సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ నే మాట్లాడుతుంది. విజయాలే అవకాశాలను తీసుకువస్తాయి. ఆది సాయికుమార్ పరిస్థితి అలాగే వుంది. లవ్ లీ లాంటి మాంచి లవ్ జోనర్ సినిమా చేసిన తరువాత సిక్స్ ప్యాక్, మాస్ జోనర్ అంటూ ఏదేదో చేసుకుంటూ వెళ్లాడు. మిగిలిన యంగ్ హీరోలు ఫీల్ గుడ్ ఫ్యామిలీ యూత్ లవ్ ఎంటర్ టైనర్లు చేస్తుంటే, మాస్ టచ్ కోసం చూసాడు ఆది. కానీ వరుసపెట్టి అన్నీ పరాజయాలే పలకరించాయి. దాంతో ఇప్పుడు చేతిలో సినిమాలే కరువయ్యాయి.
ఆ మధ్య తండ్రి మాదిరిగా కన్నడ రంగంలోకి ఎంటర్ అవుదాం అనుకున్నాడు. కానీ ఇక్కడ హిట్లు, సినిమాలు లేక అటు వెళ్లాడంటారని జంకి ఆగిపోయాడు. ఇంతలో జ్ఞాన్ వేల్ రాజా తమిళంలో ఇంట్రడ్యూస్ చేస్తానని మాట ఇచ్చాడట. అదేదో బాగుందని వెయిట్ చేస్తుంటే, చటుక్కున విజయ్ దేవరకొండను తీసుకున్నాడు అతగాడు. దీంతో ఆదికి మళ్లీ నిరాశే మిగిలింది.
ఇప్పుడు ఆది సాయి కుమార్ జంక్షన్ లో నిల్చున్నాడు. సరైన ప్రాజెక్టు ఏదీ చేతిలో లేదు. ఏది చేయాలో? ఏది చేయకూడదో డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు. అస్సలు ఏ యంగ్ హీరో కూడా ఖాళీ లేకుండా ఏదో ఒక సినిమా చేతిలో వుంచుకుని, ముందుకు వెళ్తుంటే ఆది మాత్రం అక్కడే ఆగిపోయాడు.