మొత్తానికి డైరక్టర్ వివి వినాయక్ మాటే నెగ్గింది. సినిమాకు థర్మాభాయ్ టైటిల్ పెడదాం అని హీరో సాయిధరమ్ తేజ, ఇంటిలిజెంట్ అని వినాయక్ కిందా మీదా అయ్యారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కథ ప్రకారం ఇంటిలిజెంట్ టైటిల్ నే బాగుంటుందని వినాయక్ గట్టిగా భావించడంతో ఆఖరికి అదే టైటిల్ ను పిక్స్ చేసారు.
ఇకపోతే, సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఆ రోజున వరుణ్ తేజ తొలిప్రేమ వుంటుందని ప్రకటించారు. అయినా కూడా సాయిధరమ్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ డేట్ ప్రకటించే ఆలోచనలోవున్నారు. బహుశా సాయిధరమ్-వినాయక్ సినిమా ప్రకటిస్తే, వరుణ్ సినిమా వెనక్కు వెళ్తుందేమో అన్న ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.
కానీ తమకు ఇంటిలిజెంట్ సంగతి తెలియదని, తాము 9నే వస్తున్నామని తొలిప్రేమ యూనిట్ చెబుతోంది. వాలంటైన్స్ డే సందర్భంగా తొలిప్రేమ విడుదల ప్లాన్ చేసామని, వెనక్కు తగ్గేదిలేదని యూనిట్ వర్గాల బోగట్టా.
ఇదిలా వుంటే ఇంటిలిజెంట్ నిర్మిస్తున్న బ్యానర్ పైనే బాలయ్య జైసింహా కూడా నిర్మించారు. ఆ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. ఆ సినిమా మార్కెటింగ్ స్ట్రాటజీల్లో భాగంగానే సాయిధరమ్ తేజ సినిమా డేట్ ఫీలర్లు వస్తున్నాయని, అంతేతప్ప, ఆ రోజుకు ఆ సినిమా రాదని కూడా టాక్ వినిపిస్తోంది.