కరోనా వైరస్ సోకి ఆసుపత్రి పాలై, అస్వస్థతకు గురై, కోలుకుని.. తిరిగి విధుల్లో కూడా చేరిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన అనుభవాన్ని వివరించారు. గత సోమవారమే ప్రధానిగా తిరిగి విధుల్లోకి చేరిన జాన్సన్, ఆదివారం రోజున ఒక పత్రికతో తన కరోనా అనుభవాన్ని తెలిపారు. కరోనాతో చాలా తీవ్రంగా ఇబ్బంది పడినట్టుగా జాన్సన్ వివరించారు. ఒక దశలో తను బతకడం కష్టమేమో అనే పరిస్థితి కూడా ఏర్పడిందని బ్రిటన్ ప్రధాని చెప్పడం గమనార్హం.
తనను రక్షించడానికి అన్ని ఏర్పాట్లూ చేసిన వైద్యులు.. అదే సమయంలో ఒకవేళ తను మరణిస్తే, ఎలా ప్రకటించాలనే అంశం గురించి కూడా ఏర్పాట్లు చేశారని జాన్సన్ చెప్పడం గమనార్హం. మూడు రోజుల పాటు ఆక్సిజన్ సపోర్ట్ తో చికిత్స పొందారు జాన్సన్. చివరకు కోలుకున్నారు. జాన్సన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగానే ఆయన ప్రియురాలు ఒక బాబుకు జన్మనిచ్చింది. జాన్సన్ కు ఇంకా పెళ్లి కాలేదు, అయితే ఇది రెండో సంతానమట.
విశేషం ఏమిటంటే.. జాన్సన్ ను కరోనా బారి నుంచి రక్షించిన డాక్టర్ల పేర్లను కలిపి జాన్సన్ కొడుక్కు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఆసుపత్రిలో తనకు వైద్య సేవలు అందించిన అందరికీ జాన్సన్ కృతజ్ఞతలు తెలిపాడు. అంతేగాక నికో హర్ట్, నిక్ ప్రైస్ అనే ఇద్దరు వైద్యుల పేర్లను తన తనయుడి పేరులో కలిపాడట జాన్సన్. వారిద్దరి పేరులో కామన్ గా ఉన్న నిక్ ను తన తనయుడి పేరులో నికోలస్ గా చేర్చాడట జాన్సన్. ఈ బ్రిటన్ ప్రధాని తనయుడి పూర్తీ పేరు విల్ ఫ్రెడ్ లౌరీ నికోలస్ జాన్సన్ అని సమాచారం.