Advertisement

Advertisement


Home > Politics - Gossip

పరిటాల సునీతకు కోరుకున్నది దక్కింది.. ఉంటారా?

పరిటాల సునీతకు కోరుకున్నది దక్కింది.. ఉంటారా?

ఇటీవలి ఎన్నికలకు ముందువరకూ కూడా పరిటాల ఫ్యామిలీ ధర్మవరం నియోజకవర్గం విషయంలో చాలా తపించిపోయింది! తమకు ధర్మవరం నియోజకవర్గం బాధ్యతలు కావాలని అంటూ చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైన ఒత్తిడినే తీసుకువచ్చారు పరిటాల సునీత. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జి పదవి తమకు కావాలంటూ బాహాటంగానే వారు ప్రకటనలు చేస్తూ వచ్చారు. చంద్రబాబును కలిసి ఆ విన్నపాన్ని చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో అప్పటికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉండిన వరదాపురం సూరిని ముప్పుతిప్పలు పెట్టారు పరిటాల వర్గీయులు.

అప్పటికి సునీత రాప్తాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండేవారు. తన తనయుడికి మరో నియోజకవర్గం టికెట్‌ కావాలంటూ ఆమె ధర్మవరం నియోజకవర్గాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. తన భర్త పరిటాల రవి ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టారని, అక్కడ పార్టీ ఉనికి ఉందంటే అది పరిటాల రవి వల్లనే అని ఆమె చెప్పుకున్నారు. కాబట్టి తమ రాజకీయ వారసుడి కోసం చంద్రబాబు నాయుడు ధర్మవరం నియోజకవర్గం టీడీపీ బాధ్యతలను అప్పగించాలని కోరుతూ వచ్చారు.

ఆఖరికి యూట్యూబ్‌ చానళ్ల ఇంటర్వ్యూల్లో కూడా ఆమె ధర్మవరం గురించి అడగటాన్ని ఆపలేదు. వరదాపురం సూరితో ఆమె వర్గం చాలా గొడవలు పడింది. దీంతో పంచాయితీ చంద్రబాబు వద్దకు చేరింది. వారికి చంద్రబాబు సర్ధిచెప్పారు. పరిటాల ఫ్యామిలీని రాప్తాడుకు పరిమితం చేశారు.

ఎటు తిరిగీ తను పోటీచేయాల్సిందే అంటూ పట్టుబట్టి పరిటాల శ్రీరామ్‌ తన తల్లికి దక్కాల్సిన టికెట్‌ను తను సొంతం చేసుకున్నాడు. రాప్తాడు నుంచినే బరిలోకిదిగాడు. వేరే నియోజకవర్గం బాధ్యతలు ఏవీ దక్కకపోవడంతో రాప్తాడులోనే తనయుడిని బరిలోకి దించింది సునీత. తీరా అక్కడ శ్రీరామ్‌ బొక్కబోర్లా పడ్డాడు. ప్రకాష్‌ రెడ్డి రాప్తాడులో ఘన విజయం సాధించాడు. శ్రీరామ్‌ పొలిటికల్‌ ఎంట్రీలోనే అలా చిత్తు అయ్యాడు.

రాప్తాడు చాలదంటూ మరో నియోజకవర్గం బాధ్యతలు కూడా కోరిన పరిటాల కుటుంబం చివరకు రాప్తాడులోనే చిత్తు అయ్యింది. ఇక మరోవైపు ధర్మవరంలో వరదాపురం సూరి కూడా ఓటమి పాలయ్యాడు. ఆయనా ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయాడు. భారీ మెజారిటీని ప్రత్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి అప్పగించి ఓడిపోయాడు వరదాపురం సూరి.

అలా తను ఓడిపోవడం, తన పార్టీ ఓడిపోవడంతో.. వరదాపురం సూరి లేట్‌ ఏమీలేకుండా పార్టీ మారాడు. భారతీయ జనతా పార్టీ నేత అయిపోయాడు ఆయన. భారీఎత్తున రోడ్డు కాంట్రాక్టు పనులు చేసి ఉండటం, వాటిల్లో అక్రమాలు చోటు చేసుకుని ఉండటంతో.. వరదాపురం వాటి నుంచి బయటపడటానికి బీజేపీలోకి చేరారు అనేది బహిరంగ రహస్యమే.

అలా ధర్మవరంలో తెలుగుదేశం పార్టీకి ఇన్‌చార్జి లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ ధర్మవరం బాధ్యతలు కావాలంటూ తెగ ఉవ్విళ్లూరిన పరిటాల కుటుంబానికే అవి దక్కాయి. అయితే ఇప్పుడు అవి బాధ్యతలు కాదు, భారం! పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అలాంటివి అన్నీ కావాలని అనిపిస్తాయి ఎవరికైనా. పార్టీ చేతిలో అధికారం లేకపోతే పార్టీ పదవులు అన్నీ భారమే అనిపిస్తాయి నేతలకు. ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోవాలి. ఆపై ధర్మవరం కూడా పరిటాల కుటుంబానికే అప్పగించారట చంద్రబాబు నాయుడు. మరెవరూ గతిలేకపోవడంతో పరిటాల కుటుంబానికే ధర్మవరం పగ్గాలు ఇచ్చారు.

ఇలా ఎట్టకేలకూ పరిటాల సునీత కోరింది జరిగింది. ధర్మవరం నియోజకవర్గం వారి చేతికే దక్కింది. ఇక ఆ నియోజకవర్గంలో ఎంతైనా దున్నుకోవచ్చు! అయితే పరిటాల కుటుంబమే ఇప్పడు బీజేపీ వైపు చూస్తూ ఉందనే టాక్‌ వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్ల ఇక పెద్దగా ప్రయోజనం లేదన్న లెక్కలు, ఆస్తులు కాపాడుకోవాల్సిన నేపథ్యంలో ఈ ఫ్యాక్షన్‌ ఫ్యామిలీ కూడా బీజేపీలోకి చేరబోతోందనే ఊహాగానాలున్నాయి!

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?