అనిరుధ్ రామచంద్రన్ – తమిళనాట యువ సంగీత సంచలనం. కానీ తెలుగునాట సక్సెస్ కాలేకపోతున్నాడు. అజ్ఞాతవాసి, జెర్సీ సినిమాల తరువాత నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా టేకప్ చేసాడు. అయితే అనిరుధ్ దగ్గర వున్న పెద్ద సమస్య టైమ్ కు ట్యూన్ లు అందివ్వకపోవడమే అని టాలీవుడ్ టాక్. అందుకే అనిరుధ్ ను పెట్టుకోవడానికి పెద్ద సినిమాల డైరక్టర్లు, నిర్మాతలు జంకుతున్నారు.
గ్యాంగ్ లీడర్ సినిమాకు కూడా జస్ట్ ఒక్క ట్యూన్ ఇచ్చి ఊరుకున్నాడు అనిరుధ్ అని తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాలో పాటలు తక్కువే. మూడు పాటలు మాత్రమే వుంటాయని తెలుస్తోంది. మహా వుంటే మరో ప్రమోషన్ సాంగ్ (సినిమాలో వుండదు) మాత్రం వుంటుంది.
కానీ ఈ నాలుగు ట్యూన్ లకే ఒక్కటి మాత్రం ఇచ్చి, మిగిలినవి బకాయి పెట్టాడని టాక్ వినిపిస్తోంది. ట్యూన్ ఇస్తే పాట రాయించుకుని, చేయించుకోవడం ఒక్కటి మాత్రమేకాదు. చిత్రీకరణ కూడా వుంటుంది. దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ విషయంలో టెన్షన్ పడుతున్నారని, ఇప్పటికే విడుదల డేట్ ప్రకటించేసినందున, సకాలంలో సినిమా ఫినిష్ చేయాలని ఆయన కిందా మీదా అవుతున్నారని తెలుస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో అనిరుధ్ ట్యూన్ లు ఇంకా రాకపోవడం అంటే కాస్త ఇబ్బందికర పరిస్థితే.