ఒకవైపు కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ ల వివాహం నేపథ్యంలో… కత్రినా మాజీ ప్రియుడు రణ్ భీర్ కపూర్ కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నాడనే వార్తలు వచ్చాయి. కత్రినాతో బ్రేకప్ తర్వాత అలియాభట్ సాంగత్యంలో సేదతీరుతున్న రణ్ భీర్ ఆమెనే వివాహం చేసుకోనున్నాడనే మాట వినిపిస్తూ ఉంది.
గతంలో కత్రినాను కూడా రణ్ భీర్ పెళ్లి చేసుకోనున్నాడనే ప్రచారం జరిగింది. అయితే అప్పుడు వారి పెళ్లి జరగలేదు. మరి అలియాను అయినా అతడు పెళ్లి చేసుకుంటాడా? అనేది సందేహమే. అయితే రణ్ భీర్ కు పెళ్లి చేయాలని అతడి తండ్రి గట్టిగా ప్రయత్నించాడని, రణ్ భీర్ తల్లి కూడా ధ్రువీకరించారు ఆ మధ్య. ఇప్పుడు రణ్ భీర్ తండ్రి భౌతికంగా లేరు. ఏతావాతా రణ్ భీర్ కు పెళ్లి చేయాలని అతడి ఇంట్లో వాళ్లకైతే ఉందని స్పష్టం అవుతోంది.
ఇలాంటి క్రమంలో అలియాతో రణ్ భీర్ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమనే మాట వినిపిస్తోంది. అలియా కెరీర్ కూడా ఇప్పుడు పీక్స్ లో ఉంది. సినిమాకు ఏడెనిమిది కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ తో ఫుల్ బిజీగా ఉంది. సోలోగా కూడా తనే ప్రధాన పాత్రల్లో సినిమాలు చేయగలుగుతోంది. ఇలాంటి సమయంలో పెళ్లికి ఆమె సై అంటుందా? అనేది కొశ్చన్ మార్కే. కొంతలో కొంత మార్పు ఏమిటంటే.. బాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లైన హీరోయిన్లకు కూడా అవకాశాలకు కొదవలేదు. దీంతో అలియాభట్ పెళ్లికి సిద్ధంగా ఉండవచ్చు!
అయితే.. ఇలా ఇద్దరూ రెడీ అయినా.. వీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పద్ధతికి మాత్రం అడ్డంకులున్నాయి. విదేశంలో డిస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనేది వీరి ఆలోచనట. దానికి ఇప్పుడు పలు అడ్డంకులున్నట్టే. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భారీ ఎత్తున అతిథులను విదేశాలకు తీసుకెళ్లడం తేలిక కాదు. వీరు అన్ని ఏర్పాట్లూ చేసినా.. విదేశానికి అంటే కొంతమంది అతిథులు వెనుకడుగు వేయవచ్చు. పిలిచిన వాళ్లంతా పెళ్లికి వస్తారనే నమ్మకాలు లేవు.
అందుకే ఇప్పుడు తమ పెళ్లి ప్లాన్ ను వాయిదా వేసుకున్నారట అలియా, రణ్ భీర్. ముందుగా అనుకున్న ప్రకారం అయితే వచ్చే ఏడాది ఆరంభంలోనే వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారట. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తి సానుకూలంగా లేకపోవడంతో వివాహాన్ని వచ్చే ఏడాది చివరి వరకూ వాయిదా వేసినట్టుగా సమాచారం. 2022 చివర్లో.. సానుకూల పరిస్థితుల మధ్యన విదేశంలో డిస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారట ఈ హీరో, హీరోయిన్!