2018 మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన సుకుమార్-రామ్ చరణ్ కాంబో రంగస్థలం డేట్ అఫీషియల్ గా ప్రకటించేసారు. మార్చి 30న విడుదల. అయితే అంతకు ముందే మరో రెండు సినిమాల డేట్లు బయటకు అధికారికంగా వచ్చాయి. ఒకటి మహానటి బయోపిక్. అది కూడా మార్చి 30న అని ప్రకటించారు. ఈ సినిమా సబ్జెక్ట్ బయోపిక్ కావచ్చు కానీ, చాలా తారాగణం వుంది ఇందులో. ఇక కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే డేట్ కూడా మార్చి 29 అని ప్రకటించారు.
ఇదిలా వుంటే మహానటి సినిమా వెనక్కు వెళ్లిందని, గ్రాఫిక్స్ పనులు అందుకు కారణం అని తెగ ఫీలర్లు వినిపించాయి. అయితే ఈ డేట్ వదులుకుంటే సరైన డేట్ లేదు ఆ సినిమాకు. మార్చి నుంచి వరుసగా పెద్ద సినిమాలు క్యూ కట్టి వున్నాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అన్న డేట్ కు వచ్చి తీరతామని, మార్చి ముఫైన మహానటి విడుదల పక్కా అని నిర్మాణ వర్గాలు స్పష్టం చేసాయి.
ఒకసారి డేట్ ప్రకటించి వెనక్కు వెళ్లడం అన్నది లేదని, మార్చి 30న మహానటి విడుదల వుంటుందని నిర్మాణ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు వస్తున్నవి అన్నీ వదంతులు తప్ప వేరు కాదంటున్నారు. దీంతో రంగస్థలం సినిమాకు కాస్త ఇబ్బందిగా వుండే ప్రమాదం వుంది. ఎందుకంటే కాస్త బజ్ వున్న సినిమాలు రెండు ఒకేసారి వస్తే, ఓపెనింగ్స్, ఫస్ట్ వీక్ కలెక్షన్లు షేర్ అయ్యే ప్రమాదం వుంటుంది.
మామూలుగా అయితే బయోపిక్ ను పెద్దగా పట్టించుకోనక్కరలేదు. కానీ సమంత, దుల్హర్ సల్మాన్ నుంచి మోహన్ బాబు లాంటి సీనియర్ నటులు అందరూ వున్న సినిమా కావడం, పైగా మాయాబజార్ ఎపిసోడ్ ను రీ ప్రోడ్యూస్ చేయడం, పైగా సావిత్రి అంటే తెలుగు నాట మహిళలకు బాగా పరిచయం కావడం వంటివి ఆ సినిమాకు బజ్ తెచ్చాయి. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.