అచ్చ తెలుగ‌మ్మాయీ… ఎందుకా ప‌రాయి భాష బ‌డాయి

తెలుగు రానివాళ్లు, ఆంగ్ల భాష‌తో దాన్ని సంక‌రం చేసి కర్ణక‌ఠోరంగా వినిపించేవాళ్ల‌ని హీరోయిన్లుగా ఒప్పుకోక త‌ప్పని ప‌రిస్థితి తెలుగు ప్రేక్షకుల‌ది. సినిమాల్లో అంటే డ‌బ్బింగ్ ఆర్టిస్టులు మ‌నల్ని ర‌క్షిస్తార‌నుకోండి. కాని ప్రమోష‌న్ కోసం కోకొల్లలుగా…

తెలుగు రానివాళ్లు, ఆంగ్ల భాష‌తో దాన్ని సంక‌రం చేసి కర్ణక‌ఠోరంగా వినిపించేవాళ్ల‌ని హీరోయిన్లుగా ఒప్పుకోక త‌ప్పని ప‌రిస్థితి తెలుగు ప్రేక్షకుల‌ది. సినిమాల్లో అంటే డ‌బ్బింగ్ ఆర్టిస్టులు మ‌నల్ని ర‌క్షిస్తార‌నుకోండి. కాని ప్రమోష‌న్ కోసం కోకొల్లలుగా ఇచ్చే టివి ఇంట‌ర్వ్యూలు, ఆడియో ఫంక్షన్ల‌లో వీరి మాట‌లు విన‌లేక ఏం చేయాలో తెలీక నిట్టూరుస్తున్నారు తెలుగు భాషాభిమానులు. 

అంత‌కు మించి భ‌య‌పెట్టే విష‌యం ఏమిటంటే… స‌ద‌రు సంక‌ర‌భాష‌నే విని  విని ఆ హీరోయిన్లను ఆరాధించే పిల్లలు సైతం ఓహో ఇదేనేమో తెలుగంటే అనుకుని అలాగే మాట్లాడ‌డం.,, ఇలాంటి ప‌రిస్థితుల్లో అంజ‌లి ఇటీవ‌ల కొన్ని ప్రెస్‌మీట్లులో మాట్లాడిన‌ప్పుడు అది విని కొంద‌రు భాషాభిమానులు మ‌ళ్లీ నిట్టూర్చారు. అంజలి కూడా అదే ర‌కంగా సంక‌ర భాషను ప‌లికించ‌డ‌మే వారి నిట్టూర్పుల‌కు కార‌ణం. 

ఈమె తెలుగ‌మ్మాయే క‌దా… అచ్చమైన  ఆంధ్రప్రదేశ్‌లోని రాజోలు నుంచి వ‌చ్చిందే క‌దా. చ‌క్కని తెలుగులో మాట్లాడితే ఎవ‌రైనా త‌ప్పు ప‌డ‌తారా? ప‌దానికి ప‌దానికి మ‌ధ్యన అండ్‌లు, వాక్యానికి అటూ ఇటూ లైక్‌లు జ‌త చేయ‌డం, మ‌ధ్య మ‌ధ్యలో ఇంగ్లీషు వాక్యాలు అర‌కొర‌గ ద‌ట్టించ‌డం… ఈ పైత్యమంతా ఎందుకో అర్ధం కాలేదు. పైగా త‌నేమీ ఉన్నత చ‌దువుల కోసం విదేశాలో మ‌రొక‌టో తిరిగొచ్చిన బాప‌తూ కాదు. మ‌రెందుకా తెచ్చిపెట్టుకున్న జంఝాటం…

తెలుగ‌మ్మాయి కావ‌డం మాత్రమే కాదు అంతే చ‌క్కగా ఉంటుంద‌నే అంజ‌లిని అభిమానించేవాళ్లున్నారు. ఇక‌నైనా… అన‌వ‌స‌రమైన ప్ర”యాస‌”ల‌తో ఆయాస‌ప‌డ‌డం వ‌ల్ల అటువంటి వారి అభిమానాన్ని చేజేతులా పోగొట్టుకోవ‌డం త‌ప్ప అంత‌కు మించి సాధించేది ఏమీ ఉండ‌ద‌ని మ‌న రాజోల‌మ్మాయి గుర్తిస్తుంద‌ని ఆశిద్దాం.