సినిమా సూపర్ హిట్ అయింది. యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కానీ శాటిలైట్ రైట్స్ విషయానికొచ్చేసరికి మాత్రం అర్జున్ రెడ్డి ఇబ్బంది పడుతున్నాడు. హిట్ సినిమాల్ని ఎగబడి కొనే ఎంటర్ టైన్ మెంట్ చానెల్స్.. అర్జున్ రెడ్డి విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నాయి. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి.
అర్జున్ రెడ్డి సినిమాకు 2కోట్లు లేదా 3కోట్లు పెట్టి శాటిలైట్ రైట్స్ తీసుకోవడం ఏ ఛానెల్ కు పెద్ద ఇబ్బంది కాబోదు. కాకపోతే ఇప్పటికే బోల్డ్ మూవీగా పేరుతెచ్చుకున్న ఇలాంటి సినిమాను ఛానెల్ లో ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేయడం మాత్రం ఇబ్బందే. అందుకే చాలా ఛానెళ్లు ఈ సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాయి.
మొన్నటివరకు సెన్సార్ బోర్డుకు అర్జున్ రెడ్డి యూనిట్ కు మధ్య రగడ జరిగిన విషయం తెలిసిందే. శాటిలైట్ రైట్స్ అమ్మాలనుకుంటే మరోసారి అర్జున్ రెడ్డి యూనిట్ సెన్సార్ బోర్డు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఎ-సర్టిఫికేట్ తో విడుదలైన ఈ సినిమాకు కనీసం యు/ఎ సర్టిఫికేట్ వస్తేనే టీవీల్లో ప్రసారం చేయాలి. అలా జరగాలంటే చాలా సన్నివేశాలు, డైలాగ్స్ లేపేయాల్సి ఉంటుంది.
అది పక్కనపెడితే గతంలో జరిగిన గొడవల్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి సెన్సార్ బోర్డు తమ కత్తెరకు మరింత పదునుపెట్టే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే 3 గంటలున్న అర్జున్ రెడ్డి సినిమా నిడివి 2గంటలకు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ప్రస్తుతానికి అర్జున్ రెడ్డి సినిమాపై జీ తెలుగు ఛానెల్ ఫోకస్ పెట్టింది. బోల్డ్ కంటెంట్ ఉన్నప్పటికీ సినిమాను తీసుకునేందుకు ఈ ఛానెల్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కుమారి 21-ఎఫ్ లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీని టెలికాస్ట్ చేసిన అనుభవం వీళ్లకుంది. అదే ఎక్స్ పీరియన్స్ తో అర్జున్ రెడ్డిని కూడా ఈ ఛానెల్ టేకప్ చేసే అవకాశాలున్నాయి. కాకపోతే సెన్సార్ కటింగ్ తర్వాత అర్జున్ రెడ్డికి టీవీల్లో ఎంత రేటింగ్ వస్తుందనేది డౌట్.