వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేయన‌ని బాండ్ రాయిస్తా!

తెలంగాణ కాంగ్రెస్ నేత‌లైన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఎప్పుడెట్లా మాట్లాడుతారో వాళ్ల‌కే తెలియ‌దు. ఒక‌రోజు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిని తిడ‌తారు. మ‌ళ్లీ వాళ్లే రేవంత్‌తో త‌మ‌కెలాంటి విభేదాలు లేవ‌ని చెబుతారు. దీంతో ప్ర‌జ‌ల్లో తాము చుల‌క‌న…

తెలంగాణ కాంగ్రెస్ నేత‌లైన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఎప్పుడెట్లా మాట్లాడుతారో వాళ్ల‌కే తెలియ‌దు. ఒక‌రోజు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిని తిడ‌తారు. మ‌ళ్లీ వాళ్లే రేవంత్‌తో త‌మ‌కెలాంటి విభేదాలు లేవ‌ని చెబుతారు. దీంతో ప్ర‌జ‌ల్లో తాము చుల‌క‌న అవుతామ‌నే ఆలోచ‌న వారిలో వ‌చ్చిన‌ట్టు లేదు. ఇదిలా ఉండ‌గా రేవంత్‌తో సంబంధాల‌తో పాటు మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న కూడా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్, ఎంపీ వెంక‌ట‌రెడ్డి చేశారు.

చౌట‌ప్ప‌ల్ రాజీవ్‌భ‌వ‌న్‌లో ఆదివారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కలిసి పని చేద్దామని రేవంత్‌తో చెప్పినట్లు ఆయ‌న వెల్లడించారు. 

సీఎం కేసీఆర్‌ది అరాచక పాలన అని ఎద్దేవా చేశారు. హిట్లర్‌ బతికి ఉంటే కేసీఆర్‌ను చూసి విలపించే వారని వెట‌క‌రించారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చినట్లు కోమటిరెడ్డి చెప్పారు. సుమారు రూ. 3,400 కోట్లు మంజూరు చేయించినట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు.

భువనగిరి పార్లమెంట్ స్థానంలో రోడ్లు, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయమని, కావాలంటే బాండ్ రాసి ఇస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. 

టీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్టర్లకు రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. దీంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ స్థానం లో ఉంటూ తాను రెండేళ్ల నుంచి అపాయింట్‌మెంట్ అడిగితే ఇంత వరకు దిక్కేలేదని ఆయన ఆవేద‌న వ్య‌క్తం చేశారు.