ఆ నటుడు అంతలా దండుకున్నాడా.?

తమిళ నటుడు శరత్‌కుమార్‌, తెలుగులోనూ పలు సినిమాల్లో నటించిన విషయం విదితమే. ఒకప్పటి హీరోయిన్‌ రాధికని పెళ్ళాడిన శరత్‌కుమార్‌, తాజాగా రాజకీయంగానూ వార్తల్లోకెక్కాడు. తనతోపాటు, తన భార్య రాధికనీ వార్తల్లోకెక్కించాడాయన. అదీ, ఆదాయపు పన్ను శాఖ…

తమిళ నటుడు శరత్‌కుమార్‌, తెలుగులోనూ పలు సినిమాల్లో నటించిన విషయం విదితమే. ఒకప్పటి హీరోయిన్‌ రాధికని పెళ్ళాడిన శరత్‌కుమార్‌, తాజాగా రాజకీయంగానూ వార్తల్లోకెక్కాడు. తనతోపాటు, తన భార్య రాధికనీ వార్తల్లోకెక్కించాడాయన. అదీ, ఆదాయపు పన్ను శాఖ దాడుల వల్ల కావడం విశేషమిక్కడ. 

తమిళనాడులోని ఆర్‌కే నగర్‌ నియోజనకవర్గంలో ఉప ఎన్నిక జరగాల్సి వుండగా, ఓటర్లను డబ్బుతో ప్రలోభపెడుతున్న అధికార పార్టీ తీరు కారణంగా ఆ ఉప ఎన్నిక రద్దయ్యింది. అప్పటిదాకా చాటుమాటుగా సాగిన ఈ డబ్బు పంపకాల వ్యవహారం కాస్తా, శరత్‌కుమార్‌ ఎంట్రీతో కొత్త మలుపు తిరిగింది. అన్నాడీఎంకే పార్టీ – శశికళ వర్గానికి చెందిన అభ్యర్థి దినకరన్‌ని కలిసి శరత్‌కుమార్‌ మద్దతు పలికిన మరుసటి రోజే, ఉప ఎన్నిక – డబ్బు ప్రవాహం అంశం తెరపైకి రావడం గమనార్హమిక్కడ. 

తమిళనాడు మంత్రి విజయ్‌కుమార్‌ 100 కోట్లకు పైగా డబ్బుని, ఎన్నికల్లో పంచేందుకు పంపించినట్లు ఆదాయపు పన్ను శాఖ తమ సోదాలతో తేల్చింది. శరత్‌కుమార్‌పైనా ఆరోపణలు రావడంతో, ఆయన ఇంట్లోనూ, కార్యాలయాల్లోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహించి, ఆయన్ని ప్రశ్నించింది కూడా. నిన్న రాధిక కార్యాలయం 'రాడాన్‌'లో దాడులు జరగ్గా, తాజాగా ఈ రోజు కూడా ఆ దాడులు కొనసాగడం, శరత్‌కుమార్‌ని మరోమారు ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం. 

ఈ ఎపిసోడ్‌ ఇలా నడుస్తున్న సమయంలోనే, శరత్‌కుమార్‌కి విజయ్‌కుమార్‌ నుంచి దాదాపు 10 కోట్ల దాకా ముట్టాయనీ, ఈ డబ్బు అంతా పంపకాల కోసం ఉద్దేశించినదేనన్న 'లీకులు' బయటకొస్తున్నాయి. అయితే, ఈ మొత్తం దినకరన్‌కి శరత్‌కుమార్‌ మద్దతు పలకడంతో లభించిన 'నజనారా' అన్న వాదనలూ లేకపోలేదు. డబ్బు వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖకు క్లారిటీ రావడంతో శరత్‌కుమార్‌ ఏ క్షణాన అయినా అరెస్టయ్యే అవకాశాలున్నాయట.