జ‌గన్ జీవో..లెక్క చేసేదెవరు?

జ‌గన్ అంటే అధికారులు భయపడిపోతున్నారు. జ‌గన్ అంటే ఫ్యాంట్ తడిపేసుకుంటున్నారు అంటూ ఎల్లో మీడియా వార్తలు. జ‌గన్ కు చెబుతా..జ‌గన్ కు వివరిస్తా అంటూ మంత్రి వినయపూర్వక వచనాలు. జీవో 35 అమలు చేస్తున్నామంటూ…

జ‌గన్ అంటే అధికారులు భయపడిపోతున్నారు. జ‌గన్ అంటే ఫ్యాంట్ తడిపేసుకుంటున్నారు అంటూ ఎల్లో మీడియా వార్తలు. జ‌గన్ కు చెబుతా..జ‌గన్ కు వివరిస్తా అంటూ మంత్రి వినయపూర్వక వచనాలు. జీవో 35 అమలు చేస్తున్నామంటూ అధికారులు కోర్టుకు చెప్పిన వైనం. 

అన్నీ అలాగే వున్నాయి. కానీ టికెట్ రేట్లు పాత రేట్లే అమ్మేస్తున్నారు. ఇంకా చిత్రం ఏమిటంటే విడుదల కాబోతున్న అఖండ సినిమాకు అప్పుడే అధికారికంగా తెల్లవారు ఝామున ఫ్యాన్స్ షోలు, స్పెషల్ షో లు అంటూ టికెట్ లు అమ్మేస్తున్నారు.

స్పెషల్ షో లు అంటే ఛారిటీకి మాత్రమే అని చెప్పిన మంత్రి నాని మాటలు ఏమయ్యాయో? సిఎమ్ మాట, ప్రభుత్వ జీవో అంటే అంత ఖాతరు లేకపోవడం ఏమిటో? ఆంధ్రలో టికెట్ రేట్లు పెంచడం లేదన్న నింద మాత్రమే జ‌గన్ మీద మిగిలింది. కానీ కింది స్థాయిలో అవినీతి విశృంఖలంగా పెరిగిపోయింది.

ఆంధ్రలోని ఓ కీలక ఏరియాలోని మూడు జిల్లాల సంబంధిత అధికారులకు సినిమా సినిమాకు ప్యాకేజీలు ఇచ్చే పద్దతిని సినిమా రంగంలోని ఓ కింగ్ పిన్ డిస్ట్రిబ్యూటర్ అలవాటు చేసేసినట్లు తెలుస్తోంది. దాంతో ఏ రేటు అమ్ముకున్నా, ఏ షో వేసుకున్నా అడిగే నాధుడే లేడు. 

మంత్రి పేర్ని నాని పలువురు డిస్ట్రిబ్యూటర్ల ముందు బాహాటంగానే హామీ ఇచ్చేసారు, జీవోను అమలు చేయమని ఇబ్బంది పెట్టమని చెప్పారని ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటున్నారు.

అంతా బాగానే వుంది. అందరూ కలిసి డబ్బులు చేసుకుంటున్నారు. కానీ సినిమా రంగాన్ని ఇబ్బందిపెడుతున్నారు జ‌గన్ అన్న మాట మాత్రం మిగిలిపోతోంది.