కనిపించని కలెక్షన్లు.. టాలీవుడ్ లో మళ్లీ నిరాశ

భ్రమలు తొలిగిపోయాయి, వాస్తవాలు కళ్లముందుకొచ్చి నిల్చున్నాయి. ఎదురుదెబ్బ తగులుతుందని భావించిన వ్యక్తుల అనుమానాలే నిజమయ్యాయి. సెకెండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న థియేటర్లు పెద్దగా ఆక్యుపెన్సీ చూపించలేకపోయాయి, వసూళ్లు రాబట్టలేకపోయాయి. ఇదేదో ఆంధ్రాకు మాత్రమే చెందిన…

భ్రమలు తొలిగిపోయాయి, వాస్తవాలు కళ్లముందుకొచ్చి నిల్చున్నాయి. ఎదురుదెబ్బ తగులుతుందని భావించిన వ్యక్తుల అనుమానాలే నిజమయ్యాయి. సెకెండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న థియేటర్లు పెద్దగా ఆక్యుపెన్సీ చూపించలేకపోయాయి, వసూళ్లు రాబట్టలేకపోయాయి. ఇదేదో ఆంధ్రాకు మాత్రమే చెందిన ముచ్చట కాదు, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి.

తిమ్మరుసు, ఇష్క్ సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో (ఏపీలో పాక్షికంగా) గ్రాండ్ గా థియేటర్లు ఓపెన్ అయ్యాయి. వీటితో పాటు మరో 3 సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చాయి. కానీ వేటికీ ఆక్యుపెన్సీ లేదు. భారీగా ప్రచారం చేసిన ఇష్క్ సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ రావడంతో, ఇవాళ్టి నుంచి వసూళ్లు/ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయాయి.

ఏ సినిమాకు ఎంతొచ్చింది?

ఇక తిమ్మరుసు సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ మూవీకి కూడా కలెక్షన్లు కష్టమే. కాకపోతే తిమ్మరుసు సినిమా ఆదివారం అందుకుంటుందని కొందరు ఆశిస్తున్నారు. తిమ్మరుసు సినిమాకు ఏపీ, నైజాంలో తొలి రోజు కేవలం 20 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. అటు ఇష్క్ సినిమాకు 15 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చినట్టు టాక్.

మొదటి రోజే ఇలా ఉంటే.. ఇక సినిమాలు పుంజుకోవడం కష్టమని ట్రేడ్ భావిస్తోంది. మరికొందరు మాత్రం వీకెండ్ అయిన ఈరోజు, రేపు పికప్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా? ఆగస్ట్ లో పెద్ద సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అనే విషయం సోమవారం నాటి పరిస్థితితో తేలిపోతుంది.

చిన్న సినిమాలు కాబట్టే రావడం లేదా..?

తిమ్మరుసులో సత్యదేవ్ హీరో. ఇష్క్ లో తేజ సజ్జ హీరో. ఇలా చిన్నహీరోలు నటించిన చిన్న సినిమాలు కాబట్టే వీటిని ప్రేక్షకులు పట్టించుకోలేదనే వాదన ఓ వర్గం నుంచి వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఓ పెద్ద సినిమా పడితే, థియేటర్లకు కళ వస్తుందని, ఆడియన్స్ లో ఊపు కనిపిస్తుందని జోస్యం చెబుతున్నారు. 

కానీ పిల్లి మెడలో గంట ఎవరు కడతారనే సామెతలా.. పెద్ద సినిమాలన్నీ థియేటర్లలోకి రావడానికి జంకుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఉప్పెన, జాతిరత్నాలు టైపులో ఓ సినిమా వచ్చి పెద్ద హిట్ అయితే తప్ప.. ఇండస్ట్రీలోని పెద్ద సినిమాల్లో కదలిక రాకపోవచ్చు. ఈ వారానికైతే అలాంటి ''జాతిరత్నం'' పడలేదు. వచ్చే వారం మరో ''ఉప్పెన'' వస్తుందేమో చూడాలి.  

ఏపీ ఎగ్జిబిటర్లకు ఊరట

గుడ్డిలో మెల్లలాగ ఉన్నంతలో ఇండస్ట్రీకి ఓ తీపి కబురు. అదేంటంటే.. ఏపీలో కర్ఫ్యూ ఎత్తేసిన తర్వాత టిక్కెట్ రేట్లు సవరిస్తారట. అంటే వకీల్ సాబ్ రిలీజ్ టైమ్ లో తగ్గిన టిక్కెట్ రేట్లను కాస్త పెంచుతారట. ఇదే కనుక జరిగితే అప్పుడు పెద్ద సినిమాలు ముందువరసలోకి వస్తాయేమో చూడాలి. ఏపీలో ఆగస్ట్ 14 వరకు కర్ఫ్యూ ఆంక్షల్ని పొడిగించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ఈ మేరకు సెకెండ్ షోలు మరోసారి రద్దయ్యాయి.

నిజానికి ఆగస్ట్ 6వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా మరోసారి థియేటర్లు మూసేయాలని ఆంధ్రా-సీడెడ్ ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. తగ్గించిన టికెట్ రేట్లను పెంచడానికి ప్రభుత్వం పెద్దగా చొరవ చూపని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అంతలోనే ఏపీ సర్కార్ నుంచి అనధికారికంగా సమాచారం వచ్చిందట. కర్ఫ్యూ ఎత్తేసిన తర్వాత రేట్లు సవరిస్తారనేది ఆ సమాచారం. దీంతో తెరిచిన థియేటర్లు కొనసాగించాలని నిర్ణయించారు. 

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాజాగా రిలీజైన సినిమాల బ్రేక్-ఈవెన్స్ గురించి మాట్లాడుకోవడం మరీ కామెడీగా ఉంటుందేమో.