కోట్లు కొల్ల గొట్టాలని ప్రతి సినిమాకు వుంటుంది. అయితే బడ్జెట్ ను బట్టి కనీసం ఇంత వస్తే చాలు, ఆపై ఎంత వచ్చినా అదృష్టమే అనుకుంటారు. ఇప్పుడు హీరో నితిన్ నిర్మాతగా మారి తీస్తున్న అఖిల్ సినిమాకు మినిమమ్ కలెక్షన్ టార్గెట్ మాత్రం కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. థియేటర్ ఖర్చులతో కలుపుకుని కనీసం 60 కోట్లకు పైగా షేర్ సాధించి తీరాలని తెలుస్తోంది.
ఈ సినిమా అమ్మకాలు జోరుగానే వున్నాయి. 55 కోట్లకు పైగా అమ్మకాలు టార్గెట్ అని తెలుస్తోంది. అంటే థియేటర్ ఖర్చులు కలుపుకుంటే కనీసం 60 కోట్లు వసూళ్లు సాధిస్తేనే, ఇటు బయ్యర్లయినా, అటు డిస్ట్రిబ్యూటర్లయినా గట్టెక్కేది. అమ్మకాల ద్వారా నిర్మాత నితిన్ గట్టెక్కేయచ్చు. కానీ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలి అంటే మాత్రం ఆ మాత్రం షేర్ రావాలి.
అయితే నితిన్ అండ్ కో మాత్రం అఖిల్ సినిమా బ్లాక్ బస్టర్ కావడం మాత్రమే కాకుండా, వంద కోట్లు వసూలు చేయాలని కోరుకుంటున్నారు. సినిమా హిట్ కొడితే వంద కోట్లు కష్టం కాదని శ్రీమంతుడు నిరూపించేసింది. అదే ఆశతో వున్నాడు నితిన్.
అయితే ఆ విషయం అలా వుంచితే 55 కోట్ల మేరకు అమ్మకాలు సాగించినా నితిన్ కు పెద్దగా లాభాలు ఏవీ వచ్చేయవని వినికిడి. ఎందుకంటే సినిమా నిర్మాణ వ్యయమే నలభై దాటేస్తోందట. సబ్జెక్ట్ అటువంటిది, పైగా ఎక్కడా రాజీ పడడం లేదు, దాంతో వినాయక్ తన భారీ తనానికి తగ్గట్టే సినిమా చేస్తున్నాడు. దీంతో ఖర్చు నలభై దాటేస్తోందని తెలుస్తోంది. ఖర్చు కు తగ్గ అమ్మాకాలు వుంటాయి కాబట్టి ఓకె. అలాగే అమ్మకాలకు తగ్గ షేర్ కూడా వుంటే అందరూ హాపీ.