కోవాక్సిన్ విషయంలో పెద్ద ప్రశ్న ఏమిటంటే – బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్లు వాడవచ్చా లేదా? అనేది. వాళ్ల వెబ్‌సైట్‌లోనే అవి వాడేవాళ్లు వాక్సిన్ వేయించుకోవద్దు అని పెట్టారని జనవరి 19 నాటి ‘‘హిందూ’’లో హెడ్‌లైన్స్‌లో యిచ్చారు. తక్కిన అనేక పేపర్లలో కూడా అదే వచ్చింది. 30-69 ఏళ్ల గ్రూపులో వున్నవారిలో 17% మంది బ్లడ్ థిన్నర్స్ వాడతారు కాబట్టి వాళ్లు కోవాక్సిన్ తీసుకోలేరని ద ప్రింట్ జనవరి 26 నాటి కథనం వచ్చింది. వాళ్లు భారత్ వాళ్లని ప్రశ్నిస్తే ‘నో కామెంట్’ అని జవాబు వచ్చిందని కూడా ఆ కథనంలో రాశారు. దిల్లీ వాక్సినేషన్ క్యాంపుల్లో బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్లకు కోవాక్సిన్ యివ్వడానికి నిరాకరించారని ఇండియా టుడే మార్చి 4 నాటి కథనంలో వచ్చింది. భారత్ వారి ఫాక్ట్ షీట్‌లో కూడా అవి వాడేవాళ్లు డాక్టర్లకు చెప్పి సంప్రదించాలి అని రాశారు.
దీని గురించి వాట్సాప్‌లు ఒకటి, రెండు వచ్చాయి కాబట్టి కొంతమందికి అవగాహన ఏర్పడి, వాళ్ల డాక్టర్లను అడిగితే కొందరు ‘వాక్సిన్ వేయించుకునే రోజున మానేయండి’ అంటున్నారు. కొందరు ‘రెండు, మూడు రోజుల ముందు మానేయండి’ అంటున్నారు. ఇంకా కొందరు ‘ఒక రోజు ముందూ, ఒక రోజు వెనకాలా మానేయండి’ అంటున్నారు. కొందరు డాక్టర్లు పత్రికాముఖంగా అడిగిన ప్రశ్నకు కూడా రెండు రోజుల ముందు మానేయండి అంటున్నారు. వీరిలో ఎవరి దగ్గరా ఏ డేటా లేదు. ఊహించి చెప్తున్నారు. ఎందుకంటే 55 ఏళ్లు దాటినవారిలో బ్లడ్ థిన్నర్‌గా ఏస్పిరిన్ చాలామంది వేసుకుంటారు. వాళ్లు వాక్సిన్ వేయించుకుంటే ఉండే ప్రమాదమేమిటి అనేది స్పష్టంగా తెలిస్తే వాళ్లు జాగ్రత్తగా వుంటారు.
నిజానికి ప్రతి మందుకు సైడ్ ఎఫెక్ట్, ఒకటేమిటి అరడజను వుంటాయి. కానీ అందరికీ అన్నీ కానీ కొన్ని కానీ రావాలని రూలు లేదు. డాక్టరు మందిచ్చేటప్పుడు దీని వలన మీకు వాంతి వచ్చే ఫీలింగు రావచ్చు, తల తిరగవచ్చు, కడుపులో గడబిడ రావచ్చు… అని చెప్తే అవి వచ్చినపుడు ఓహో యీ మందువలన కాబోలు అనుకుని ఆయనకు చెప్తాం. ఆయన మందు మారుస్తాడు. చెప్పకపోతే ఆ బాధకూ, యీ మందుకూ లింకు పెట్టకుండా, చీకట్లో తచ్చాడుతాం. ఇప్పుడీ వాక్సిన్‌ల వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్‌స్ ఏమిటో తెలుసుకునేటంత సమయం లేదు. జనాభాలో 70% మందికి టీకా వేస్తే తప్ప హెర్డ్ ఇమ్యూనిటీ రాదు కాబట్టి, గబగబా వేసుకుంటూ పోతూన్నారు. మనమీద ప్రయోగాలు చేస్తూండగా వాళ్లకు కొత్త విషయాలు తెలిసి, మార్పులు చేస్తున్నారేమోయ
కోవిషీల్డ్ విషయంలో రెండు డోసుల మధ్య గ్యాప్ చూడండి. మొదట్లో నాలుగు వారాలన్నారు, తర్వాత 6-8 వారాలన్నారు, యిప్పుడు 12 వారాలు అంటున్నారు. నిజంగా 12 వారాల గ్యాప్ మంచిదో, లేక వాక్సిన్ల కొరత వచ్చింది కాబట్టి అవి భర్తీ చేసే వ్యవధి కోసం అలా చెప్పారో తెలియదు. గుళ్లో అర్చన చేయిద్దామని పట్టుకెళ్లిన కొబ్బరికాయ కొట్టగానే కుళ్లిపోయిందనుకోండి. పూజారి దగ్గర మరో కొబ్బరికాయ వుంటే, దాన్ని యిచ్చి అర్చన కానిచ్చేద్దాం, మళ్లీసారి వచ్చినప్పుడు కొబ్బరికాయ రిప్లేస్ చేద్దురుగాని అంటాడు. ఆయన దగ్గర లేదనుకోండి ‘కుళ్లిపోయిందని, అర్చన మానేయకండి, కుళ్లిపోవడం శుభసూచకం’ అంటాడు. ఎలాగైనా అర్చన చేయించే పంపిస్తాడు. కొబ్బరికాయ కుళ్లితే మంచిదో కాదో మాత్రం మనం ఎప్పటికీ కనుక్కోలేము.
అలాగే వాక్సిన్ విషయంలో గ్యాప్ గురించి అనుమానం వస్తోంది. అమెరికాలో చేసిన పరీక్షల్లో 12 వారాల వ్యవధి 90% ఫలితాలు యిచ్చింది కాబట్టి యిలా అంటున్నారని సరిపెట్టుకోవచ్చు. కానీ వెంటనే మరో సందేహం వస్తుంది. మరి నాలుగు వారాల వ్యవధిలో వేయించేసుకున్నవాళ్లకి పాపం యాంటీబాడీస్ తక్కువగా ఉత్పత్తి అయివుంటాయి. వాళ్ల సంగతేమిటి? మళ్లీ యింకోటి వేయమంటే వేస్తారా? ఎందుకు వేస్తారు? ఫస్ట్ డోస్ వేయించుకున్నవాళ్లకు సెకండ్ డోస్ యివ్వడానికే అవస్థ పడుతూంటే..? అలాగే కోవాక్సిన్ కూడా బూస్టర్ డోస్ వేయించుకుంటే మంచిది అని కంపెనీ వాళ్లే చెపుతున్నారు. అంటే తగిన రక్షణ కావాలంటే మూడు డోసులు వేయించుకోవాలన్నమాట. రెండోదానికే అల్లాడుతూంటే, మూడోది కూడానా పోవయ్యా అంటాయి ప్రభుత్వాలు. నిజానికి కోవాక్సిన్ విషయంలో రెండు డోసుల మధ్య 4 వారాలకు మించి గ్యాప్ వుండకూడదు. ఈ కొరత రోజుల్లో రెండోది ఖచ్చితంగా దొరుకుతుందన్న గ్యారంటీ వుంటేనే మొదటిది వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇవన్నీ డాక్టర్లెవరూ విపులంగా చెప్పటం లేదు. వాక్సిన్ వేయించుకున్న మన బంధుమిత్రులు ‘వాక్సిన్ వేయించుకోలేదా? భయమెందుకు? మేం వేయించుకున్నాం. మాకేవీ సైడ్ ఎఫెక్ట్‌స్ రాలేదు. టీకా వేశాక అరగంట సేపు కూర్చోమన్నారు. ఏమీ కాలేదు.’ అని ధైర్యం చెప్పేస్తున్నారు. వెంటనే వచ్చేది సైడ్ ఎఫెక్ట్ కాదు, రియాక్షన్ అని ఎలుగెత్తి చెప్పాలనిపిస్తుంది. పెన్సిలిన్ యింజక్షన్‌కైనా కొందరికి రియాక్షన్ వస్తుంది. టీకా యిచ్చాక దద్దుర్లు, జ్వరం సహజం. సైడ్ ఎఫెక్ట్‌స్ అనేవి క్రమేపీ బయటపడతాయి. కొన్నాళ్లు పరిశీలించందే అవి బయటపడవు. ఈలోగా ఏం చెప్పినా నవ్వేసి ఊరుకోవాలంతే. ఇప్పటికే మందులు వేసుకుంటూ సైడ్ ఎఫెక్ట్‌స్ భరిస్తున్నవాళ్లు, టీకా ఎఫెక్ట్ కూడా భరించాలా అని బెదరడంలో అర్థముంది. మందుల విషయంలో ఏవి వస్తాయో కాస్త తెలుసు. దీని విషయంలో తెలియదు. టీకా యిచ్చే రక్షణ తక్కువైనా ఫరవాలేదు కానీ దానివలన వచ్చే రిస్కు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలని ఆరాటపడడాన్ని అర్థం చేసుకోవచ్చు.
రక్షణ విషయం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, టీకా వేసుకున్నా కోవిడ్ వస్తోంది. వారిలో కొందరు ఆసుపత్రి పాలవుతున్నారు. వారిలో దురదృష్టవంతులు చనిపోతున్నారు కూడా. వేసుకున్నా రావడమేమిటండి అని బాధపడితే, వేసుకోకపోతే యింకా తీవ్రంగా వచ్చేది అని సముదాయిస్తున్నారు. వాక్సిన్ వచ్చేందుకు ముందు కూడా కరోనా కొందరిని బాగా బాధించింది, మరి కొందరిని చులాగ్గా వదిలిపెట్టేసింది. కొంతమందిలో లక్షణాలు కూడా కనబడలేదు. అందువలన యీ బెనిఫిట్ వాక్సిన్ వలననే వచ్చిందని ఖచ్చితంగా చెప్పలేము. ఇది చివరకు చిలకజోస్యంలా తయారైంది. ‘సంఖ్యాశాస్త్రం చూసి ప్రకారమే మీరు చెప్పిన నెంబరుతోనే కారు కొన్నాను. యాక్సిడెంటై తుక్కయిపోయింది’ అని ఫిర్యాదు చేస్తే ‘..అలా కొన్నారు కాబట్టే కారుతో పోయింది. లేకపోతే మీరే తుక్కయిపోయేవారు.’ అంటాడు ఆ సిద్ధాంతి.
ఐసిఎమ్‌ఆర్ ప్రకారం వాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న 10 వేల మందిలో 4 గురికి మాత్రం మళ్లీ కరోనా వస్తోంది. అంటే 0.04%. కానీ ఆక్స్‌ఫర్డ్ టీకా (కోవిషీల్డ్) మూడో దశ ప్రయోగాల్లో 5807 మందిలో 30 మందికి (0.5%) కరోనా పాజిటివ్ వచ్చిందని ఏప్రిల్ 25 నాటి ‘‘హిందూ’’ వ్యాసంలో వుంది. నా సర్కిల్స్‌లో చాలామందికి టీకా రెండు డోసులు వేయించుకున్నాక కరోనా వచ్చింది. వారం రోజుల దాకా ఆసుపత్రిలో వుంటున్నారు. కరోనా నియంత్రణకు వాక్సినే కీలకం అని యివాళ సౌమ్యా స్వామినాథన్ చెప్తూ రెండు డోసులు వాక్సిన్ వేసుకున్నవాళ్లు ఐసియు దాకా వెళ్లరు అన్నారు. కానీ అలా వెళ్లిన కేసులు నేను విన్నాను. కొంతమంది పోయారు కూడా. అదేమిటంటే అలాటి బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్లకు కొత్త వేరియంట్స్ కారణమని చెప్తున్నారు. (ఆంధ్రజ్యోతి మే 11).
రక్షణ విషయంలో గ్యారంటీ లేదు, రిస్కు విషయం మాటేమిటి? వాక్సిన్ వేసుకున్నాక ఆసుపత్రి పాలు కావడానికి, మరణించడానికి ఏమైనా సంబంధం వుందా అని పరిశోధిస్తున్నారా? చావు వార్త రాగానే పోస్ట్‌మార్టమ్ కూడా జరగకుండానే దానికీ, వాక్సిన్‌కూ సంబంధం లేదు అని ప్రకటనలు వెలువడిపోతున్నాయని, పారదర్శకత లోపిస్తోందని ‘‘హిందూ’’లో ఏప్రిల్ 15 న ఆర్టికల్ వచ్చింది. ఏ వాక్సినూ అన్ని వేరియంట్స్ నుంచి రక్షణ కల్పిస్తుందని అనడానికి లేదు. కానీ కోవాక్సిన్ అలా క్లెయిమ్ చేస్తోంది. అమెరికా వైట్ హౌస్ చీఫ్ మెడికల్ ఎడ్వయిజర్ ఆంథోనీ ఫాసీ, ఇండియన్ వేరియంట్‌గా పిలవబడుతున్న బి.1.617 వేరియంట్‌ను కూడా కోవాక్సిన్ న్యూట్రలైజ్ చేస్తోందని ఏప్రిల్ 28న ప్రకటించారు. దానికి గాను ఆయనకు లభించిన డేటా ఏమిటో మనకు తెలియదు, ఆయన చెప్పలేదు. బి.1.617 స్ట్రెయిన్‌పై కోవిషీల్డ్, కోవాక్సిన్‌లు పెద్దగా పనిచేయడం లేదని, యాంటీబాడీలు 50% మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాయి అని ఐసిఎమ్‌ఆర్ సైంటిస్టులు చెప్పారు. (హిందూ 150521).
ఇక్కడే యింకో విషయం చెప్పాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జన్సీ యూజ్ అనుమతి యిచ్చిన ఐదు వాక్సిన్‌లలో (ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, ఆక్స్‌ఫర్డ్, చైనావారి సైనోఫార్మ్)లో కోవాక్సిన్ లేదు. (హిందూ మే 9). పైన చెప్పినట్లు స్పుట్నిక్కూ లేదు. వాక్సిన్‌లు వేయించుకోమని చెప్పే డాక్టర్లు 55 సం.ల లోపున వాళ్లకు కోవిషీల్డ్‌తో ఫలానా రిస్కు వుంది, బ్లడ్ థిన్నర్ వాడేవాళ్లకు కోవాక్సిన్‌తో రిస్కు వుంది అని చెప్తున్నారా? అనేదే నా ప్రశ్న. అది చెప్పినా మనం వెళ్లి వేయించుకుంటాం. ఎందుకంటే, రెమెడిసివర్‌కు కూడా సైడ్ ఎఫెక్ట్‌స్ వున్నాయని చెప్తున్నారు. అయినా తీసుకుంటున్నాం కదా. కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ వాడకం వలన రోగనిరోధక శక్తి తక్కువ వున్నవాళ్లకు బ్లాక్ ఫంగస్ వస్తోందంటున్నారు. అందుకని మందులు వేసుకోవడం మానేయం కదా! అలాగే వాక్సిన్ కూడా తీసుకోవాల్సిందే. వద్దని నేను చెప్పటం లేదు.
వేసుకోకపోతే వచ్చే రిస్కు కంటె, వేసుకుంటే వచ్చే రిస్కు తక్కువ అంటున్నారు కాబట్టి వేసుకుంటాం కానీ వేసుకుంటే వచ్చే రిస్కు ఏమిటో స్పష్టంగా చెప్పాలి. వేసుకోగానే కొందరికి ఒకటి రెండు రోజులు జ్వరం వస్తే పెరాసిటమాల్ వేసుకోండి అని చెప్పినట్లే, వేసుకున్న నెల్లాళ్లకు ఫలానా లక్షణాలు కనబడితే, ఫలానా మందు వేసుకోండి అని చెప్పాలి కదా. పెయిన్ కిల్లర్ యిచ్చేటప్పుడు చెప్తారు, గాస్ట్రిక్ సమస్య వస్తే రాంటిడిన్ వేసుకోండి అని. అలాగే దీని గురించీ చెప్పాలి. కరోనా అనే దొంగ రాకుండా మనం యింట్లోనే తలుపులు బిడాయించుకుని కూర్చుంటున్నాం. అయినా దొంగ చొరబడితే మన చేతిలో వున్న ఆయుధం వున్న వాక్సిన్. అది కత్తో, కర్రో, దానివలన ఉపయోగం ఎంతో, దానితో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో మనం తెలుసుకోవాలి కదా! అది ఎవరూ చెప్పటం లేదు. ఎంతసేపు వాక్సిన్ వేయించుకోండి అంటున్నారు తప్ప సందేహాలు తీర్చటం లేదు.
వేయించుకో, వేయించుకో అంటున్న డాక్టరు స్వయంగా వాక్సిన్ వేయించుకున్న డాక్టరో, కాదో తెలియదు. మన కంటె, రాజకీయ నాయకుల కంటె వాక్సిన్‌ల గురించి బాగా తెలిసినది డాక్టర్లే. వాళ్లలో చాలామంది వేయించుకోలేదు. ఆంధ్రజ్యోతి మార్చి 31 ప్రకారం ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 58% వాక్సిన్‌కు విముఖం. మొదటి డోసు వేయించుకున్నవాళ్లలో 57% మంది రెండో డోసు వేయించుకోలేదు. ఏప్రిల్ 9 నాటి సాక్షిలో తెలంగాణ వైద్యులలో ఎంతమంది వేయించుకున్నారో, ఎంతమంది సెకండ్ డోస్ వేయించుకోలేదో అంకెలు యిచ్చారు. దానితోటే సందేహాలు మొలుచుకు వస్తున్నాయి. కోవిషీల్డు మీ ఫిజీషియన్‌తో చర్చించి మరీ టీకా వేయించుకో అని చెప్పేసింది. కోవాక్సిన్ కూడా బ్లడ్ థిన్నర్ వాడేవాళ్లు డాక్టర్లకు చెప్పి మరీ వేసుకోండి అంది.
కానీ టీకా సెంటర్‌కు వెళ్లి చర్చించేవాళ్లెవరు? స్లాట్ దొరికిందా, పొడిపించుకున్నామా? దేవుడి దయ వలన సెకండ్ డోసు కూడా పడిపోతే అంతే చాలు అనే మన ఆరాటం. ఎందుకంటే వాక్సిన్ల కొరత మనల్ని భయపెడుతోంది. ఆ కొరత ఎందుకు వచ్చింది అనేది తర్వాతి వ్యాసంలో చర్చిద్దాం. వాక్సిన్‌ల పరిమితుల గురించి రాయగానే యిదేదో మోదీ గారిని అనేసినట్లు పిసుక్కోనక్కరలేదు. ఇది ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఇది క్రమేపీ పరిణమిస్తుంది. ఆకాశం నుంచి ఊడిపడదు. దీనికి పరిమితులుంటాయి, అడుగడుగునా అవరోధాలు ఎదురవుతాయి, ప్రయోగాల ద్వారానే పరిమితులు తెలుసుకుంటూ వాటిని అధిగమిస్తూ రిసెర్చి ముందుకు సాగుతుంది. వాటిని దాచేస్తే సైన్సుకి అపకారం చేసినట్లే.
ఏ వాక్సిన్ లేదా మందుకైనా దాని సాంకేతిక ఘనతను దాన్ని డెవలప్ చేసిన శాస్త్రజ్ఞుల బృందానికే చెందుతుంది. ఆ కంపెనీ యజమాని కులానికో, ఆ సమయానికి రాష్ట్రాన్ని లేదా దేశాన్ని పాలిస్తున్న పాలకుడికో చెందదు. వాక్సిన్‌లకు కులం వుండదు. కమ్మ వాక్సిన్, కాపు వాక్సిన్, రెడ్డి వాక్సిన్, గుజరాతీ వాక్సిన్, పార్శీ వాక్సిన్, గోమాంసభక్షకుల వాక్సిన్ అనకూడదు. ఫైజర్ వాక్సిన్‌ను ట్రంప్ వాక్సిన్ అనకూడదు. ఆ రిసెర్చిని ఆ కంపెనీ పెట్టుబడి పెట్టి చేయించింది కాబట్టి, ఆ కంపెనీ పేరు మీదుగా చలామణీ అవుతుంది. కోవాక్సిన్ విషయంలో ఐవిఐ, ఐసిఎమ్‌ఆర్ కూడా పాలుపంచుకున్నాయి. అవి ప్రభుత్వ, అనగా ప్రజల సంస్థలు. అందువలన దాని గురించి ఏవైనా వ్యాఖ్యలు చేస్తే అది మనందరికీ వర్తిస్తుంది. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)