హీరోల సందేశాలు సినిమాల వరకే పరిమితం. తమ సినిమాల్లో తాము ఇచ్చే సందేశాలను తాము కూడా ఆచరించరు సదరు హీరోలు. సినిమాల్లో చాలా గొప్ప గొప్ప విషయాలను చెప్పే హీరోలు వాస్తవంలో వాటిని తామే పట్టించుకోరు. సినిమాలు సినిమాలే, బయట మామూలే అన్నట్టుగా ఉంది హీరోల కథ. దీనికి స్టార్ హీరోలు మినహాయింపు కాదు. ఇప్పటికే అల్లుఅర్జున్ ఈ రకంగా దొరికిపోయాడు. తన తాజా సినిమా 'నా పేరు సూర్య..'లో ఇండియా ఒకటే అని చాటి చెప్పిన ఈ హీరో, తన ట్విటర్ అకౌంట్లో మాత్రం తనను తాను సౌతిండియన్ యాక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు.
సినిమాల్లోనే సౌతిండియా, నార్తిండియా అంటూ వేర్వేరు లేవని చెప్పుకొచ్చిన ఈ హీరో తనను మాత్రం సౌతిండియన్‌గా వేరు చేసుకున్నాడు. నా పేరు సూర్య టీజర్ వచ్చాకా ఈ విషయంలో అల్లుఅర్జున్‌పై నెటిజన్ల పంచ్‌లు పడ్డాయి.చెప్పడానికేనా నీతులు ఉన్నది? అని నెటిజన్లు కడిగేశారు. ఇక ఇదే జాబితాలో చేరాడు మహేశ్ బాబు కూడా. ఈ హీరో తన తాజా సినిమాలో గవర్నమెంట్ స్కూల్స్ ఆవశ్యకత గురించి చెప్పాడు.
ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ పాఠశాలలను బతికించడానికి ఏం చేయాలో చెప్పాడు. సినిమాలో అయితే చేసి చూపించాడు. ప్రైవేట్ స్కూల్స్ వ్యాపారం దందాపై సినిమాలో విరుచుకుపడ్డాడు. కట్ చేస్తే.. తాజాగా వచ్చిన విద్యార్థుల ఫలితాల్లో ప్రేవేట్ స్కూల్స్ వాళ్లు మహేశ్ బాబును తెగ వాడేసుకుంటున్నారు. పెయిడ్ కార్యక్రమంగానో వెళ్లాడో ఎందుకు వెళ్లాడో కానీ.. కొన్ని కార్పొరేట్ కాలేజీల విద్యార్థులతో మహేశ్ ఫొటోలు ఆ కాలేజీల యాడ్స్‌లో కనిపిస్తున్నాయి.
ర్యాంకర్ స్టూడెంట్లకు మహేశ్ బొకేలు ఇచ్చిన ఫొటోలు కాలేజీల యాడ్స్‌లో కనిపిస్తున్నాయి. మహేశ్‌కు డైరెక్టుగా ఈ వ్యవహారంతో సంబంధం ఉందో లేదో తీవ్రంగా విమర్శలపాలయ్యే కార్పొరేట్ కాలేజీల యాడ్స్‌లో మహేశ్ కనిపించడం మాత్రం విడ్డూరం.