బిజెపి అధిష్టానం కర్ణాటకలో ముఖ్యమంత్రిని మారుస్తూ మంచి వ్యక్తినే ఎంచుకుంది. రాష్ట్రానికి 30వ ముఖ్యమంత్రిగా (ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల పదవీ ఆయుర్దాయం తక్కువ) వచ్చిన బసవరాజ్ బొమ్మయి మెకానికల్ ఇంజనీరింగు చదివారు. ఆయన తండ్రి కమ్యూనిస్టు-హ్యూమనిస్టు ఎమ్ఎన్ రాయ్ శిష్యుడు. జెఎచ్ పటేల్, దేవెగౌడ, రామకృష్ణ హెగ్డే వంటి సోషలిస్టులతో కలిసి జనతా పార్టీని ఏర్పరచినవారిలో ఒకడు. ముఖ్యమంత్రిగా చేశాడు.
ఇతను పారిశ్రామికవేత్త అవుదామనుకుని, 1996లో అప్పటి ముఖ్యమంత్రి జెఎచ్ పటేల్ దగ్గర రాజకీయ సెక్రటరీగా పనిచేశాడు. 1998, 2004లలో ఎమ్మెల్సీ అయ్యాడు. 2008లో బిజెపిలో చేరాడు. ఎన్నికలలో నెగ్గి ఇరిగేషన్ మంత్రి అయ్యాడు. గత రెండేళ్లగా హోం మంత్రిగా పరిపాలనా దక్షత చూపించాడు. మర్యాదస్తుడు. ప్రతిపక్షాల చేత కూడా మన్నింపబడేవాడు. కానీ అతనికి యడ్డీలాగ మాస్ ఫాలోయింగ్ లేదు, పైగా వక్త కూడా కాదు. లింగాయతే కానీ లింగాయత్ మఠాల్లో పలుకుబడి లేదు. ప్రస్తుతానికి యడ్డీ ఆశీస్సులున్నాయి. కానీ ఎంతకాలం యీ సఖ్యత సాగుతుందో గ్యారంటీ లేదు. తన ప్రాబల్యం తగ్గుతోందని అనుమానం వస్తే యడ్డీ ఏం చేస్తాడో తెలియదు.
యడ్డీని తప్పించాలని కేంద్ర బిజెపి గత ఏడాది నుంచి ఆలోచిస్తూ వచ్చింది. దిగమని చెప్పింది. 2021 ఫిబ్రవరిలో 78 ఏళ్లు నిండుతాయి. ఆ పుట్టినరోజు జరిగాక దిగుతా అన్నాడు. ఆ తర్వాత కూడా అదీయిదీ చెప్పి కొంతకాలం లాగించాడు. ఈలోగా ఆశావహులు ఎక్కువై పోయి అధిష్టానానికి తలనొప్పులు వచ్చాయి. యెడ్డీ అవినీతిపై, ఆశ్రితపక్షపాతంపై, అసమర్థతపై ఫిర్యాదులు పెరిగాయి.
చాలాకాలం బేరసారాలు సాగించి చివరకు రెండేళ్ల పాలనను పూర్తి చేయించి, యడ్డీని జులైలో దింపగలిగారు. చివరి నిమిషం వరకు లింగాయత్ స్వామీజీల ద్వారా అధిష్టానానికి హెచ్చరికలు పంపుతూనే వున్నాడు. దిగేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుని మరీ దిగాడు. దిగుతూ తన వారసుడెవరో తనే నిర్ణయించాడు. అధిష్టానానికి వేరు మార్గం లేకపోయింది. ఎందుకంటే కర్ణాటకలో బిజెపి, యడ్డీతో మమేకమై పోయింది. మొదటినుంచి రాష్ట్రంలో పార్టీ జండా మోసినదీ, విస్తరింపచేసినదీ అతనే. అందుకే బిజెపికి ముఖ్యమంత్రి పదవి అవకాశం రాగానే అతనికే యిచ్చారు.
అయితే అతను పదవిని దుర్వినియోగం చేశాడు. అవినీతికి పాల్పడ్డాడు. పార్టీకి అప్రతిష్ఠ తెచ్చాడు. అక్రమ మైనింగ్ కేసుల్లో యిరుక్కోవడంతో పార్టీ అతన్ని తప్పించి 2011 ఆగస్టులో అతని అనుచరుడు సదానంద గౌడను ముఖ్యమంత్రిగా చేసింది. అతను చాలా ప్రజోపయోగకరమైన పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటూ వుంటే యడ్డీ సహించలేక పోయాడు. అసమ్మతి ఎగదోశాడు. ఏడాది తిరక్కుండా అతన్ని తీసేసి జగదీశ్ షెట్టార్‌ను కూర్చోబెట్టవలసి వచ్చింది.
తన మాట చెల్లటం లేదని గ్రహించిన యడ్డీ 2012 నవంబరులో కర్ణాటక జాతీయ పక్ష (కెజెపి) పేరుతో వేరే పార్టీ పెట్టుకుని పార్టీని చీల్చాడు. 2013 ఎన్నికలలో బిజెపి, కెజెపి రెండూ నష్టపోయాయి. కాంగ్రెసుకు చెందిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాడు. బిజెపిలో మోదీ ప్రాభవం పెరిగాక తనకు ఆత్మీయుడైన యడ్డీని పార్టీలోకి తిరిగి ఆహ్వానించాడు. 2014 జనవరిలో యడ్డీ మళ్లీ బిజెపిలో చేరి అప్పణ్నుంచి ప్రముఖుడిగానే వెలుగుతున్నాడు.
2018 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి చాలినంత మెజారిటీ రాకపోతే, కాంగ్రెసు, జెడిఎస్‌ల నుండి 15 మంది ఫిరాయింపుదార్లను లాక్కుని వచ్చి 2019లో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసి బిజెపిని అధికారంలోకి తెచ్చాడు. అలా తెచ్చినవాళ్లకు పెద్దపీట వేయడంతో ముందునుంచీ వున్నవాళ్లకు మండింది. దానికి తోడు కాంగ్రెసు వంశపరిపాలనను విమర్శించే బిజెపి కర్ణాటక యూనిట్ అవే గొడవల్లో మునిగింది.
యడ్డీ పెద్దకొడుకు రాఘవేంద్ర ఎంపీగా వున్నాడు. 45 ఏళ్ల చిన్న కొడుకు విజయేంద్ర రాష్ట్ర యూనిట్లో ఉపాధ్యక్షుడిగా వున్నాడు. అతను యిప్పటికే పరిపాలనలో కలగజేసుకుంటూ, తండ్రికి చెడ్డపేరు తెస్తూ, అధికారం కోసం అర్రులు చాస్తున్నాడు. వీళ్లు కాక శిష్యురాలు శోభా కరంజాద్లే వుంది. ఇవన్నీ గొడవలకు దారి తీశాయి. తను దిగిపోయాక కూడా వాళ్లందరినీ బాగా చూసుకోవాలనే షరతులు పెట్టడంతో వారసుల ఎంపిక క్లిష్టమైంది. చివరకు శోభకు కేంద్ర కాబినెట్లో చోటిచ్చారు. రాష్ట్రానికి వచ్చేసరికే ఏం చేయాలో బోధపడలేదు.
కర్ణాటక జనాభాలో 14% మంది (వాళ్లు 17% అని చెప్పుకుంటారు)వున్న లింగాయతులు అక్కడి రాజకీయాల్లో ప్రధానమైన భూమిక వహిస్తూ వచ్చారు. వాళ్లు దశాబ్దాలుగా కాంగ్రెసుకి మద్దతు యిస్తూ వచ్చారు. అయితే 1990లో కాంగ్రెసు లింగాయతు అయిన వీరేంద్ర పాటిల్‌ను తొలగించి బిసి ఐన బంగారప్పని ముఖ్యమంత్రిని చేయడంతో ఆ వర్గం అలిగి, అప్పణ్నుంచి బిజెపివైపు మళ్లారు. ఆ విధంగా దక్షిణాదిన బిజెపికి కాలూనే చోటు దొరికింది. ఇక అక్కణ్నుంచి వాళ్లని దువ్వుతూ విస్తరించారు. యడ్డీ లింగాయతే. కులం బలంమీదనే పైకి వచ్చానని గ్రహించాడు కాబట్టి, ఆ కులంవాళ్లకు పెద్ద పీట వేస్తూ పోయాడు.
యడ్డీని తీసేస్తే ఖబర్దార్ అని వాళ్లు అనేవరకూ పోయింది వ్యవహారం. కానీ వాళ్లనే పట్టుకుని కూర్చుంటే తక్కిన కులాలు దూరమవుతాయనే భయం లేకపోలేదు బిజెపికి. రాజకీయాల్లో జనాభాలో లింగాయతుల కంటె 3% తక్కువ వుండి, వారితో రాజకీయాల్లో పోటే పడే వొక్కలిగలు జెడిఎస్‌తో వున్నారు. గతంలో యడ్డీ స్థానంలో తెచ్చిన సదానంద గౌడ వొక్కలిగ కులస్తుడే. కానీ అతన్ని ఎక్కువకాలం సీటులో వుండనీయలేదు యడ్డీ! ఈసారి వొక్కలిగలకు ఛాన్సివ్వాలా లేదా అని ఆలోచనలో పడింది బిజెపి అధిష్టానం.
యడ్డీ వారసులుగా పరిగణించిన యితరులు – ప్రహ్లాద్ జోషి, హెగ్డే కాగేరీ (బ్రాహ్మణులు), అరవింద్ బెల్లాడ్, మురుగేశ్ నీరాని, ఉమేష్ కట్టి (లింగాయతులు), అశ్వథ్థ నారాయణ, సిటి రవి (వొక్కళిగలు)! లింగాయతు ఐన బొమ్మయి యడ్డీ అనుచరుడే కానీ, యడ్డీ బిజెపి విడిచి వేరే పార్టీ పెట్టినపుడు అతని వెంట వెళ్లలేదు. బిజెపిలోనే వుండిపోయాడు. ఆ సంగతి అధిష్టానాన్ని మెప్పించిందేమో కానీ యడ్డీకి ఆ విషయంలో అసంతృప్తి వుండివుండవచ్చు. అతన్ని కాదంటే బెల్లాడ్ పేరు సూచించాల్సి వుంటుంది. 51 ఏళ్ల బెల్లాడ్ ఫ్రాన్సులో బిజినెస్ స్కూలులో చదివాడు. ఆరెస్సెస్ మద్దతు వున్నవాడు, పార్టీ యువతలో ఆకర్షణ ఉన్నవాడు.
అతనికే ఛాన్సు ఎక్కువ వుందనుకున్నారు కానీ, అతను ఒకసారి ముఖ్యమంత్రి అయితే తన కుమారుడు విజయేంద్రకు పోటీదారుగా ఎదుగుతాడని యడ్డీ భయం. అందువలన అతన్ని కాదని 61 ఏళ్ల బొమ్మయి పేరు సూచించాడు. దిల్లీకి అనేకసార్లు పర్యటించి పదవికోసం ప్రయత్నించిన బెల్లాడ్ తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించాడు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో గెలవాలంటే యడ్డీ మద్దతు అవసరమని గ్రహించిన అధిష్టానం చివరకు అతను చెప్పిన వ్యక్తికే పదవి యిచ్చింది.
యడ్డీ పరిపాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. 2021-22లో ఆర్థిక లోటు రూ.59,240 కోట్లుంది. రెవెన్యూ లోటు రూ.15 వేల కోట్లుంటుందని అంచనా. నాలుగు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్లకు చెందిన 1.10 లక్షల మంది ఉద్యోగులకు ఏప్రిల్-జూన్ నెలల జీతాలు బాకీ. వాటికే రూ.975 కోట్లు కావాలి. 69 ప్రభుత్వ ఆసుపత్రులలోని సీనియరు డాక్టర్లు, మెడికల్ స్టాఫ్‌కు 2020 సంవత్సరంలో నాలుగు నెలల పాటు బకాయి పెట్టి యీ జనవరిలో యివ్వగలిగారు. కరోనా నిర్వహణలో కూడా కర్ణాటకకు ఏమంత మంచి పేరు లేదు. ఇవన్నీ సంబాళించుకుంటూ, పాలన సాగించాల్సిన బాధ్యత బొమ్మయికి వుంది. అతను ఆరెస్సెస్ నుంచి వచ్చినవాడు కాదు, పైగా హిందూత్వవాది కాదు. లింగాయత్ ఐడెంటిటీ పెద్దగా చూపించుకున్నవాడూ కాదు. యడ్డీకి ఏ విధంగానైనా అసంతృప్తి కలిగితే, యివి ఎత్తిచూపించి అల్లరి పెట్టే ప్రమాదం వుంది.
ఈ భయం బొమ్మయికే కాదు, అధిష్టానానికీ వుంది. అందుకే కాబినెట్ కూర్పుపై చాలా కసరత్తే చేశారు. చివరకు 29 మందితో ఏర్పరచారు. యడ్డీ కొడుకు విజయేంద్రకు ఉపముఖ్యమంత్రి పదవి యిస్తారనుకున్నారు కానీ మంత్రి పదవి కూడా యివ్వలేదు. యడ్డీ ఉన్నపుడు ముగ్గురు ఉపముఖ్యమంత్రులుంటే యీసారి ఎవరూ లేరు. ఎవరికైనా యిస్తే తక్కినవాళ్లకు కోపాలు వస్తాయని దడిశారు కాబోలు. యడ్డీ కాబినెట్‌లోని 23 మందికి మళ్లీ చోటిస్తూ 6గుర్ని కొత్తగా చేర్చుకున్నారు. కాబినెట్లో 8మంది లింగాయతులు, 7గురు వొక్కలిగలు వున్నారు. (జనాభాలో 25% ఉన్న యీ రెండు కులాలకు కాబినెట్లో 50% పదవులు దక్కాయన్నమాట) ముఖ్యమంత్రి సమర్థుడే అయినా యడ్డీ విన్యాసాలపై యీ కాబినెట్ పనితీరు ఆధారపడుతుంది. అది 2023 అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావాన్ని చూపుతుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2021)