జోన్ల వారీగా ఆంక్షలు సడలిస్తే సరిపోతుందా!

కరోనా లాక్ డౌన్ ని రెండోసారి కేంద్రం పొడిగించింది. మరోవైపు ప్రజల కష్టాలు గమనించి ఆంక్షలు సడలించింది. దాదాపుగా కరోనాకి దేశ ప్రజలు అలవాటు పడినట్టే కనిపిస్తున్నా పెరుగుతున్న కేసులు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.…

కరోనా లాక్ డౌన్ ని రెండోసారి కేంద్రం పొడిగించింది. మరోవైపు ప్రజల కష్టాలు గమనించి ఆంక్షలు సడలించింది. దాదాపుగా కరోనాకి దేశ ప్రజలు అలవాటు పడినట్టే కనిపిస్తున్నా పెరుగుతున్న కేసులు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకీ కేసుల సంఖ్యతో పాటు భారత్ లో కరోనా విస్తృతి కూడా పెరుగుతోంది.

అత్యథికంగా గడచిన 24 గంటల్లో 2411 కొత్త కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. సగటున గంటకి 3 మరణాలు భారత్ లో సంభవిస్తున్నాయి. ఆంక్షలు సడలిస్తూ సాధారణ జనజీవనానికి కేంద్రం ఆమోదం తెలిపినా.. పెరుగుతున్న కేసులు మాత్రం అటు పాలకులకు, ఇటు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ రెడ్ జోన్లపై ఎక్కువగా దృష్టిసారించి, గ్రీన్, ఆరెంజ్ జోన్ల విషయంలో లైట్ తీసుకున్నా పర్లేదనుకున్న పరిస్థితి.

పెరుగుతున్న కేసుల్ని చూస్తుంటే.. గ్రీన్ జోన్లు కూడా అంత సేఫ్ కాదు అనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం రాకపోకలే. గ్రీన్ జోన్ లో నివశించే ఉద్యోగి రెడ్ జోన్లో ఉద్యోగానికి రోజూ వెళ్లి వస్తే కరోనా కట్టడి కుదురుతుందా..? ఆరెంజ్ జోన్లో ఉన్న ఓ అధికారి రోజూ రెడ్ జోన్ లో నుంచి ప్రయాణించి గ్రీన్ జోన్లో తన కార్యకలాపాల కోసం వెళ్లొస్తుంటే ఇక జోన్ల విభజన ఎందుకు? ప్రస్తుతం ఏపీలో కూడా ఇదే జరుగుతోంది.

కొత్తగా బైటపడుతున్న కేసుల్ని చూస్తుంటే గ్రీన్ జోన్లలో ఉన్న ప్రజలు కూడా భయంతోనే కాలం గడుపుతున్నారు. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్.. రాష్ట్రాల్లో కూడా కొత్త ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ దశలో లాక్ డౌన్ నామమాత్రంగా రెండు వారాలు పొడిగించిన కేంద్రం.. దాదాపుగా ఆంక్షలన్నిటినీ సడలించింది. దేశ ఆర్థిక పరిస్థితిని, ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా పెరుగుతున్న కేసులను బట్టి చూస్తే ఆంక్షల విషయంలో కేంద్రం తొందరపడిందేమో అనిపించక మానదు.

రాబోయే రోజుల్లో కరోనా ఉధృతిని బట్టి కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనే విషయం తేలుతుంది. కేసులు తగ్గితే సరే, ఆంక్షలు సడలించడంతో కొత్త ప్రాంతాల్లో కేసులు మొదలైతే మాత్రం అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఏదేమైనా రాబోయే రెండు వారాలు ప్రజల ఆరోగ్య భద్రతకు కీలకం కాబోతున్నాయి.

జగన్ కి స్పెషల్ థాంక్స్ చెప్పిన నవీన్ పట్నాయక్