ఎక్కడైనా బావ కానీ, వంగతోటలో కాదని సామెత. టాలీవుడ్ లో అయితే ఎక్కడైనా నడుస్తుంది హవా కానీ, మెగా కాంపౌండ్ లో కాదని మార్చుకోవాలి. బన్నీతో సినిమా అనుకున్న దగ్గర నుంచి దర్శకుడు బోయపాటి శ్రీనుకు తెలిసి వస్తోంది ఈ వాస్తవం.
కథ, కథనాలు తన చిత్తానికి తయారుచేసుకుంటే, నిర్మాత అల్లు అరవింద్ వీటో చేసాడు. మళ్లీ సెట్ చేయమని చెప్పడంతో, తొలిసారి ఈ వైనం అనుభవంలోకి వచ్చింది. దాంతో సినిమా వెనక్కు వెళ్లింది. ఇప్పుడు అంతా అయింది. హీరోయిన్ సెలక్షన్ దగ్గర కూడా బోయపాటి మాట చెల్లలేదట. హన్సిక అన్నది పూర్తిగా బన్నీ, అల్లు అరవింద్ చాయిస్ అంట.
హన్సిక మరీ బొద్దుగా వుంటుందని (నిజానికి ఈ మధ్య బాగా సన్నబడింది) అడ్డు చెప్పబోతే, అక్కడా వీటో చేసారట. కావాలంటే చిక్కుతుంది లెండి, అని బోయపాటికి చెప్పేసి, హన్సికను ఫైనల్ చేసారని తెలుస్తోంది. ఇప్పుడే ఇలా వుంటే, ఇక టేకింగ్ లో ముందు ముందు బోయపాటికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో?