మే 3 తర్వాత లాక్ డౌన్ నుంచి పాక్షిక సడలింపులను ప్రకటించింది కేంద్ర హోం శాఖ. మే 1న ఈ ప్రకటన రాగా.. ఇదే రోజు దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావడం గమనార్హం. ఎంతలా అంటే.. ఇంత వరకూ ఎన్నడూ నమోదు కాని రీతిలో ఒక్క రోజులోనే ఏకంగా రెండు వేలకు పైగా కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి.
మే ఒకటో తేదీన ఏకంగా 2,333 కొత్త కేసులు రిజిస్టర్ అయినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇంత వరకూ ఎప్పుడూ ఇండియాలో ఒకే రోజు రెండు వేల పై స్థాయి కేసులు నమోదు కాలేదు. గురువారం కూడా 1800 స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అయితే శుక్రవారం ఏకంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడం గమనార్హం.
అయితే పెరిగిన కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే. ఆ ఒక్క రాష్ట్రంలోనే ఏకంగా 1000 పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 1003 కేసులు నమోదు కాగా, వాటిల్లో 741 కేసులు ముంబైలోనే. గుజరాత్ – 326, ఢిల్లీ -223, తమిళనాడు- 203 కేసులు నమోదయ్యాయి.
కరోనా ప్రభావం ఇప్పటికే కాస్త ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో శుక్రవారం ఇలా ఎక్కువ సంఖ్యలోనే కేసులు రిజస్టర్ అయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 37,200 కు చేరిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.