ఇప్పటి పాటల్లో కూడా హిట్ లు వుండొచ్చు. చార్ట్ బస్టర్లు వుండొచ్చు. కానీ 1960 నుంచి 2000 మధ్యలో వచ్చిన తెలుగుపాటలే వేరు. అవి కాలానికి నిలిచిపోయాయి. అంతేకాదు, ఆ సినిమాలను జనాలు చాలా వరకు మరచిపోయినా, పాటలు మరచిపోలేదు. అప్పట్లో ఆ పాటల హక్కులు తీసుకున్నవారికి ఇప్పటికీ కనకవర్షం కురుస్తూనే వుంది. లేటెస్ట్ గా ఓ ఉదంతం అలాంటిది వుంది.
ఇటీవల వచ్చిన గీత గోవిందం సినిమాలో ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’ అనేపాట జస్ట్ ముఫై సెకెన్ల పాటు వినిపించింది. ఆ పాట, ఆ బ్లాక్ అండ్ వైట్ లుక్ తోనే గీతగోవిందం టీజర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇది చూసిన వాళ్లంతా విజయ్ దేవరకొండ-రష్మికను ఆ బ్లాక్ అండ్ వైట్ పాటలో పూర్తిగా ఊహించుకుని సరదా పడుతున్నారు.
కానీ విషయం ఏమిటంటే, ఈ మాత్రం అంటే ముఫై సెకెండ్లు చూపించడానికే నిర్మాతలకు తలప్రాణం తోకకు వచ్చింది. ఎందుకంటే ఆ పాట 1975లో వచ్చిన పూజ సినిమాలోది. కన్నడ ఫేమస్ మ్యూజిక్ డైరక్టర్లు రాజన్ నాగేంద్ర ట్యూన్ చేసింది. అప్పట్లో ఈ రైట్స్ అమ్మేసారు. అలా అలా చేతులు కూడా మారింది. ఇప్పడు టీజర్ లో వాడడానికి అతికష్టం మీద 30సెకెండ్లకే అనుమతి దొరకిందట. దానికి కూడా లక్షా డెభైవేలు ఖర్చు అయిందట. అంతకు మించి వాడడానికి ఒప్పుకోలేదట. దానికీ కారణం వుంది. పెద్ద మొత్తానికి ఆ పాట ట్యూన్ ను ఆ సంస్థ వేరే వాళ్లకు అమ్మేసిందట.
అంటే అప్పట్లో సినిమా నిర్మాణం మొత్తానికి కూడా అన్ని లక్షలు ఖర్చయి వుండదు. ఇప్పుడు రైట్స్ కొన్నవాళ్లకు మాత్రం లక్షలకు లక్షలు వస్తున్నాయి. అదంతా ఆనాటి సంగీత దర్శకులు, గీత రచయితల సృజన కారణంగానే తప్ప వేరు కాదు కదా?