చిత్రసీమలో సెంటిమెంట్లకు కొదవ లేదు. అదృష్టమే అందలాలు ఎక్కిస్తుందనే నమ్మకం చాలాసార్లు నిజమైంది కూడా. ఆర్తి అగర్వాల్ కూడా తన అదృష్టాన్ని ఛార్మికి ట్రాన్స్‌ఫర్ చేసిందట. అదెలాగంటే…
ఆర్తి కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్. ఆ తరవాత నువ్వు లేక నేను లేను లో నటించింది. ఈ రెండు సినిమాలు చేస్తున్నప్పుడు ఆర్తి మకాం హైదరాబాద్‌లోని సురేష్ గెస్ట్ హౌస్‌లోనే. తొలి రెండు చిత్రాలూ సూపర్ హిట్టయి, ఆర్తికి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. స్టార్ హోదా తెచ్చుకొంది.
దాంతో ఆర్తి హైదరాబాద్లో తన సొంత డబ్బులతో ఓ గెస్ట్ హౌస్ కొనుగోలు చేసింది. ఆ తరవాత ఆమె స్టార్ డమ్ మరింత పెరిగింది. ఒక దశలో అత్యధిక పారితోషికం అందుకొంటున్న కథానాయికల జాబితాలో ఆర్తి పేరు కూడా చేరిపోయింది.
కొంతకాలానికి అవకాశాలు తగ్గి, ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ గెస్ట్ హౌస్ అమ్మకానికి పెట్టింది. అనుకోకుండా ఆ గెస్ట్ హౌస్ ఛార్మి చేజిక్కించుకొంది. ఆ గెస్ట్ హౌస్ కొన్నాకే ఛార్మికి టైమ్ కలసొచ్చిందట. కొంతకాలనికే జ్యోతిలక్ష్మి సినిమా పట్టాలెక్కిందట. నిర్మాతగానూ మారిందట. అలా ఆర్తి అగర్వాల్ గెస్ట్ హౌస్ సెంటిమెంట్ తన విషయంలో నిజమైందని ఛార్మి కాస్త ఆవేదన నిండిన స్వరంతో.. చెప్పుకొచ్చింది.