150కోట్ల మార్కెట్ చేసేసారు అజ్ఞాతవాసి సినిమాను. జనసంక్షేమం, వగైరా కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ తన రెమ్యూని రేషన్ కానీ, తన మిత్రుడు త్రివిక్రమ్ రెమ్యూనిరేషన్ కానీ ఏమాత్రం తగ్గించుకోలేదు. పైగా సినిమా కోసం భారీగా ఖర్చుచేయించేసారు. తమ క్రేజ్ ను చూపించి సినిమాను 150కోట్ల రేంజ్ లో మార్కెట్ చేసేసారు. తాము హ్యాపీ, నిర్మాతలు హ్యాపీ. మరి ఇక బయ్యర్ల పరిస్థితి ఏమిటి?
అందుకే ఉభయ రాష్ట్రాల్లో 200రూపాయిల యూనిఫారమ్ రేటుకు అనుమతులు రప్పించాలని వ్యూహ రచన చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే నేల దగ్గర నుంచి బాల్కనీ దాకా రెండు వందల రూపాయిలే అన్నమాట. ఇది అనధికారికంగా ఆంధ్రలో ఎప్పటి నుంచో నడుస్తోంది. పెద్ద సినిమాలకు తొలివారం రద్దీని బట్టి వంద రూపాయిల యూనిఫారమ్ టికెట్ పెట్టేస్తారు. కొన్ని చోట్ల కోర్టు కేసులు అడ్డం పడతాయి. మరి కొన్ని చోట్ల అధికారులకు వారానికి పది నుంచి పాతికవేలు మామూళ్లు ఇచ్చి వ్యవహారం కానిస్తారు.
అయితే ఇటీవల పెద్ద సినిమాలు ప్రత్యేకంగా ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టి రేట్ల పెంపును అధికారికంగా తెచ్చి బయ్యర్లకు ఇస్తున్నాయి. ఇందుకోసం బయ్యర్లు ఎక్కడిక్కడ దరఖాస్తు చేస్తారు. ఓవరాల్ గా నిర్మాతలు, హీరోలు తమ పలుకుబడి వాడతారు. ఆంధ్రలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుమతి తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. బయ్యర్లకు భారీ రేట్లకు అమ్మినపుడే ఈ మేరకు హామీ ఇచ్చారని వినికిడి. అనుమతి వస్తుందని, అనుమతి రాకున్నా, అధికారులతో సమస్య రాకుండా తాము చూసుకుంటామని మౌఖికంగా చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.
మరోపక్క తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా ఈ విధమైన ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలో దిల్ రాజుకు మంచి పలుకుబడే వుంది. అందువల్ల ఆంధ్రలో పవన్ పలుకుబడి, తెలంగాణలో దిల్ రాజు పలుకుబడి కలిసి రెండు వందల యూనిఫార్మ్ రేటు రప్పిస్తే, ఇక ప్రేక్షకులు ఆనందంగా, రెండేసి వందలు ఇచ్చేసి, అజ్ఞాతవాసి చూసేందుకు రెడీ అయిపోవచ్చు.
మల్టీ ఫ్లెక్స్ లు ఇప్పటికే 150, 250వసూలు చేస్తున్నాయి. అందువల్ల సింగిల్ థియేటర్లు మాత్రం అలా వసూలు చేస్తే తప్పేమిటి అని పవన్ అభిమానులు వాదించవచ్చు. ఎంతైనా ఆ అభిమానమే కదా, పవన్ సినిమాలకైనా, రాజకీయాలకైనా పెట్టుబడి.