అక్కినేని జీవించి వుండగానే తన పేరిట ప్రవేశ పెట్టిన ప్రతిష్టాత్మక అవార్డు అక్కినేని అవార్డు. ఈ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు వ్యక్తి నటి అంజలీ దేవి. మిగిలినవన్నీ పక్క భాషల వారికే. ఈ అవార్డు అందుకున్న వారి వివరాలు పరిశీలిస్తే కొన్ని చిత్రాలు బయటపడతాయి. ఇంతవరకు నటనలో ఈ అవార్డు అందుకున్న నటుడు ఒక్క దేవానంద్ మాత్రమే. అలాగే దర్శకులు బాలచందర్, శ్యామ్ బెనగల్.
మిగిలన అవార్డు గ్రహీతలంతా మహిళలే. శ్రీదేవి, హేమమాలిని, వైజయంతిమాల బాలి, లతామంగేష్కర్, షబన ఆజ్మి. ప్రభుత్వం అవార్డుల్లో వివక్ష చూపిస్తే, తెలుగులో అర్హులే లేరా అంటూ మనవాళ్లు కస్సుమంటారు. మరి అక్కనేని అవార్డుకు అర్హులు తెలుగులో ఇన్నాళ్లు ఎవరూ లేరా. బాలచందర్ పాటి చేయలేకపోయాడా మన కళా తపస్వి విశ్వనాథ్? శ్రీదెవి పాటి చేయలేకపోయిందా సహజనటి జయసుధ. దాసరి నారాయణ రావు, సింగీతం శ్రీనివాసరావు, ఎటువంటి దర్శకులు. అంతెందుకు ఎఎన్నార్ తో ఎన్నో మంచి సినిమాలు తీసిన దర్శకుడు బాపు సంగతేమిటి?
ఇలా చూసుకుంటే ఎందరు మహామహులు మనదగ్గర వున్నారు. కానీ వీరంతా ఇన్నాళ్లు అక్కినేని అవార్డు కమిటీ దృష్టికి ఎందుకు రాలేదో? బహుశా వచ్చే ఏడాది రాఘవేంద్రరావుకు ఇచ్చి, ఇదిగో తెలుగువాడికి ఇచ్చామంటారేమో? ఎలాగూ ఆయన నాగ్ కు ఆప్తుడు కదా. రెండు పనులు అయినట్లు వుంటుంది. ప్రతిభను ప్రభుత్వం గుర్తించలేదని ఇక మనం వాపోనక్కరలేదు. ఎందుకంటే మనం కూడా గుర్తించం కదా.