అప్పుడు ‘మధుర’మే.. ఇప్పుడు చేదు

మధుర శ్రీధర్.. అభిరుచి గల నిర్మాత. మంచి సినిమాలు తీయాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు కానీ సరైన ఆర్ధిక విజయాలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో, దొరసాని సినిమాకు సరైన పాజిటివ్ సమీక్షలు రాలేదన్న ఫ్రస్టేషన్…

మధుర శ్రీధర్.. అభిరుచి గల నిర్మాత. మంచి సినిమాలు తీయాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు కానీ సరైన ఆర్ధిక విజయాలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో, దొరసాని సినిమాకు సరైన పాజిటివ్ సమీక్షలు రాలేదన్న ఫ్రస్టేషన్ ఏమో, సమీక్షకుల మీద కాస్త గట్టి విమర్శలే చేసారు. ప్రేక్షకుల కోసం సినిమా తీయాలో? సమీక్షకుల కోసం సినిమా తీయాలో అర్థంకావడం లేదు. పెద్ద సినిమాలు తీయలేము, వైవిధ్యమైన చిన్న సినిమాలు తీస్తే ప్రోత్సాహం లభించడం లేదు అని ఆయన తెగ బాధపడ్డారు.

కానీ ఆయన మరిచిపోయారేమో? ఆయన భాగస్వామ్యం వున్న పెళ్లిచూపులు సినిమాను సమీక్షకులే భుజాన మోసారన్నది. సినిమా విడుదలకు ముందే వరుసగా షోలు వేస్తే, సమీక్షకులు చూసి, ముందే సోషల్ మీడియాలో విపరీతగా దానికి హైప్ తీసుకువచ్చారు.

అంతేకాదు, గత నెలరోజుల్లో విడుదలైన గేమ్ ఓవర్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మల్లేశం, బ్రోచేవారెవరురా సినిమాలకు సమీక్షకులు ప్రశంసలు కురిపించారు కదా? అవన్నీ చిన్న సినిమాలే కదా? మరి మధుర శ్రీధర్ ఇలా మాట్లాడతారేమిటి? సినిమాకు మంచి సమీక్షలు రాలేదన్న బాధ వుండొచ్చు. కానీ అన్నీతెలిసిన, మీడియాతో సదా స్నేహం చేసే మధుర శ్రీధర్ లాంటి వాళ్లు కూడా చటుక్కున బరస్ట్ అయిపోకూడదు.

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?