తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న వాళ్లు కాలగర్భంలోకి కలిసిపోయారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు ఈ హెచ్చరిక జారీ చేశారు. ప్రత్యేకించి ఏపీ డీజీపీ, పోలీసులను చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ, తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
కొండపల్లి ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను అడ్డుకునేందుకు వెళ్లిన దేవినేని ఉమామహేశ్వరరావుపై దాడి చేశారని, ప్రతిగా ఆయనపైనే కేసులు పెట్టారంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.
మైనింగ్ కోసమంటూ, అరుదైన కొండపల్లి బొమ్మలను తయారు చేసుందుకు వాడే కలపను ఇచ్చే చెట్లను కొట్టి వేస్తున్నారని.. దీనిపై ఉమ ఫిర్యాదు చేశారని, అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆయనే వెళ్లారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మైనింగ్ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు.
దేవినేని ఉమ కుటుంబీకులకు చంద్రబాబు పరామర్శ నేపథ్యంలో ఆయన పెట్టిన శాపనార్థాలు హైలెట్ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారంటూ ఆయన శపించినంత పని చేశారు. అయినా ఈ శాపనార్థాలు పెట్టడం ఏమిటో, కాలగర్భంలో కలిసిపోవడం అంటే ఏమిటో! ఇంతకీ చంద్రబాబు ఏం చెప్పదలుచుకున్నారో!