Advertisement

Advertisement


Home > Movies - Interviews

ఎవడి లైఫ్ స్టయిల్ కు వాడే హీరో-హరీష్ శంకర్

ఎవడి లైఫ్ స్టయిల్ కు వాడే హీరో-హరీష్ శంకర్

ఇది లాక్ డౌన్ టైమ్...కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి. సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కొత్త అయిడియాలకు పదును పెడుతున్నారు. కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకుంటున్నారు. అలాంటి దర్శకులను పలకరిస్తే..

హరీష్ శంకర్.. హరి హరులను ఇద్దరినీ పేరులో పెట్టేసుకున్న ఆ పేరులోనే మాస్ వుంది. ఆయన సినిమాలే కాదు ఆయన కూడా మాస్ నే. సమాధానాలకు తడుముకోరు, డీ కొట్టడానికి వెనుకాడరు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా వుంటారు. ఎలా వుంటుందో? ఎలా తీస్తారో అనుకునే వారికి సక్సెస్ తోనే సమాధానం చెబుతారు.అలాంటి హరీష్ శంకర్ ను కరోనా వేళ పలకరిస్తే ఎలా వుంటుంది?

-సర్ నమస్తే..బిజీనా?

లేదండీ..ఫోన్ పక్కన పెట్టి, పుస్తకాలు చదువుతున్నా

-సినిమాలు వెబ్ సిరీస్ లు చూస్తున్నా అని కాకుండా పుస్తకాలు చదువుతున్నా అన్నారు..సూపర్

లేదు నేను ఎప్పుడూ చదువుతాను. 

-ఇప్పుడేం చదువుతున్నారు

ఇకిగై (ikagai) అని జపాన్ లోని ఓ ఊళ్లో వుండే వృద్దుల జీవన విధానం గురించి. వాళ్లంతా వందేళ్లు దాటిన వారే. ఇరవై మంది వరకు వుంటారు. వాళ్ల ఆరోగ్యకర జీవన విధానం గురించి. 

-మన సంస్కృతి, మన ప్రాచీన జీవన విధానానికి దగ్గరగా వుందా? 

అవును. చాలా విధాలుగా. వారెవ్వరూ నాన్ వెజ్ తినరు. అలాగే పాలో రాసిన ఎలివెన్ మినిట్స్ బుక్ చదువుతున్నాను.

-తెలుగు సాహిత్యం టచ్ చేయరా?

చాలా వరకు చదివేసాను. కొత్తగా పెద్దగా చదవడం లేదు. భాస్కరభట్ల పరిచయం చేసిన కొందరు రచయితల హైకూలు చదువుతున్నాను. నేను కూడా అప్పుడప్పుడు హైకూలు రాస్తున్నా. హరీష్ హైకూస్ అంటూ నా ఫేస్ బుక్ పేజీలో, హలోయాప్ లో.

-ట్విట్టర్ సంగతి?

ట్విట్టర్ అన్నది పూర్తిగా సామాజిక సేవ, సామాజిక స్పహ.

-ట్విట్టర్ లో ఎందుకు మీరు కాంట్రావర్సీకి అవకాశం ఇస్తుంటారు? లైక్ లు కొట్టడాలు, రీట్వీట్ లు కొట్టడాల్లో?

ఏమండీ...గాంధీ మహాత్ముడు నచ్చనివాడే పుట్టిన దేశం ఇది. మనమెంత. అందరికీ నచ్చాలంటే ఎలా సాధ్యం అవుతుంది? 

-మీ ఐడియాలజీ ఏమిటి? ప్రో భాజపానా?  లేదా ప్రో హిందూత్వనా?

అదేమీ లేదే..అసలు నా దృష్టిలో హిందూత్వ అన్నది మతం కాదు ఓ జీవన విధానం. రోజా అనేది పాటించడం చాలా హెల్దీ అని అంటాను. మతం అన్నది  చూడకూడదు. అందులో వున్న మంచిని చూడాలి. నా ట్వీట్ లు అన్ని రకాలుగా వుంటాయి. చంద్రబాబు, జగన్, కేసిఆర్ ఆఖరికి మమతా బెనర్జీ ఇలా ఎవరు చేసిన పని నచ్చినా, ఎవరి ట్వీట్ నచ్చినా లైక్ చేయడమో, కామెంట్ చేయడమో చేస్తాను.ఇక్కడ పార్టీ బేధాలేమీ లేవు. దిశ విషయంలో జగన్ ను  లైక్ చేసా. మహా అయితే నా అభిప్రాయాలు చెబుతాను అంతే. 

-ఏమైనా హరీష్ శంకర్ చాలా స్పీడు అంటే ఏమంటారు?

మీరు అంటే నేనేం అంటాను. మీరు జడ్జ్ మెంట్ పాస్ చేసారు నేను స్పీడు అని. ఇక నేను ఏం చెబుతాను.

-నేను పాస్ చేయడం కాదు, ఇండస్ట్రీలో వినిపించే మాట చెబుతున్నాను.

అలా అంటున్నారా? అది పాజిటివ్ కాంప్లిమెంట్ అనుకుంటే నేను హ్యాపీగా తీసుకుంటాను. నెగిటివ్ అనుకుంటే పట్టించుకోను.

-చదవడం సరే, చూడడం సంగతేమిటి?

వెబ్ సిరీస్ లు, సినిమాలు దాదాపు అన్నీ చూసేసాను. చదవడాన్నే ఇష్టపడతాను. చూస్తే నేను బాగా ప్రభావితం అయిపోతాను.  నచ్చేసిందంటే రీ మేక్ చేసేయాలనుకుంటాను. నచ్చితే చాలు వెంటనే డెసిషన్ తీసేస్తుంటాను. అందుకే తక్కువ చూసి, ఎక్కువ చదవాలనుకుంటాను.

-ఏదైనా సరే మీద ఇమ్మీడియట్ రియాక్షన్ అనుకుంటా. భావ వ్యక్తీకరణలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.

ఆ ...అంతే. అలా అయితేనే జెన్యూన్ గా వుంటుందని నా ఫీలింగ్.

-జెన్యూన్ నే కానీ విమర్శలు వుంటాయి కదా?

నేను ఇండస్ట్రీలోకి వెళ్తానంటే వద్దన్నవాళ్లు, విమర్శించిన వాళ్లు వున్నారు. ఇందాకే చెప్పాను కదా? గాంధీ మహాత్ముడినే వద్దనుకున్నవాళ్లు పుట్టిన దేశం ఇది. ఇక మనమెంత? ఎవరి లైఫ్ స్టయిల్ కు వాడే హీరో, వాడిదే కథ, మాటలు, స్క్రీన్ ప్లే. ఆఖరికి క్లయిమాక్స్ కూడా వాడిదే. వాడే భరించాలి. 

-ఇదేదో బాగుంది..క్లయిమాక్స్ కూడా ఎవడిది వాడే రాసుకోవడం

అంతేగా. ఎవరి స్క్రీన్ ప్లే వాడిది అయినపుడు, ఎవడి క్లయిమాక్స్ వాడిదే కదా? బాధ్యులు మనమే అయినపుడు భరించాలి కదా?

-అవును ఏదో మాట్లాడేస్తున్నా. ఇంటర్వ్యూ అయిపోతోందా? ఏమిటి?

ఇంటర్వ్యూ అంటూ ఏముంది..సరదాగా మాట్లాడుకోవడమే నా అయిడియా.

-సరే, ఇవన్నీ సరే, మెగాస్టార్ తో సినిమా ఎప్పుడు?

అది నా లైఫ్ యాంబిషన్.

-పవర్ స్టార్ తో సినిమా అనుకుంటే, మెగాస్టార్ సినిమా లైన్ లోకి వచ్చింది?

పవర్ స్టార్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది. అలాగే మెగాస్టార్ సినిమా కూడా వుంటుంది. రౌడీ అల్లుడు లాంటి ఎంటర్ టైనర్ చేయాలని ప్రయత్నం. 

-అన్నదమ్ములు ఇద్దరితో సినిమాలు చేసే రికార్డు అన్నమాట

అలాగే చరణ్ తో కూడా చేసేస్తే మొత్తం మెగా హీరోలను కవర్ చేసిన సంతృప్తి వచ్చేస్తుంది.

-డిజె సినిమా కన్నా వాల్మీకి సినిమా హిట్ తరువాత జనాల అనుమానాలు చాలా వరకు తీరిపోయాయి అనుకోవాలి కదా?

ఏమో? గబ్బర్ సింగ్ సినిమా టైమ్ లో కూడా ఇలాగే అనుకున్నారు. ఏం చేస్తారు హిందీ సినిమాను తెలుగులో అని. చేసి చూపించాను. వాల్మీకి టైమ్ లో అలాగే అనుకున్నారు. చేసాను. మనం చూసే పెర్ సెప్షన్ వేరుగా వుంటుంది. దార్శనికత వున్నవాడే దర్శకుడు అన్నారు అందుకే.

-పంచ్ నా?

గ్రేట్ ఆంధ్ర అన్నాక ఆ మాత్రం పంచ్ లు కూడా వుండాలిగా. ఆ రేంజ్ లో వుండాలి కదా.

-ఈసారి పవర్ స్టార్ ను ఎలా చూపించబోతున్నారు.

ఎప్పుడు అయినా ఒకటే. ఓ అభిమానిలాగే చూస్తాను. ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ చూసేలా, రిపీట్ ఆడియన్స్ వుండేలా చూస్తాను. 

-కానీ సినిమా చాలా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

తప్పదు. అనుకోకుండా వచ్చిన సమస్య. వేచి వుండాల్సిందే.

-కరోనా టైమ్ లో అందరూ ఇళ్లు తుడవడం, గిన్నెలు తోమడం ఇలా విడియోలు పెడుతున్నారు. మీ దగ్గర నుంచి ఇంకా రాలేదు.

యాక్ట్యువల్ గా దేవీశ్రీప్రసాద్ నన్ను నామినేట్ చేసాడు. కానీ నిజం చెబుతున్నా, నేను పని చేసాను అంటే కేవలం విడియో కోసం చేయాలి. ఎందుకంటే ఇంట్లో పూచికపుల్ల పని నాకు చెప్పరు. నేను చేయను. తిన్న కంచం సింక్ లో పడేసే వరకే. నేను పని చేస్తే తనకి వర్క్ డబుల్ అవుతుంది వద్దు అంటుంది మా ఆవిడ. ఇప్పుడు పని చేస్తున్నట్లు విడియో పెడితే ఆవిడ క్రెడిట్ నేను కొట్టేసినట్లు లేదా రియల్ వుమెన్ అని విడియో పెట్టాలి. రియల్ మాన్ అని పెట్టలేను.

-మీరు సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు కదా..పూజలు, పురస్కారాలు?

ఖాళీ వుంటే చేస్తాను. ఇప్పుడు కరోనా టైమ్ కదా, సంధ్యావందనం చేస్తున్నాను. సినిమాలు వున్నపుడు జస్ట్ గాయత్రీ మంత్రం చదివేసుకుని వెళ్లిపోతాను.  ఇక నాన్ వెజ్ తినడం అన్నది ఒకటి రెండు సార్లు ట్రయ్ చేసాను. నాకు ఎందుకో నచ్చలేదు, వదిలేసాను. మా ఆవిడకు అలవాటు వుంది. తిండికీ, పుట్టుక, కులానికి సంబంధం లేదు నా దృష్టిలో. నేను అప్పుడప్పుడు అకేషనల్ గా ఆల్కహాల్ తీసుకుంటాను. మీరు రాసుకోవచ్చు. 

-ఇండస్ట్రీలో ఎక్కువసార్లు విన్నాను. హరీష్ శంకర్ నోటివెంట బూతులు ఎక్కువగా వస్తాయంటారు? నిజమేనా?

మీతో ఇంతసేపు మాట్లాడాను..ఒక్క బూతు మాట దొర్లిందా? యద్భావం తద్బవతి. హరీష్ శంకర్ బెడ్ రూమ్ లో ఎలా వుంటాడు అని అనుకుంటే ఎలా?

-బెడ్ రూమ్ లో అని కాదు. షూటింగ్ టైమ్ లో కాస్త విరివిగా బూతులు వాడుతూ మాట్లాడతారని విన్నాను.

లేదు. చాలా చాలా రేర్ గా ఒకటి రెండు సార్లు బూతులు బయటకు వస్తాయేమో కానీ నేను పెద్దగా ఇష్టపడను బూతులు మాట్లాడడానికి. 

-అంటే హరీష్ గురించి జనం చెప్పుకునేది వేరు. నిజం వేరు అనుకోవాలా?

మీతో ఎన్నోసార్లు మాట్లాడా? ఎప్పుడన్నా విన్నారా? బూతులతో సమాధానం చెప్పాలి అనే సిట్యువేషన్ వస్తే మాత్రం మొహమాటం లేదు. వాడతాను. ఎప్పుడన్నా, బూతులతో పని జరుగుతుంది అనుకున్నపుడు, పండిత భాష లాభంలేదు. వీడికి పామర భాషలోనే చెప్పాలి అనుకున్నపుడు వాడాలి...అయినా నా నోటి వెంట వచ్చే బూతుల గురించి ఇంతడ డిస్కషనా అండీ?

-మరి హరీష్ శంకర్ అంటే విభిన్నంగా వుండాలి కదా?

ఓకె..ఓకె..కానివ్వండి. ఇంకేంటి? మీరు ఏం విన్నారో అన్నది అలా వుంచితే, ఏం రాస్తారో అన్న టెన్షన్ మాత్రం లేకుండా వుండాలి.

-అలాగే..థాంక్యూ

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?