ఏప్రిల్ 27.. ఈ 'మహత్తరమైన' రోజు కోసం మొన్నటివరకు అల్లు అర్జున్, మహేష్ నిర్మాతలు తెగ కొట్టుకున్నారు. బన్నీ వాస్ అయితే అత్యుత్సాహంతో ఏవేవో మాట్లాడేశాడు. మరోవైపు ఓ సెక్షన్ మీడియా అయితే బన్నీ, మహేష్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదని ఫిక్స్ అయిపోయింది. అయితే ఇప్పుడీ వివాదాన్ని రజనీకాంత్ పరిష్కరించాడు.
మహేష్, అల్లు అర్జున్ పట్టుబడుతున్న తేదీని రజనీకాంత్ ఆక్రమించాడు. ఏప్రిల్ 27న 2.0 సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించాడు. దీంతో బన్నీ లేదా మహేష్ లో ఎవరో ఒకరు కచ్చితంగా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఆల్ మోస్ట్ ఇద్దరూ తప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదిక్కడ.
రీసెంట్ గా రజనీకాంత్ సినిమాలన్నీ టాలీవుడ్ లో ఫ్లాప్ అవుతున్నప్పటికీ.. అతడి క్రేజ్ మాత్రం తగ్గలేదు. దీనికితోడు 2.0తెలుగు రైట్స్ 75కోట్ల రూపాయల భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. కాబట్టి దొరికిన ప్రతి థియేటర్ లో సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు తెలుగు నిర్మాతలు.
అలాంటి టైమ్ లో బన్నీ, మహేష్ తమ సినిమాల్ని రిలీజ్ చేయాలని అనుకోరు. వీళ్లకు సంబంధించిన వ్యక్తుల చేతిలో కొన్ని థియేటర్లు ఉన్నప్పటికీ.. 2.0కారణంగా ఆశించిన స్థాయిలో థియేటర్లు మాత్రం ఈ హీరోలకు దక్కవు. అలాంటప్పడు నా పేరు సూర్య, భరత్ అనే నేను సినిమాల్ని పోస్ట్ పోన్ చేయడానికి మొగ్గుచూపుతారు ఎవరైనా. మొత్తానికి మొన్నటివరకు ఏప్రిల్ 27కోసం పోటీపడిన ఈ హీరోలిద్దరూ, రజనీ రాకతో సైలెంట్ అయిపోయారు.