టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కామెడీ ఓ రేంజ్లో ఉందని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. ఎన్టీఆర్ను గద్దె దింపడంలో చంద్రబాబుతో పాటు నాటి స్పీకర్ యనమల పాత్ర కూడా కీలకమని తెలుసు. అలాంటి యనమల రామకృష్ణుడు …ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చూసి మోసం అనే పదం పుట్టిందని ఎద్దేవా చేయడం ఆయనకే చెల్లిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
యనమల రామకృష్ణుడు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ నాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా స్వాగతించిన జగన్… నేడు అదే అసెంబ్లీ సాక్షిగా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇది జగన్ రెడ్డి మోసానికి, దివాళాకోరుతనానికి నిదర్శన మని తీవ్రస్థాయిలో విమర్శించారు. మోసం అనే పదం జగన్ రెడ్డిని చూసే పుట్టిందేమో అనిపిస్తోందన్నారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఆంక్షలా? అంటూ మండిపడ్డారు. వైసీపీ పాలనలో పౌరహక్కులు, స్వేచ్చ కేవలం రాజ్యాంగంలోని పేపర్లలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి తన అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని యనమల విరుచుకుపడ్డారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాక, నామినేటెడ్ పోస్టులే సుఖమని యనమల ఓ నిర్ణయానికి వచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇక తనకు ప్రజలతో పనిలేదని, కేవలం మీడియాతో మాట్లాడుతూ నిత్యం వార్తల్లో వ్యక్తిగా యనమల నిలుస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తన దంత వైద్యానికి అక్షరాలా మూడు లక్షల రూపాయల ప్రజల సొమ్మును అప్పనంగా ఖర్చు చేసిన ఘనుడు కూడా రాష్ట్రం గురించి మాట్లాడ్డం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేస్తున్నారు.
ఆర్థిక మంత్రిగా తమ పాలనలోనే రాష్ట్రం దివాళా తీసిందని నెటిజన్లు గుర్తు చేస్తుండడం గమనార్హం. పౌరహక్కులు, స్వేచ్ఛ గురించి సూక్తులు చెబుతున్న యనమలకు బషీర్బాగ్ కాల్పులను నెటిజన్లు గుర్తు చేస్తుండడం విశేషం. ఇకనైనా నటనకు స్వస్తి పలకాలని యనమలకు నెటిజన్లు సూచిస్తున్నారు.