అజ్ఞాత‌వాసి.. కాపీ సరిగా కొట్టిఉన్నా చాలు!

త్రివిక్రమ్ కు కాపీలు కొత్త కాదు. ప్రత్యేకించి ఫ్రెంచ్ సినిమాల నుంచి ఇన్ స్పైర్ అయ్యి సీన్లు రాసుకోవడం త్రివిక్రమ్ కు పెన్నుతో పెట్టిన విద్య. ఈయన విరచిత హిట్ సినిమాల్లో ఒకటి అయిన…

త్రివిక్రమ్ కు కాపీలు కొత్త కాదు. ప్రత్యేకించి ఫ్రెంచ్ సినిమాల నుంచి ఇన్ స్పైర్ అయ్యి సీన్లు రాసుకోవడం త్రివిక్రమ్ కు పెన్నుతో పెట్టిన విద్య. ఈయన విరచిత హిట్ సినిమాల్లో ఒకటి అయిన ‘చిరునవ్వుతో’లో సీన్లన్నీ ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ నుంచి అరువు తెచ్చుకున్నవే. నాజీల కాలంపై, వారి హింసపై వచ్చిన అద్భుతమైన సినిమాల్లో ఒకటి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలోని సరదా సీన్లన్నింటినీ త్రివిక్రమ్ అప్పట్లోనే దించేశాడు.

ఇక తర్వాత కూడా త్రివిక్రమ్ సినిమాల్లో కాపీ వాసన వస్తూనే ఉంటుంది. ఈ విషయంలో త్రివిక్రమ్ కు మొహమాటం లేదు. బయటి వాళ్లు కనుక్కొని.. అయ్యా కాపీ కొట్టావేంటి? అని ప్రశ్నించినా.. ఆయన వాటిని పట్టించుకోడు. ఇండియానా జోన్స్ వంటి సినిమాల నుంచి కూడా సీన్స్ ను ఇన్ స్పైర్ అయిపోతూ ఉంటాడు త్రివిక్రమ్. విదేశీ సినిమాలనే కాదు.. లోకల్ మేడ్ నవలలను కూడా త్రివిక్రమ్ వదల్లేదు.

మధుబాబు రాసిన ‘యముడు’ అనే నవల్లోని కొన్సి సీక్వెన్స్ లు అతడు సినిమాలో కనిపిస్తాయి. ఇక యద్ధనపూడి సులోచనా రాణి ‘మీనా’ను ‘అ..ఆ’ తీసేయడం.. ముందుగా ఆ విషయాన్ని టైటిల్ కార్డ్స్ లో వేయకుండా.. అంతా కనుక్కొన్నాకా.. మళ్లీ ఆమెకు క్రెడిట్ ఇవ్వడం త్రివిక్రమ్ ప్రత్యేకత. ఒకవైపు మేధావి అనిపించుకొంటూ.. మరోవైపు ఈ కాపీల వ్యవహారం ఏమిటో.. కాపీ కొట్టీ ఒరిజినల్ వాళ్లకు క్రెడిట్ ఇవ్వకుండా వ్యవహరించే ఈ పద్ధతి ఏమిటో అర్థం కాదు.

ఈ నేపథ్యంలో అజ్ఞాత‌వాసి కూడా ఫ్రెంచ్ సినిమానే అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు దీనిపై ఆ ఫ్రెంచ్ సినిమా దర్శకుడు కూడా స్పందించాడు. నిజంగానే కాపీ కొట్టి ఉంటే.. త్రివిక్రమ్ అండ్ కో ఈ సారి గట్టిగా బుక్ అయిపోయినట్టే. సినిమా హిట్టయ్యే మాట ఎలా ఉన్నా.. కాపీకి గానూ పరువును పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్నాళ్లూ చేసిన పనులు ఒక ఎత్తు.. ఇప్పుడు మరో ఎత్తు.

ఇక ఇప్పటికే చాలా మంది అజ్ఞాత‌వాసికి మూలం అనిపించుకుంటున్న ఫ్రెంచ్ సినిమాను చూసేశారు. వాళ్లంతా చెబుతున్నమాటేంటంటే.. సినిమా సూపర్, కాపీ కొట్టి ఉన్నా.. సొంత పైత్యం ఉపయోగించకుండా తీసి ఉంటే.. తెలుగులో కూడా హిట్ అవుతుంది అని. ఫ్రెంచ్ సినిమాకు కాపీ అయితే హిట్టు గ్యారెంటీ అని ఒరిజినల్ ను చూసిన వారు చెబుతున్నారు. కాపీ అయితే హిట్టు గ్యారెంటీ, కాపీ అయితే పరువు పోవడమూ గ్యారెంటీ.. ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదేనేమో!