ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13 విడుదల అంటూ హడావుడి చేస్తోంది. కానీ టాలీవుడ్ లో ఎవరికీ ఆ డేట్ కు వస్తుందని నమ్మకాలు అయితే లేవు. లేదూ పక్కాగా వచ్చేస్తే బన్నీ-సుకుమార్ ల పుష్ప, కొరటాల-మెగాస్టార్ ఆచార్య సినిమాల పరిస్థితి ఏమిటి? వాటికి డేట్ లు ఎక్కడ? అన్నది లేటెస్ట్ డిస్కషన్ పాయింట్.
2022 సంక్రాంతిని ఇప్పటికే నాలుగు సినిమాలు రిజర్వ్ చేసుకున్నాయి. ఈ నాలుగూ కాకుండా నాగార్జున సినిమా కూడా ఒకటి వస్తుందని తెలుస్తోంది. 2021 దసరా ను ఆర్ఆర్ఆర్ తీసుకుంటే, ఇక ఆచార్య, పుష్ప పార్టీ వన్ కు డేట్ లు ఎక్కడ?
సంక్రాంతి దాటితే సమ్మర్ కు వెళ్లిపోవాలి. కానీ అది మరీ ఆలస్యం అయిపోతుంది. అందుకే డిసెంబర్ మూడోవారంలో విడుదల చేస్తే ఎలా వుంటుందని పుష్ప టీమ్ ఆలోచిస్తోంది. ఆచార్యకు మరే ఆప్షన్ మిగలలేదు.
ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న రావడానికి అవకాశాలు చాలా తక్కువ అని, అందుకే ఆ డేట్ కు రావాలని ఆచార్య ఆశపడుతోంది. కానీ ఒకటే సమస్య. ఆచార్య ఆశ కనుక నెరవేరి ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న విడుదల కాకపోతే సంక్రాంతి సినిమాల పీక మీదకు వచ్చినట్లే.
ఎందుకంటే ఆర్ఆర్ఆర్ కు మిగిలిన తరువాతి ఆప్షన్ అదే. అదే కనుక జరిగితే తుపాకీ శబ్ధం విని చెదిరిపోయిన పిట్టల్లా అయిపోతాయి సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటున్న అయిదు సినిమాలూ.