సినిమా విడుదలకు ముందు దర్శక నిర్మాతలు, హీరో ఎక్కడలేని ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మనసులో లేకపోయినా కనీసం పైకి అలా కనిపిస్తారు. ప్రచారంలో కూడా సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని అంటారు. బొమ్మపై అనుమానం ఉన్నవాళ్లు కూడా ఎక్కడా జనాలకు అనుమానం రాకుండా కవర్ చేస్తుంటారు. ఇప్పుడు రజనీకాంత్ కొత్త సినిమా 2.0 విషయంలో కూడా అవే అనుమానాలు మొదలవుతున్నాయి.
సినిమాపై రజనీ, శంకర్ కి ఉన్నది ఓవర్ కాన్ఫిడెన్సా లేక ఓన్లీ కాన్ఫిడెన్సా అర్థం కావడంలేదు. ప్రచారం హోరెత్తిస్తేనే ఈ రోజుల్లో ప్రేక్షకుల్ని థియేటర్ల వరకు తీసుకెళ్లగలరు. ఫస్ట్ వీక్ కలెక్షన్లు సేఫ్ గా జేబులోకి రావాలంటే ప్రీ రిలీజ్ ప్రచారాలతో పాటు.. వారం రోజుల పాటు యాత్రలు కూడా అవసరం.
కానీ 2.0 విషయంలో నిర్మాతలు ప్రచారాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారనే చెప్పాలి. కనీసం రోబో సినిమా వచ్చినప్పుడు చేసిన ఆర్భాటం కూడా సీక్వెల్ విషయంలో చేయలేదు. అయితే దీనికి సరైన కారణం ఉందంటున్నాడు హీరో రజనీకాంత్.
ఈ సినిమా టెక్నాలజీతో కూడిన మంచి సబ్జెక్ట్ అని, అందుకే దీనికి ప్రచారం అక్కర్లేదని అన్నాడు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే ప్రచారం చేస్తారని కూడా సెలవిచ్చాడు. రజనీ మాటలు వింటుంటే సినిమాపై ఆయనకు బాగా నమ్మకం ఉందనే విషయం అర్థమవుతోంది.
సినిమాకంటే కూడా శంకర్ పైనే సూపర్ స్టార్ కి ఇంకా ఎక్కువ గురి ఉంది. అయితే శంకర్ గత చిత్రం 'ఐ' రిజల్ట్ 2.0పై కూడా పడే ప్రమాదం ఉంది. మరోవైపు రజనీకాంత్ ట్రాక్ రికార్డ్ కూడా ఘోరంగా ఉంది. ఇలాంటి సమయంలో సినిమాకి రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ ని ఎవరూ ఊహించరు.
తమిళంలో చెప్పలేం కానీ, తెలుగులో అయితే ఓపెనింగ్స్ తో రజనీ రికార్డులు బద్దలు కొట్టలేడనే చెప్పాలి. సూపర్ స్టార్ మాటలు నిజమై నిజంగానే సినిమా బాగుండి ప్రేక్షకుల నోటి మాట ద్వారానే ప్రచారం ఊపందుకుంటే, ఇక సినిమాని ఆపేవాడే ఉండడు.
సినిమా యూనిట్ అంతా ఇదే విషయంపై కాన్ఫిడెంట్ గా ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని తహతహలాడే ప్రేక్షకులు ఎవ్వరూ లేకపోయినా సినిమా బాగుందనే టాక్ వస్తే మాత్రం కచ్చితంగా థియేటర్ల ముందు జనం క్యూ కడతారు.
2.0 ప్రెస్ మీట్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి
కల్యాణ్ రామ్ ఇంతకీ ఎటువైపు..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్