బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ఆ మధ్య 'అసహనం' వివాదంలో ఇరుక్కున్న సంగతి తెల్సిందే. తన భార్య దేశంలో పెరిగిపోతున్న అసహనం నేపథ్యంలో, దేశంలో వుండడానికే ఆందోళన చెందుతోందంటూ చేసిన వ్యాఖ్యలతో అమీర్‌ఖాన్ వివాదం కొనితెచ్చుకున్నాడు. ఆ తర్వాత నానా తంటాలూ పడి, ఆ వివాదానికి ముగింపు పలికాడనుకోండి.. అది వేరే విషయం. తాజాగా మరోమారు అమీర్‌ఖాన్ వ్యవహారం చర్చనీయాంశమయ్యింది.
'దాయాది' పాకిస్తాన్‌లో ఇటీవల ఎన్నికలు జరిగాయి. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తన ప్రమాణ స్వీకారానికి భారతదేశం నుంచి పలువురు ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నాడు ఇమ్రాన్‌ఖాన్. ఈ లిస్ట్‌లో భారత మాజీ క్రికెటర్లు నవజ్యోత్ సింగ్ సిద్దు, కపిల్‌దేవ్‌లకు ఆహ్వానం పంపాడు. సినీ ప్రముఖుల్లో అమీర్‌ఖాన్‌కి కూడా ఆహ్వానం పంపాడట. సిద్దూ, ఇమ్రాన్‌ఖాన్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ వెళతానని ప్రకటించేశాడు. అది తన బాధ్యత అని కూడా చెప్పాడు సిద్దూ.
ఇంతకీ, అమీర్‌ఖాన్ పాకిస్తాన్‌కి వెళతాడా? లేదా.? ఈ ప్రశ్న ఆయన్నే అడిగితే, 'ససేమిరా' అనేశాడు. 'నాకు ఆహ్వానం అందలేదు, నేను వెళ్ళను' అనేశాడు అమీర్‌ఖాన్. గతంలో అమీర్‌ఖాన్, భారతదేశంలో అసహనం పెరిగిపోయిందని వ్యాఖ్యానించినప్పుడు అతనికి పాకిస్తాన్ నుంచి పూర్తి మద్దతు లభించింది.
అందుకే అమీర్‌ఖాన్‌పై భారతదేశంలో జనం దుమ్మెత్తిపోశారు. అప్పట్లో ఆయన పలు బ్రాండ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తుండగా, వాటినుంచి ఆయన్ని తొలగించారు. ఈ పరిణామాల్ని దృష్టిలో పెట్టుకునే అమీర్‌ఖాన్, ఇమ్రాన్‌ఖాన్ నుంచి అందిన ఆహ్వానాన్ని 'అందలేదు' అంటూ లైట్ తీసుకున్నాడనుకోవాలేమో.!
ఇదిలా వుంటే, ఇమ్రాన్‌ఖాన్‌కి భారత ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపేశారండోయ్. పాకిస్తాన్‌కి వెళ్ళేందుకూ మోడీ సన్నాహాలు చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ అంటే మోడీకి వల్లమాలిన అభిమానం. ఇప్పుడు ఆ అభిమానం ఇమ్రాన్‌ఖాన్ వైపుకు నరేంద్రమోడీ మళ్ళిస్తున్నారనుకోవాలా.?