్క ఉగ్రవాదం ఎప్పటికీ చల్లారకుండా చూసింది. ఆ కారణంగా తాలిబాన్లు బలపడుతూనే వచ్చారు. చివరకు వాళ్లు ఏ స్థాయికి వచ్చారంటే 1999 నాటికే అల్ ఖైదాతో పొత్తు కుదుర్చుకుని 2001 సెప్టెంబరులో అమెరికాపై దాడి చేయడానికి ఒసామా బిన్ లాడెన్‌కు సహాయ సహకారాలందించారు.
తాము పాలు పోసి పెంచిన పాము తననే కాటేయడంతో అమెరికాకు కోపం వచ్చింది. వెంటనే అక్టోబరులో అఫ్గనిస్తాన్‌పై దాడి చేసింది. తనతో పాటు నాటో సైన్యాలను కూడా లాక్కుని వచ్చింది. 2001 డిసెంబరులో తాలిబాన్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. లాడెన్ దొరక్కుండా పారిపోయాడు. అమెరికా యునైటెడ్ నేషన్స్ ద్వారా హమీద్ కర్జాయ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది. అఫ్గన్‌ను పునర్నిర్మిస్తున్నామంటూ నిధులు కురిపించింది. 2004లో ఎన్నికలు జరిపించి, కర్జాయ్‌ని అధ్యక్షుణ్ని చేసింది. ఆ ఎన్నికలో అక్రమాలు జరిగాయి అంటూ ఆరోపణలు వచ్చాయి. కర్జాయ్‌ను అమెరికా కీలుబొమ్మగానే చూశారు ప్రజలు. అమెరికా అఫ్గన్ ప్రభుత్వసేనలకు ఆయుధాలిచ్చింది. తర్ఫీదు యిచ్చింది. అధ్యక్షులు మారారు. రాజకీయ నాయకులు వారిలో వారు తగవులాడుకున్నారు. ఏం చేసినా తాలిబన్లను రూపుమాపలేక పోయింది. గత 20 ఏళ్లగా అమెరికా ఎన్ని తంటాలు పడినా సమస్య పెద్దదైంది తప్ప తగ్గలేదు. ఇది మరో వియత్నాంగా మారుతోందని గ్రహించి, ఒబామా హయాంలో అడుగులు వెనక్కి తీసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. కానీ ఆ ప్రక్రియ ట్రంప్ హయాంలో నత్తనడక నడిచింది.
ఎందుకంటే అనుకోగానే మూటాముల్లె సర్దేసుకుని వెళ్లిపోవడం అంత సులభమైన పని కాదు. రష్యన్లు అయితే అఫ్గన్ సరిహద్దుల్లో వున్న తమ దేశాల ద్వారా సులభంగా తిరోగమించారు. అమెరికా అయితే చాలా దూరంలో వుంది. బగ్రామ్, జలాలాబాద్, కాందహార్‌ల నుండి విమానాల్లోనే బయటపడాలి. తాలిబాన్లు సహకరిస్తే తప్ప క్షేమంగా బయటపడలేరు. పైగా అమెరికా వుండగా దానికి సహకరించిన వారందరినీ ఉపసంహరణ తర్వాత తాలిబాన్లు మట్టుపెడతారన్న భయం వుంది. అందుకని తాలిబన్లను, అఫ్గన్ ప్రభుత్వాన్ని కూడా కూర్చోపెట్టి 2018లో త్రైపాక్షిక చర్చలు ప్రారంభించింది. చర్చల కారణంగా జాప్యం జరిగి, ఖర్చులు మరింత పెరిగాయి. ఇప్పటికి 20 ఏళ్లలో అమెరికా 2.36 లక్షల కోట్ల డాలర్లు (177 లక్షల కోట్ల రూ.లు) ఖర్చు పెట్టింది. 2500 మంది అమెరికన్ సైనికులు, నాటో వారు వెయ్యి మంది మరణించారు. 20 వేల మందికి తీవ్రగాయాలయ్యాయి.
అఫ్గనిస్తాన్ పర్వతప్రాంతం, బయటివాళ్లకు భూమార్గాన దాన్ని జయించడం కష్టం. అందువలన అమెరికా కసికొద్దీ బాంబులు వేసేది. 2.41 లక్షల మంది చనిపోయారు. అంతకు అనేక రెట్లు ఆకలితో చనిపోయారు. ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌లలో 71వేల మంది పౌరులు, 78 వేల మంది అఫ్గన్ సైనికులు, పోలీసులు చనిపోయారు. తిరుగుబాటుదారులు 84 వేల మంది చనిపోయారు. 2020 ఫిబ్రవరిలో దోహాలో జరిగిన సమావేశంలో 2021 మే కల్లా వెళ్లిపోతాం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ యివ్వడం జరిగింది. కానీ అది జరగలేదు. 2500 మంది అమెరికన్ సైనికులు, 2500 మంది నాటో సైనికులు మిగిలివున్నారు. మీరు వెళ్లిపోతే ఎలా అని యిప్పటిదాకా అమెరికా దన్ను చూసుకుని కాంట్రాక్టులు చేపట్టిన 7 వేల మంది కాంట్రాక్టర్లు, అమెరికన్ సహాయ, నిర్మాణాత్మక కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ఆఫ్గన్లు, అఫ్గన్ ప్రభుత్వపాలకులు మొహమాట పెడుతూ వచ్చారు.
బైడెన్ అధ్యక్షుడిగా వచ్చాక వాళ్ల సంగతి మనకెందుకు, మనం వచ్చేశాక అల్లకల్లోలం జరిగితే మనకెందుకు, జరిగిన నష్టం చాలు, బేషరతుగా మనం వెనక్కి వచ్చేయాల్సిందే అని తీర్మానించాడు. ఈ ఏప్రిల్ రెండోవారంలో ఆ మేరకు ప్రకటన చేశాడు. ఆగస్టు నెలాఖరు కల్లా సైన్యాన్ని వెనక్కి రప్పించాలని బైడెన్ పట్టుదలగా వున్నాడు. ఎందుకంటే తాలిబన్లతో ఏ ఒప్పందం చేసుకున్నా, సరిగ్గా అమలవుతుందన్న నమ్మకం లేదు. ఖైదులో వున్న 7500 మంది తాలిబన్లను విడుదల చేయాలని త్రైపాక్షిక ఒప్పందంలో అఫ్గన్ ప్రభుత్వాన్ని ఒప్పించడంలో అమెరికా తాలిబన్లను మంచి చేసుకోవాలనే తాపత్రయం కనబరిచింది. అప్పటికి సరే అన్నా, అఫ్గన్ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదు. ఎందుకని అడిగితే ‘ఎన్నికలు జరిపేవరకూ తాలిబాన్లు ప్రభుత్వంలో పాలు పంచుకుంటామని ఒప్పుకున్నారు. కానీ యిప్పుడు ‘ఎన్నికలనేవి పాశ్చాత్య దేశాల కాన్సెప్టు. ఇస్లాంకు వ్యతిరేకం. ఎన్నికలే లేనప్పుడు ప్రభుత్వంలో చేరే ప్రశ్నే లేదు’ అంటూ తప్పుకున్నారు. అందుకనే ఆ ఖైదీలను విడుదల చేయలేదు’ అని ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇప్పుడు తాలిబాన్లు నగరాలను కైవసం చేసుకుని జైళ్లు తెరిచి తామే ఖైదీలను వదిలేస్తున్నారు.
అమెరికా సైన్యం వెనక్కి వచ్చేస్తూ వాళ్లతో బాటు యుద్ధ పరికరాలు కూడా తీసుకుని వచ్చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే అవి తాలిబన్ల చేతుల్లో పడ్డాయంటే వాటి సాయంతో అఫ్గన్ సైన్యాలను, తమను ఎదిరించినవాళ్లను అందర్నీ చంపగలరు. అయితే ఎస్‌యువిలు, ట్యాంకుల వంటి కొన్ని పరికరాలు విమానాల్లో ఎక్కించలేరు కదా. అందుకని వాటిని ధ్వంసం చేసి పడేస్తున్నారు. నిజానికి సంఖ్యాపరంగా చూస్తే తాలిబాన్లు 60 వేల మందే, అఫ్గన్ సైన్యాల సంఖ్య మూడు లక్షలు! పైగా వారి దగ్గర అమెరికన్లు యిచ్చిన ఆయుధాలున్నాయి. సైనిక అవసరాల కోసం రెండు దశాబ్దాలుగా 8700 కోట్ల డాలర్ల సాయం చేసిన అమెరికా యీ మధ్య 400 కోట్ల డాలర్లు సహాయం యిచ్చింది కూడా. అయినా వాళ్లు తాలిబాన్లతో పోరాడడానికి విముఖత చూపిస్తున్నారు. అమెరికా వున్నంత కాలం ఏదో ఒక రకంగా పోరాటం చేసినప్పుడు నెలకు 3 వేల మంది సైనికుల దాకా మరణించేవారు. ఇప్పుడు వారిలో పోరాటం చేసే ఉత్సాహమే నశించింది. వాళ్ల ఆత్మస్థయిర్యాన్ని నశింపచేసిన తాలిబన్ల రణనీతి ఏమిటి? (సశేషం)