సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఉన్నట్లుండి చేసిన ఓ ట్వీట్ పై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 'ఈ మధ్య రంగస్థలం సెట్ కు వెళ్లానని, సుకుమార్ యూనిట్ నుంచి ష్యూర్ షాట్ హిట్ అని, దేవీశ్రీ ప్రసాద్ అధ్భుతమైన ట్యూన్ లు ఇచ్చాడని విన్నానని, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిజయాతీతో చేస్తున్న మాంచి ప్రయత్నం ఇది అంటూ గాల్లోకి లేపే ప్రయత్నం చేసాడు.
సుకుమార్ కోసం అయితే తమన్ ఈ ట్వీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత వరకు సుకుమార్ థమన్ తో ఓ సినిమా కూడా చేయలేదు. పైగా దేవీ అంటే సుకుమార్ కు ఆత్మ-పరమాత్మ లాంటి బంధం. మరి ఇప్పుడు అర్జెంట్ గా ఏ సందర్భమూ లేకుండా ఎందుకు ట్వీట్ చేసినట్లు? అది కూడా ఈరోజు వెళ్లి వచ్చి ట్వీట్ చేస్తే అది వేరు. ఆ మధ్య ఎప్పుడో వెళ్లాడంట.
దీని వెనుక సైరా వ్యవహారం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సైరా ఫస్ట్ టీజర్ కు థమన్ నే ఆర్ ఆర్ అందించాడు. తనే ఆ ప్రాజెక్టుకు మ్యూజిక్ డైరక్టర్ గా వుంటానని అనుకున్నాడు. కానీ ఎఆర్ రెహమాన్ సీన్లోకి వచ్చాడు. కానీ ఇటీవల రెహమాన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు థమన్ కు ఈ ప్రాజెక్టు చేయాలనివుంది. డైరక్టర్ సురేందర్ రెడ్డి ఎలాగూ థమన్ కు అనుకూలమే. ఎటొచ్చీ నిర్మాత రామ్ చరణ్ ఓకె అనాలి. అందుకోసమేనా ఈ ట్వీట్ బిస్కట్ అని అనుమానం.