కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. చావోరేవో తేల్చే సినిమా. అలాంటి సినిమాపై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఆ జాగ్రత్తలు సెట్స్ పైకి వచ్చిన తర్వాత తీసుకుంటే ఎలా ఉంటుంది. సరిగ్గా అఖిల్ మూడో సినిమా అలానే ఉంది. ఇప్పుడీ సినిమా క్రియేటివ్ క్లాషెష్ తో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒకదశలో మూవీ ఆగిపోతుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
వెంకీ అట్లూరి.. ఒక్క సినిమా మాత్రమే చేసిన అనుభవం. ఇక అఖిల్ సంగతి తెలిసిందే. 2 సినిమాల హీరో ఇతడు. కాకపోతే చేసిన ఒక్క సినిమాతో వెంకీ అట్లూరి హిట్ అందుకున్నాడు. అఖిల్ మాత్రం చేసిన 2 సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్నాడు. సరిగ్గా ఇక్కడే వ్యవహారం తేడా కొడుతోంది.
కథాపరంగా వెంకీ అట్లూరి చెబుతున్న నెరేషన్ అఖిల్ కు నచ్చడంలేదట. తనకు తోచిన మార్పులేవో సూచిస్తున్నాడు. ఆ మార్పులు వెంకీకి నచ్చడంలేదట. దీంతో ఒకే సీన్ ను 2-3 రకాలుగా చేసుకుంటూ పోతున్నారు. ఫైనల్ వెర్షన్ లో ఎడిటింగ్ టేబుల్ పై ఏది ఉంచుతారనేది దైవాధీనం.
అయినా ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. 2రోజుల పాటు అఖిల్ షూటింగ్ కు వెళ్లలేదట. కారణం కథలో వెంకీ చేసిన మార్పులే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యూనిట్ లో కీలకమైన పొజిషన్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తి మరో వ్యక్తితో చేస్తున్న వాట్సాప్ ఛాటింగ్ ద్వారా ఈ విషయం కాస్తా బయటకు పొక్కింది.
యూనిట్ లో మొదలైన ఈ ముసలం, చివరికి ఎటువైపు దారితీస్తుందో చూడాలి. మరోవైపు వీళ్లిద్దరి కంటే ఎంతో సీనియర్ అయిన ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాడట.