కావాలనే ప్రపంచానికి అప్పుడప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఇలాంటి రూమర్లు పుట్టేలా చేస్తూ ఉంటాడేమో! మామూలుగా అయితే అతడి గురించి చర్చించుకోవడానికి క్షిపణుల ప్రయోగం, నియంతృత్వం తప్ప మరేం ఉండదు. అయితే ఉన్నట్టుండి కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లడం, ఏదో జరిగిందనే అనుమానాలను రేపడం, ఆ తర్వాత తాపీగా తన పిక్చర్లు రిలీజ్ చేయడం.. కిమ్ నియంతృత్వ పాలనలో ఇదీ భాగం అయిపోయినట్టుగా ఉంది.
తన మరణించినట్టుగా వచ్చిన ఊహాగానాలకు తెర దించాడు నార్త్ కొరియన్ నియంత కిమ్ జాంగ్ ఉన్. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నాడంటూ నార్త్ కొరియన్ మీడియా ఫొటోలను విడుదల చేసింది. తద్వారా రూమర్లకు తెర దించింది.
కిమ్ కు శస్త్ర చికిత్స వికటించిందని, ఆయన మరణించారని, ఆయన స్థానంలో ఆయన సోదరి నార్త్ కొరియన్ పగ్గాలు చేపట్టవచ్చని కథనాలు, ఊహాగానాలు, విశ్లేషణలు వినిపించాయి. అయితే ఇప్పుడు వాటి అవసరం లేకుండా కిమ్ బతికే ఉన్నాడని నార్త్ కొరియన్ మీడియా ప్రకటించేసింది. కిమ్ మరణించాడనే వార్తలను అమెరికన్ మీడియా హైలెట్ చేయగా, అలాంటిదేమీఉండకపోవచ్చన్నట్టుగా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇక కిమ్ బతికే ఉన్నాడని ముందుగా కుండబద్ధలు కొట్టింది సౌత్ కొరియన్ మీడియా. తమ పక్కనే ఉన్న నియంతృత్వ దేశంలో సౌత్ కొరియాకు గూఢచార్య వ్యవస్థ ఉన్నట్టే ఉంది!