మొత్తానికి టాలీవుడ్ లో తొలి తెలంగాణ స్టూడియోకి శ్రీకారం చుట్టినట్లు అయింది. దర్శకుడు ఎన్ శంకర్ కు స్టూడియో నిర్మాణానికి గాను అయిదు ఎకరాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో చలనచిత్ర పరిశ్రమ ఇన్ ఫా స్ట్రక్చర్ అంతా ఆంధ్ర ప్రాంత వాసులదే అనే విమర్శ విభజన ఉద్యమ సమయంలో వినిపించింది.
విభజన తరువాత కేసిఆర్ కూడా రామోజీ ఫిలిం సిటీ సమీపంలోని రాచకొండ గుట్టల్లో వందలాది ఎకరాల స్థలంలో ఫ్రభుత్వ స్టూడియో నిర్మిస్తామని ప్రకటించారు. కొన్నాళ్లు సర్వే కూడా చేసారు. ఆ తరువాత కేసిఆర్ వెళ్లి రామోజీని కలిసారు. ఆపై ఇక స్టూడియో వ్యవహారం మరి ముందుకు సాగలేదు. ఆ తరువాత దాని గురించి వార్తలు కూడా వినిపించలేదు.
ఇన్నాళ్ల తరువాత ఓ స్టూడియో నిర్మాణం మళ్లీ వార్తల్లోకి రావడం ఇదే ప్రథమం. దర్శకుడు ఎన్ శంకర్ తెలంగాణ ఉద్యమ పోరాటానికి తన వంతు సాయం అందించారు. ఓ సినిమా కూడా తీసారు. ఆయన స్టూడియో నిర్మాణానికి భూమి కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇన్నాళ్లకు దానికి కదలిక వచ్చింది. ఇండియన్ బిజినెస్ స్కూలు సమీపంలో ఈ స్టూడియో నిర్మాణం జరిగే అవకాశం వుందని తెలుస్తోంది.