Advertisement

Advertisement


Home > Movies - Interviews

ఈ ఏడాది ఎలాగైనా పెళ్లి చేసుకోవాల్సిందే-సాయితేజ్

ఈ ఏడాది ఎలాగైనా పెళ్లి చేసుకోవాల్సిందే-సాయితేజ్

ఇది లాక్ డౌన్ టైమ్...కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ సినిమా జనాలకు కాస్త ఆటవిడుపు. ఉరకలు, పరుగుల జీవితం నుంచి కాస్త పక్కకు జరిగి, రిలాక్స్ కావడానికి వీలున్న సమయం. కానీ కరోనా లాక్ డౌన్ పెరుగుతూనే వుంది. రిలాక్స్ కాస్తా బోర్ డమ్ గా మారుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఎవరేం చేస్తున్నారు అన్నది తెలుసుకుంటే..

మెగా మేనల్లుడిగా సినిమా రంగంలోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా హైవే మీదకు వచ్చిన చిన్నపిల్లాడిలా కిందా మీదా అయిపోయాడు. సక్సెస్ లు, ఫెయిల్యూర్ లు చకచకా చూసేసాడు. అంతా గజిబిజి. మెల్లగా అలవాటు పడ్డాడు. కెరీర్ ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే తరువాత సోలో బతుకే సో బెటర్ అంటున్నాడు సాయి తేజ్. కరోనా టైమ్ లో సోలోగా వున్నారా? అమ్మ, తమ్ముళ్లతో హ్యాపీగా వున్నారా? ఓసారి హాయ్ చెబుదాం.

-నమస్కారం సార్

హాయ్ మూర్తిగారూ..ఎలా వున్నారు?

-అది అడుగుదామనే ఈ చిట్ చాట్. అయినా కరోనా టైమ్ కదా..మీరయినా, మేమయినా లాక్ డౌనే.

అవును, ఏదైనా చేయాలనే మూడు, ఉత్సాహం అన్నీ పోతున్నాయి. ఆల్ మోస్ట్ నెలన్నర అయిపోతోంది. ఇంట్లోనే వర్కవుట్ ఇంట్లోనే వంట. మధ్యలో ఒక్కసారి మా నాయనమ్మ కు వంట్లో బాగాలేదు అంటే వెళ్లి చూసి వచ్చా. ఇంకెక్కడికి వెళ్లలేదు.

-ఇంట్లోనే వంట అంటున్నారు. చేయి చేసుకుంటున్నారా ఏంటీ?

అంతలేదు..జస్ట్ మమ్మీకి హెల్ప్. అంతే. నాకు అర్థం అయిందేమిటంటే, ఎవరికి కరోనా టైమ్ అయినా, ఎవరికి సెలవులు అయినా హోమ్ మేకర్స్,. మమ్మీలకు సెలవులు వుండవు. వాళ్లకి ఎప్పుడూ కరోనానే. లాక్ డౌన్ నే. అందుకే జస్ట్ క్లీనింగ్ ద హవుస్. నేను, తమ్ముడు కలిసి ఇంటి క్లీనింగ్ లాంటివి చూసుకుంటూ వుంటాం.

-అన్నీ బాగుండి వుంటే ఈపాటికి మీ తమ్ముడి సినిమా థియేటర్లోకి వచ్చేయడం, మీ ఇంట్లో సెలబ్రేషన్స్ వుండి వుండేవేమో?

ఏమో? ఇంకా మంచి సెలబ్రేషన్స్, మంచి హ్యాపెనింగ్స్ రాసిపెట్టి వున్నాయోమో? లెటజ్ హోప్ ఫర్ ది బెటర్.

-చాలా మంచి బజ్ వచ్చిన టైమ్ లో విడుదల ఆగిపోవడం.

అవునండీ. ఆ సాంగ్ పెద్ద హిట్ కావడం, హీరో బాగున్నాడు అన్న టాక్. హీరోయిన్ కు కూడా మంచి పేరు రావడం.

-మీ ఇంట్లోనే మీకో పోటీ తయారుకావడం

అదేం లేదండీ. ఒక కొమ్మకు ఎన్నో పూవులు పూస్తుంటాయి. అన్నీ బాగుంటాయి. ఇండస్ట్రీలోనే ఎవరకి ఎవరు కాంపిటీషన్ కాదని నమ్ముతాను. 

-కరెక్ట్ నే. కానీ ఓ మంచి కథ మీ గుమ్మంలోకి వస్తే, తమ్ముడికా, మీకా? ఇద్దరూ యంగస్టర్స్ నే. దాదాపు యూత్ కు నప్పేకథలు అన్నీ ఇద్దరికీ నప్పుతాయి.. అలాంటపుడు ఎలా ఫీలవుతారు?

అలాంటి టైమ్ నే వస్తే మా తమ్ముడికి మంచి సబ్జెక్ట్ దొరికింది. మంచి సినిమా చేసాడు అని హ్యాపీగా ఫీల్ అవుతా. ఎవరి హార్డ్ వర్క్ కు ఎవరి పే ఆఫ్ వాళ్లకు వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతా నేను. నేను మొదటి నుంచి ఒకటి నమ్ముతాను. ఎవ్వరికీ కథను సెలక్ట్ చేసుకునే ఛాయిస్ వుండదు. కథే హీరోను ఎంచుకుంటుంది. తనకు ఎవరు నప్పుతారా? అని. ఇది నేను గట్టిగా నమ్ముతాను. అందుకే తిరిగి తిరిగి ఒక్కో కథ ఒక్కో హీరో దగ్గర సెటిల్ అవుతుంది. పిల్లా నువ్వులేని జీవితం చాలా మంది దగ్గరకు వెళ్లి ఆఖరికి నా దగ్గరకు వచ్చింది.

-మీ దగ్గరకు కూడా చాలా కథలు వచ్చి వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి వుంటాయి కదా?

డెఫినిట్లీ. అలా వెళ్లి  హిట్ అయినవీ వున్నారు. అప్పుడు కూడా నా నమ్మకం ఇదే. వాళ్లకు సూటయ్యే కథ. అందుకే హిట్ అయింది అని.

-వరుసగా రెండు హిట్ లు వచ్చాక, ఎంచుకోవాల్సిన సబ్జెక్ట్ ల మీద ఓ అంచనా వచ్చిందా?

అంత సులువుగా వచ్చేయదు. వస్తున్న కథలు, చేస్తున్న సినిమాలు ఇవన్నీ లెక్క వేసుకుని నేర్చుకుంటూనే వుండాలి.  అదే జరుగుతోంది.

-చిత్రలహరి, ప్రతిరోజూ పండగే, సోలోబతుకే తరువాత దేవాకట్టా సినిమాతో ట్రాక్ మారుస్తున్నట్లున్నారు.

ట్రాక్ మార్చడం అన్నది కాదు. యాక్టర్ గా నేను చేయాలి లేదా నేర్చుకోవాలి అనుకునే మూవ్ మెంట్స్ కొన్ని వుంటాయి కదా? అలాంటి ప్రయత్నం. దేవాకట్టా లాంటి వాళ్ల దగ్గర చేస్తే అదో డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ గా వుంటుంది కదా?

-ప్రతి రోజూ పండగే సినిమా కోసం గట్టిగానే కష్టపడి, సిక్స్ ప్యాక్ సాధించారు. మరి ఈ కరోనా టైమ్ లో ఇంట్లో వుండిపోయి, ఆ ఫిజిక్ ను అలా మెయింటెయిన్ చేయడం సాధ్యమేనా?

హోమ్ వర్కవుట్ చేస్తున్నా. మా ట్రయినర్ నాకు హోమ్ వర్కవుట్ లు అన్నీ విడియోలు పంపేసారు. నేను తమ్ముడు కలిసి అవన్నీ చేస్తున్నాం. హెల్పింగ్ ఈచ్ అదర్. నిజానికి తక్కువ స్పేస్ అనుకోండి. కానీ ఇద్దరం కలిసి అనుకుని, షేర్ చేసుకుని చేసుకుంటున్నాం.

-అంటే ఇంట్లో జిమ్ ఏర్పాటు చేసుకున్నారా?

లేదండీ..బాడీ వెయిట్స్, హై ఇంటెన్సిటీ వర్కవుట్స్ చేసుకుంటున్నాం. మాకు రోజులో టైమ్ గడిచేది ఎక్కువగా ఇలానే.

-మీ సినిమా సోలో బతుకే కూడా మొన్న (మే 1) విడుదల కావాల్సివుంది కదా?

అవును. అన్నీ బాగుండి వుంటే, విడుదల కావడం, గ్రేట్ ఆంధ్ర రివ్వ్యూ కోసం ఎదురుచూడడం సర్లెండి..మరో మంచి టైమ్ మన కోసం ఫిక్స్ చేసి వుందేమో?

-మీ స్కూల్ డేస్ తరువాత లేదా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఇన్ని రోజులు ఇంట్లోనే వుండడం ఇదేనా?

అవును.ఎగ్జాట్లీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు లేవడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడం, అస్సలు టెన్షన్ అన్నది లేకుండా వుండడం, ఇది చేయాలి. అది పెండింగ్ అన్న ఫీలింగ్ లేకుండా వుండడం. రేపేం జరుగుతుంది అన్న ఆలోచనే లేకుండా, ప్రశాంతంగా వుండడం ఇదే. నో ప్రీ ప్లానింగ్. 

-ఈ టైమ్ లో కథలు వినడం అలాంటి కార్యక్రమాలు.

కథలు వింటే ఇన్ పర్సన్ వినాలి. స్కైప్, లు, ఫోన్ లు వేస్ట్. అదీ కాక కథలు వినాలంటే నేను ఆఫీస్ కు వెళ్లాలి. ఇక అప్పుడు మా అమ్మ టెన్షన్ మామూలుగా వుండదు.  అవసరంమా ఇదంతా అని హ్యాపీగా ఇంట్లో వుండి వర్కవుట్ లు చేసుకుంటూ, బుక్స్ చదువుకుంటూ గడిపేయడమే.

-పుస్తకాలు చదువుతారా? ఫిక్షన్? నాన్ ఫిక్షన్?

ఎక్కువగా. చాలా వరకు ఫిక్షన్..లవ్, ఎడ్వంచర్, ట్రెజర్ హంట్ ఇలా చాలా. పుస్తకాలు చదివితే వచ్చే ఫీల్ వేరు. డిజిటల్ గా కూడా చదవను. నాది ఈ విషయంలో ఓల్డ్ స్కూల్. చేతితో పుస్తకం పట్టుకుని చదవాల్సిందే. చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. 

-మీ మామయ్య పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా చదవుతారనుకుంటా

-అవును. అసలు ఆయన ఇచ్చిన లార్డ్ ఆఫ్ ది రింగ్స్ పుస్తకంతోనే నేను ఎక్కువగా చదవడం అలవాటు చేసుకున్నా. 

-ఈ మధ్య మామయ్యతో మాట్లాడారా? సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు కదా?

మొన్న ఫోన్ లో మాట్లాడా? ఎలా వున్నావ్..ఏం చేస్తున్నావ్ అన్నారు.

-ఆయనకు లాక్ డౌన్ అంటే హ్యాపీ యేమో? పుస్తకాలు, ఆవులు, ఫామ్ హవుస్ ఇలా గడిపేస్తారేమో?

అవును. ఫోన్ చేయగానే ఆయన కూడా అడిగారు..కొత్తగా ఏం చదివావ్ అంటూ. చెప్పాను వివరంగా.

-ఆయన ఏమీ సజెస్ట్ చేయలేదా?

ఎక్కువగా చేయరు. మన ఛాయిస్ కు వదులుతారు. ఎప్పుడన్నా చెబుతుంటారు అది చదవు అంటూ.

-అయినా ఆయనా మీరు ఫిక్షన్ చదువతారు. ఆయన అంతా సిద్దాంతాలు, ఇతరత్రా వ్యవహారాలు ఏమో కదా?

నేను అనుకోవడం ఆయన కూడా ఫిక్షన్ అన్నీ చదివేసి వుంటారని. ఆయన నాలెడ్జ్.. ఆయన థింకింగ్ చాలా హై గా వుంటుంది.

-ఇంకేటి? సినిమాలు, వెబ్ సిరీస్ లు?

నెట్ ఫ్లిక్స్ లో డార్క్ అని ఓ వెబ్ సిరీస్ చూసాను, చాలా బాగుంది. అలాగే చాలా చూసాను..హర్రర్ సినిమాలు మినహా.

-హర్రర్ సినిమాలు అంటే భయమా? ఏంటి?

చాలా భయం. పొరపాటున కూడా చూడను. అయిదేళ్ల క్రితం అనుకుంటే ప్రెండ్స్ హర్రర్ సినిమా అని చెప్పకుండా ఓ సినిమాకు తీసుకెళ్లిపోయారు. ఆ వేళ థియేటర్ లో నా హడావుడి చూసి, మరెప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు.

-ప్రెండ్స్ కు థియేటర్ లో మీరు హర్రర్  సినిమా చూపించేసారన్నమాట.

అదే. నేను అరిచిన అరుపులకు. ఇంక చాలు బాబూ అనేసారు.  ఇప్పటికీ నేను ఆ తరహా సినిమాల జోలికి వెళ్లను. మిగిలినవి అన్నీ చూస్తాను.

-వరల్డ్ సినిమా, ఆ స్టాండర్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది.

మన దగ్గర కూడా స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. ఇంకా పెరగాలి. మనం కూడా ఇప్పుడిప్పుడే మారుతున్నాం. కొత్తతరహా సినిమాలు, కొత్త కథలు వస్తున్నాయిు. డైరక్టర్లు, రచయితలు కొత్త విజన్ తో వస్తున్నాయి. 

-మీ రాబోతున్న సోలో బతుకే ఎలా వుండబోతోంది?

అందరికీ నచ్చుతుంది. యూత్ కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా ఇంట్లో తల్లులకు కూడా. సోలో బతుకే అంటే అమ్మలు ఒప్పుకోరుగా.

-సోలో బతుకే సో బెటరు అంటే మీ విషయంలో కూడా మీ అమ్మగారు ఒప్పుకోరుగా.

అవును. ఇప్పటికే తెగ గొడవ పెడుతున్నారు పెళ్లి చేసుకోమని. ముఫై మూడు వచ్చేసాయి కదా. త్వరగా చేసుకో అంటూ. నేను అయితే అమ్మా, ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది అంటున్నాను. 

-అమ్మాయిని వెదకాలి కదా

ఏమో? నేనైతే, జరగాల్సిన టైమ్ లో జరుగుతుంది. రావాల్సి వున్నవాళ్లు వస్తారు. దానికోసం టైమ్ కేటాయించడం కన్నా, వర్క్  మీద దృష్టి పెట్టేయడం బెటర్ అనుకుంటాను నేను. 

-మీ మెగా హీరోలు ఇద్దరిది లవ్ మ్యారేజ్ నే కదా..మీరూ

ఏమో?  అదృష్టం కలిసి వచ్చి, ఈ ఏడాది నేను కూడా ఏమైనా లవ్ లో పడితే..

-ఆ దిశగా ఆలోచనలు, ప్రయత్నాలు వున్నాయా?

వుండాలి కదా? యూత్ కదా..ఆ మాత్రం సరదా వుంటుంది కదా? అయినా ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే. ఇంట్లో వాళ్లు ఏమీ కాదనరు. అందువల్ల ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తూ, మన ట్రయిల్ మనం చేయాలి కదా? కాదని పారిపోవడం కష్టం. పారిపోదామనుకున్నా, ఇంట్లో వాళ్లు గుర్తు చేస్తూనే వుంటారు. 

-సో మొత్తానికి కరోనా తరువాత కళ్యాణం గురించి ఆలోచిస్తారన్నమాట

చేయాలి. నేను చేయడం మాట ఎలా వున్నా, ఇంట్లో వాళ్లు ఆ పని మీదే వుంటారు కదా ?

-సో..ఆల్ ది బెస్ట్.  మంచి అమ్మాయి దొరకాలి మీకు..

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా