విశాఖ మహానగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ చెప్పిన సంగతి విధితమే. విశాఖ ఎంతో సురక్షితమైనది కూడా ఆయన గట్టిగా చెప్పారు. అటువంటి విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్ ప్రకటించారు.
ఇక విశాఖకు సీ, ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీ ఉంది. దాంతో సమీప భవిష్యత్తులో విశాఖ అన్ని విధాలుగా ఏపీకి గ్రోత్ ఇంజన్ గా మారనుందని అంతా అంటున్నారు. దానికి నాందీ ప్రస్థానంగా పలు ఐటీ కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయి. దాంతో పాటు ఇతర పరిశ్రమలు కూడా విశాఖకు వస్తున్నాయి.
పెట్టుబడులు రాష్ట్రానికి రావడంలేదు అన్న వారికి కనువిప్పు కలిగేలా విశాఖలో త్వరలోనే వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇందులో భాగంగా జపాన్ దేశానికి చెందిన టైర్ల కంపెనీ విశాఖలో ఏర్పాటు కాబోతోంది. రెండు వేల అయిదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ కంపెనీని విశాఖలో స్థాపించనున్నారు.
జపాన్ కి చెందిన ప్రముఖ కంపెనీ యకోహమా విశాఖలో ఆఫ్ హైవే టైర్ల ప్లాంట్ ని ఏర్పాటు చేయనుంది. దీని వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. దీనితో పాటే మరిన్ని కంపెనీలు కూడా విశాఖ కేంద్రంగా వస్తాయని కూడా పారిశ్రామిక వర్గాలు చెబుతున్న మాట.