అదిగో హీరో అంటే ఇదిగో డైరక్టర్..అల్లదిగో సినిమా అన్నట్లుంది ఈ మధ్య వ్యవహారం. ఏదో మొత్తం మీద మూడో సినిమా మొదలెట్టాడు అఖిల్. అప్పుడే నాలుగో సినిమా అదిగో అంటున్నారు. గోపీమోహన్ కథకుడు, దర్శకుడు, పివిపి నిర్మాత అని కూడా డిసైడ్ చేసేసారు. కానీ దీని వెనుక ఓ గమ్మత్తయిన విషయం వుందని తెలిసింది. సినిమాలోనే కాదు, సినిమా వెనుక కూడా ఒక్కోసారి ఫన్ పండుతుంది.
ఎవరు పడితే వాళ్లు కథ చెబుతామంటే హీరోలు వింటారా? దానికో లెక్క వుండాలి. రైటర్ గోపీ మోహన్ కు దర్శకుడు కావాలన్నది చిరకాల కోరిక. ఎందరో రైటర్లు దర్శకులు అయిపోయారు కానీ, ఆయనకు సాధ్యం కావడం లేదు. సరే, లేటెస్ట్ గా అఖిల్ కు కథ చెబుతా అన్నారట. కానీ ఒకంతట అక్కడ నుంచి సమాధానం రావడం లేదట. అడగ్గా..అడగ్గా, ముందు ప్రొడ్యూసర్ ఎవరో చెప్పమను అని అట్నుంచి క్వశ్చను వచ్చినట్లు తెలుస్తోంది.
ఎవరో ఒకరి పేరు చెప్పాలి. దాంతో నిర్మాత పివిపిని అడిగితే, సరే, దాందేవుంది. కథ చెప్పి ఒప్పిస్తే, అలాగే చేద్దాం అనే టైపులో కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. సో, నిర్మాత పివిపి అని కబురు ఈసారి అఖిల్ కు వెళ్లిందట. అప్పుడు, సరే ఖాళీగా వున్నపుడు కథ వింటా అన్నాడట అఖిల్.
అదీ జరిగింది. ఇప్పడు అఖిల్ చూస్తే యూరప్ లో షూటింగ్ లో బిజీ. అక్కడ నుంచి రావాలి. కథ వినాలి. నచ్చాలి. ఒకె అనాలి. గోపీ మోహన్ ను కథ వరకు ఓకె అంటారో? డైరక్షన్ కు కూడా ఓకె అంటారో చూడాలి. ఆపైన సినిమా పక్కా కావడం అన్నది. ఇంత వ్యవహారం వుంది. కానీ అప్పుడే అఖిల్ నాలుగో సినిమా డైరక్టర్ గోపీ మోహన్ అని వార్తలు వచ్చేసాయి. అక్కడే హీరోలు హర్ట్ అయ్యేది. మరి ఇప్పడు అఖిల్ ఏమంటాడో?