తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు వయసు మీద పడుతూ ఉండటంతో గతాన్ని మరుస్తున్నట్టుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి గత ఐదారేళ్లుగా చంద్రబాబు తీరు ఇలానే ఉంది.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అడ్డగోలు స్టేట్ మెంట్లు ఇచ్చి అడ్డంగా బుక్కయ్యారు చంద్రబాబు నాయుడు. సత్యానాదెళ్ల తండ్రి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన వద్దే పని చేశారని చెప్పుకుని చంద్రబాబు నవ్వుల పాలయ్యారు.
అంతకు ముందు ముఖ్యమంత్రుల మీటింగులో నరేంద్రమోడీని భుజానికెత్తుకునే క్రమంలో చంద్రబాబు నవ్వులపాలయ్యే స్టేట్ మెంట్ ఇచ్చారని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒకసారి చెప్పారు. సీఎం హోదాలో పని చేసి ప్రధాని అయిన ఏకైక వ్యక్తి మీరేనంటూ మోడీని కీర్తించారట ఆ సమావేశంలో చంద్రబాబు.
అయితే ఉమ్మడి ఏపీకి సీఎంగా చేసి, ఆ తర్వాత ప్రధాని పదవిని అధిష్టించిన పీవీ నరసింహారావుతో పాటు ఆ ఘనతను కలిగిన ఇతరుల గురించి తెలియకో, లేక మోడీని పొగిడేయాలన్న అత్యుత్సాహంతోనో చంద్రబాబు నాయుడు అలా వ్యవహరించినట్టుగా ఉన్నారు. చంద్రబాబు స్టేట్ మెంట్ విని తామంతా ఫక్కున నవ్వినట్టుగా కేసీఆర్ చెప్పారు.
ఆ సంగతలా ఉంటే.. తాజాగా చంద్రబాబు నాయుడు వీడియోల ద్వారా సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. జూమ్ వీడియోల రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణంరాజు తరఫున వకల్తాపుచ్చుకుని మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలో ఆయనపై రాజద్రోహం నేరం సెక్షన్లను ప్రయోగించడంపై చంద్రబాబు నాయుడు ఏదేదో చెప్పుకొచ్చారు! అలాంటి సెక్షన్ ఒకటి ఉంటుందని, వ్యక్తులపై దేశద్రోహం నేరాలను మోపొచ్చని తనకు తెలియనే తెలియదని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు!
ఇలా వీడియో స్టేట్ మెంట్ ఇచ్చారు చంద్రబాబు. ఆ వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్ట్ తీసింది. చంద్రబాబు సీఎంగా ఉన్న గత ఐదేళ్లలో ఎంతమంది పై దేశద్రోహం నేరం కేసులను పెట్టారో ఆ పార్టీ నేత సజ్జల వివరించారు.
ఓటుకు నోటు కేసులో దొరికిపోయాకా.. కేసీఆర్ పై తో సహా, నారా హమారా కార్యక్రమంలో నినాదాలు చేసిన ముస్లిం యువకులతో సహా.. అనేక మందిపై చంద్రబాబు ప్రభుత్వం దేశద్రోహం నేరాలను మోపిన వైనాన్ని సజ్జల వివరించారు!
ఇలా తను అధికారంలో ఉన్న సమయంలో తన ప్రభుత్వం తనకు నచ్చని అనేక మందిపై దేశద్రోహం నేరాలను మోపగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు జూమ్ మీటింగులో.. దేశద్రోహం కేసులను పెట్టొచ్చంటూ తనకు తెలియదని చెప్పుకురావడం.. ఇంతకీ ఆయనకు ఏమైంది? అనే సందేహాలను సహజంగానే కలిగిస్తుండటంలో ఆశ్చర్యం లేదు.