తమ చిత్ర పరిశ్రమను బతికించుకొనేందుకు.. అంటూ చాలా సంవత్సరాల క్రితమే ఇతర భాషల చిత్రాలను డబ్ చేయడంపై నిషేధాన్ని విధించేశారు. తత్ఫలితంగా.. కన్నడ తెరను ఏలుతున్న తమిళ, తెలుగు, ఇంగ్లిష్ డబ్బింగ్‌లకు పూర్తిగా తెరపడింది. భారీ బడ్జెట్ సినిమాలతో.. హంగూ ఆర్భాటాలతో కన్నడ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. అక్కడి లోకల్ సినిమాను చితికిపోయేలా చేస్తున్న సినిమాల ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. మరి ఇలా డబ్బింగ్ సినిమాలపై విధించిన నిషేధం కన్నడ చిత్రపరిశ్రమలో లోకల్ వాలాలను బతికించిందా?! డబ్బింగ్‌ల నిషేధం వల్ల శాండల్ వుడ్లో మంచి సినిమాలు వచ్చాయా? అనేది ఒక పెద్ద చర్చ. చాలా కాలంగా కొనసాగుతున్న చర్చ! ఇలాంటి పరిస్థితుల మధ్య ఒక గమనించదగ్గ విషయం ఏమిటంటే… డబ్బింగ్లపై నిషేధం ఉన్న కన్నడ తెరపై ఇప్పుడు రీమేక్‌ల ప్రభావం పెరిగింది! ఒకటి కాదు రెండు కాదు.. ప్రతి అడ్డమైన సినిమానూ అక్కడ రీమేక్ అవుతున్నాయి!
తెలుగు లేదా తమిళం ఇంకా.. హిందీ. ఈ భాషల్లో హిట్టైన అనేక సినిమాలను శాండల్ వుడ్లో రీమేక్ చేసేస్తున్నారు! మామూలుగా అయితే ఈ సినిమాలు అన్నీ డబ్బింగ్ అయ్యేవి. అయితే ఆ అవకాశం లేదు కాబట్టి.. ఎంచక్కా రీమేక్ చేసేస్తున్నారు. ఈ రీమేక్ వ్యవహారాలు ఒక్కోసారి ప్రహసనాలుగా కూడా మారుతున్నాయి. తెలుగులోనూ.. తమిళ భాషలోనూ క్లాసిక్స్ అనిపించుకొన్న సినిమాలు కూడా కన్నడలో రీమేక్ అవుతున్నాయి! ఇలాంటి రీమేక్‌లతో ఆ క్లాసిక్ సినిమాల సోల్ దెబ్బతింటున్నా.. తప్పనిసరిగా రీమేక్ చేయడం తప్పనిసరి.
‘స్వాతిముత్యం’ వంటి సినిమాను కూడా రీమేక్ చేశారంటే.. తెలుగు వెర్షన్లో కమల్ ప్రాణం పోసిన పాత్రలో సుదీప్ కనిపించాడు అంటే.. ఈ విషయం తెలిసినప్పుడు ఆశ్చర్యం కలగకమానదు. ఆ సినిమాను కన్నడ ప్రేక్షకులకు చూపించడానికి ఆ ప్రయత్నం జరిగింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘‘పితామగన్’’ను తెలుగువాళ్లు చూశారు. విక్రమ్, సూర్యలు ముఖ్యపాత్రల్లో చేసిన ఆ సినిమాను తెలుగవాళ్లు అనువదించుకొని ఆస్వాధించారు. అయితే కన్నడలో మాత్రం ఆ సినిమా రీమేక్ అయ్యింది! ఉపేంద్ర విక్రమ్ పాత్రను చేయగా.. సూర్య పాత్రలో దర్శన్‌ను పెట్టి దాన్ని పునర్నిర్మించారు!
ఈ మధ్యకాలంలోనే చూస్తే… తమిళంలో హిట్ అయిన ‘‘సింగం’’ సినిమాను ‘‘కెంపేగౌడ’’ పేరుతో సుదీప్ రీమేక్ చేశాడు. మరో తమిళ సినిమా ‘‘నాడోడిగళ్’’ను పునీత్ రాజ్ కుమార్ రీమేక్ చేశాడు, ప్రభాస్ చేసిన డార్లింగ్ చేసినిమాను కూడా దర్శన్ రీమేక్ చేశాడు, గోపిచంద్ హీరోగా వచ్చిన లక్ష్యం సినిమాను కూడా సుదీప్ ఆధ్వర్యంలో రీమేక్ అయ్యింది, ఎన్టీఆర్ బృందావనం, ప్రభాస్ హీరోగా నటించిన మిర్చిని సుదీపే రీమేక్ చేశాడు. తెలుగులో సత్యరాజ్ చేసిన పాత్రలో కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ చేయగా., ఈ సినిమాకు సుదీపే దర్శకత్వం వహించాడు.
ఇక దృశ్యం సినిమా తెలుగు తమిళంలో రీమేక్ అయినట్టుగానే కన్నడలో కూడా రీమేక్ అయ్యింది. రవిచంద్రన్ ముఖ్యపాత్రలో చేసిన ఈ సినిమా రీమేక్ అయ్యింది. ఇక ‘‘దూకుడు’’ సినిమాను కూడా కన్నడీకులు వదల్లేదు. దీన్ని పునీత్ రాజ్ కుమార్ రీమేక్ చేశాడు. ఈ సినిమాతోనే త్రిష కన్నడలో తొలిసారి ఒక స్ర్టైట్ సినిమా చేసినట్టైంది.
ఇలా కన్నడలో ఏడాదికి వంద సినిమాలు వస్తున్నాయనుకొంటే… అందులో 50కి పైన రీమేక్ సినిమాలే. ప్రత్యేకించి కన్నడ స్టార్ హీరోలే ఈ రీమేక్‌ల మీద మమకారం పెంచుకొన్నారు. సౌత్‌లో హిట్ అయిన ఏ సినిమానూ వారు వదలడం లేదు! తమకున్న ఇమేజ్‌కు తగ్గట్టుగా కన్నడ వాళ్ల చేతే కథలు రాయించుకోవడమో.. కొత్తదనాన్ని ఆస్వాధించడమో చేయకుండా వారు ఎంతసేపూ రీమేకుల చుట్టే ప్రదక్షినలు చేస్తున్నారు. ఈ విషయం గురించి సుదీప్ మాట్లాడుతూ.. రీమేక్‌లు చేయడం తమకు తప్పనిసరి అని వ్యాఖ్యానించేశాడు.
పిడుగుకూ బియ్యానికి ఒకే మంత్రం వేసినట్టుగా.. అన్ని సినిమాలనూ యధేచ్చగా రీమేక్ చేసుకొంటూ పోతున్నా… ఇలాంటి రీమేక్‌ల వల్ల రెండు రకాల సౌలభ్యాలున్నాయి. ఒకటి ఆల్రెడీ ఒక భాషలో హిట్ కాబట్టి.. కన్నడలో కూడా అది హిట్ అవుతుందనే నమ్మకం ఉంటుంది. దీని వల్ల ఆ సినిమా రూపకర్తలు కొంత సేఫ్ జోన్ లో ఉంటారు. ఇలా రీమేక్ చేయడం వల్ల కొంతమందికి ఉపాధి లభిస్తుంది. ఒకవేళ ఈ రీమేక్ చేయకపోతే ఇవే సినిమాలు డబ్బింగ్ అయ్యి సొమ్ము చేసుకొనేవి.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మరోటి ఉంది. కన్నడలో డబ్బింగులను నిషేధించేశారు కానీ.. తెలుగు, తమిళ సినిమాలు స్ర్టైట్గా వెళ్లి అక్కడ కలెక్షన్లను సాధించుకోవడాన్ని మాత్రం అపలేకపోతున్నారు. రాయలసీమ ప్రాంతంలో సరిహద్దును పంచుకొనే కర్ణాటక జిల్లాలన్నింటిలోనూ తెలుగు సినిమా డ్యామినేషనే ఉంటుంది. తెలుగు మాట్లాడే ప్రజలు విస్తృతంగాఉండే ఆ ప్రాంతంలో తెలుగు హీరోల సినిమాలు అన్నీ స్ర్టైట్ గానే విడుదలైపోతున్నాయి. అసలు డబ్బింగ్ అవసరమే లేదు!
ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఇలా ఉంటే.. అటువైపు తమిళనాడుతో సరిహద్దును పంచుకొనే కన్నడ జిల్లాల్లో తమిళ సినిమాల హవా ఉంది. ఇలా సరిహద్దుల నుంచి మొదలుకొని బెంగళూరు సిటీ మల్టీప్లెక్సుల వరకూ తెలుగు, తమిళ సినిమాల హవానే ఉంది. విడుదల సమయంలో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ ఉంటాయి.. సత్తా ఉంటే ఎక్కువ రోజులు ఆడుతున్నాయివి. విడ్డూరం ఏమిటంటే.. అన్ని రకాల డబ్బింగులపై కూడా నిషేధం ఉంది కాబట్టి హాలీవుడ్ సినిమాలపై కూడా అది కొనసాగుతోంది. దీంతో.. ఇటీవల వచ్చిన ‘‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’’ సినిమాను లోకల్ లాంగ్వేజ్‌లో చూడటం కష్టం అయ్యింది. అందుకే.. ఈ హాలీవుడ్ సినిమా తెలుగు వెర్షన్‌ను బెంగళూరు సిటీలో కూడా విడుదల చేశారు! ఇంగ్లీష్ వెర్షన్ కావాలనుకొనే వారు ఆ వెర్షన్లో చూడగలరు.. ఆ భాష అర్థం కాదు కానీ హాలీవుడ్ సినిమా చూడాలనుకొనే వారు ఎంచక్కా తెలుగు వెర్షన్ థియేటర్లకు వెళ్లారు. ఇలా ఉంది డబ్బింగ్ సినిమాల నిషేధంతో కన్నడ నాట పరిస్థితి.
కేవలం థియేటర్లలోనే కాదు.. కన్నడ టీవీ చానళ్లలో కూడా డబ్బింగ్ సినిమాల ప్రసారానికి అవకాశం లేదు. దీంతో కొంతమంది ప్రేక్షకులు మాత్రం చాలా ఫీలవుతున్నారు. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు అన్ని రకాల సినిమాలనూ చూడటానికి అవకాశం ఇవ్వాలని.. డబ్బింగ్ సినిమాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే సినీ పరిశ్రమలో మాత్రం డబ్బింగ్ సినిమాలపై నిషేధం ఉండాల్సిందేననే అభిప్రాయం వినిపిస్తోంది.
మరి డబ్బింగులు నిషేధించేసి కొత్త ప్రయోగాలు చేసి ఉంటే.. శాండల్ వుడ్ జనాలకు ప్రశంసలు దేక్కవి. అలాగాక దీన్నో అవకాశంగా మలుచుకొని హీరోలు, నిర్మాతలు, దర్శకులు తాము సేఫ్ జోన్లో ఉండటానికి రీమేక్‌లు చేసుకొంటూ ఉంటే శాండల్ వుడ్ స్థాయి మెరుగవుతుందా?!