అ..ఆ సినిమా కు మళ్లీ మరో కీలక టెక్నీషయన్ మారిపోయారు. సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రహ్మణ్యన్ సినిమా మూడు వంతులు పూర్తయ్యాక పక్కకు తప్పుకున్నారు. ఇక్కడ ఎవరి తప్పూ లేదు..ముందు అనుకున్న ప్రకారం ఆయన ఇచ్చిన కాల్ షీట్స్ అయిపోయాయి. సినిమాను త్రివిక్రమ్ 90 రోజుల పాటు చెక్కడమే ఇందుకు కారణం. దీంతో బాలీవుడ్ సూపర్ సినిమాటోగ్రాఫర్ డూగ్లీ వచ్చి చేరాడు. ఆరంభంలో ఆర్ట్ డైరక్టర్ మారిపోయిన సంగతి గుర్తుంది కదా? నిజానికి త్రివిక్రమ్ కు ప్రియమైన ఆర్ట్ డైరక్టర్ రవీంద్ర వుండాల్సింది. కానీ నిర్మాతకు ఆర్ట్ డైరక్టర్ రవీంద్రతో ఖర్చు విషయంలో కొన్ని చేదు అనుభవాలు వున్నట్లు వినికిడి.
అదీ కాక, అ..ఆ సినిమాకు ది టాప్ టెక్నీషియన్లు మాత్రమే వుండాలని త్రివిక్రమ్ అనుకోవడంతో రాజీవన్ ను ఆర్ట్ డైరక్టర్ గా, అనిరుధ్ ను మ్యూజిక్ డైరక్టర్ గా అనుకున్నారు. కానీ రాజీవన్ ను కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో సాగనంపారు. ఎంతకీ అరవింద్ పాటలు చేయకపోవడంతో ఆయనను సాగనంపారు. మిక్కీ జే మేయర్ వచ్చారు. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ నటరాజ సుబ్రహ్మణ్యన్ డేట్లు అయిపోవడంతో, డూగ్లీ వచ్చి చేరాడు..అతగాడు బాలీవుడ్ టాప్ టెక్నీషియన్.
అసలు ఈ సినిమాకు ఆ టాప్ రేంజ్ టెక్నీషియన్లు ఎందుకో టాలీవుడ్ జనాల ఊహకు అందడం లేదు. దీని వల్ల నితిన్ సినిమా బడ్జెట్ నలభై కోట్లకు చేరిపోయిందని వినికిడి. సినిమా హక్కులు మాత్రం ప్రారభంలో అనుకున్న రేట్లకే ఇస్తున్నారని వినికిడి. త్రివిక్రమ్ సినిమా కనుక గ్యారంటీ బ్లాక్ బస్టర్ అనుకున్నా, యాభై కోట్లు వసూలు చేస్తే తప్ప నలభై కోట్ల పెట్టుబడికి లాభాలు రావు. టెంపర్, సోగ్గాడే చిన్ని నాయనా, నాన్నకు ప్రేమతో లాంటి బ్లాక్ బస్టర్లన్నీ యాభైకి కాస్త అటు ఇటుగానే సంపాదించాయి. ఇప్పుడు అ..ఆ కూడా ఆ రేంజ్ హిట్ కావాలి.
సినిమా చాలా బాగా వస్తోందని, చాలా హిలేరియస్ గా వుందని టాక్ అయితే వుంది. కానీ అంత మాత్రం చేత నితిన్ సినిమా యాభై కోట్లకు పైగా వసూలు అన్నప్పుడు అనుమానం వస్తుంది. మళ్లీ త్రివిక్రమ్ వున్నారు కదా అని అనుకుంటే ఫరవాలేదనిపిస్తుంది.
నితిన్ వాల్యూ అంతేనా
ఫస్ట్ లుక్ వదిలారు. నితిన్ వెనుక నుంచి కనిపించాడు. అనుపమ పరమేశ్వరన్ జాడ లేదు. సమంత మాత్రమే దర్శనమిచ్చింది. హార్ట్ ఎటాక్ లో మాదిరిగా ఓ పెద్ద బ్యాక్ ప్యాక్ వేసుకుని నితిన్ కనిపించాడు కానీ మొహం చూపించలేదు. వీపు భాగంతో సరిపెట్టారు. సినిమా ఫస్ట్ లుక్ కు హీరోని చూపించకపోవడం ఏమిటో? కనీసం కండో, దండో చూపించినా హీరోయిజం వుండేదేమో? అయినా మొదటి నుంచి ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అన్న వదంతి వుంది. ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తోంది.
మీనా పాత్రలేనా?
మీనా నవలలో కనిపించే పాత్రల్లాంటి పాత్రలే సినిమాలో వుండాయని టాక్ వినిపిస్తోంది. అందులో పాలేరు లాంటి పాలేరు, కథానాయిక లాంటి కథానాయిక, ఇంకా చాలా పాత్రలు మీనా నవలలో పాత్రలను పోలి వుంటాయని వినికిడి. మీనా నవల అంటే దర్శకుడు త్రివిక్రమ్ కు వీరాభిమానమని, అందువల్లే ఈ తరహా ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.
మొత్తానికి ముగ్గురు టెక్నీషియన్లను మార్చుకుని, హాసిని అధినేత రాధాకృష్ణ మూడు సినిమాల వరుసలో ముందుగా వచ్చే సినిమా అ..ఆ దాని తరువాత జూన్ 1న బాబు బంగారం, జూలై 6న ప్రేమమ్ వస్తున్నాయి. ఆ రెండు సినిమాలు టేబుల్ ప్రాఫిట్ తో విడుదలవుతుంటే…త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మాత్రం, ఆయన ప్రతిభ పై ఆధారపడి, విడుదల తరువాత ఎర్నింగ్స్ ఆధారంగా విడుదలవుతోంది.